Cotton Farmers: పత్తి మీద సాము
ABN, Publish Date - Oct 18 , 2024 | 03:45 AM
ఎంతో శ్రమకోర్చి సాగు చేసిన పంట భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో తెగుళ్ల బారిన పడుతోంది..! మార్కెట్‌కు తీసుకెళ్తే కనీస మద్దతు ధర దక్క డం లేదు..!
45 రోజుల వానలతో దూది రైతుకు దిగులు
ఎకరానికి 4-5 క్వింటాళ్ల దిగుబడీ గగనమే
రాష్ట్రంలో 43 లక్షల ఎకరాల్లో పంట సాగు
33 శాతానికిపైగా నష్టం.. పరిహారం ఊసే లేదు
రూ.475 బోనస్ మాటెత్తని రాష్ట్ర ప్రభుత్వం
సీసీఐ కొనుగోళ్లు లేక మద్దతు ధర కరువు
రూ.7 వేల వరకే చెల్లిస్తున్న వ్యాపారులు
వరంగల్, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఎంతో శ్రమకోర్చి సాగు చేసిన పంట భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో తెగుళ్ల బారిన పడుతోంది..! మార్కెట్‌కు తీసుకెళ్తే కనీస మద్దతు ధర దక్క డం లేదు..! దీంతో రాష్ట్రంలో పత్తి రైతులు డీలా పడుతున్నారు..! అధికారంలోకి వస్తే పత్తికి రూ.475 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ ఊసెత్తకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టం వాటిల్లినా పరిహారం వచ్చే పరిస్థితి లేకపోవడంతో దిగులు పెట్టుకున్నారు. రాష్ట్రంలో 43,76,043 ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. దేశంలో ఈ పంటను అత్యధికంగా సాగు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పత్తి అత్యధికంగా పండిస్తున్నారు.
పరిస్థితుల నేపథ్యంలో నిరుటి కంటే సాగు విస్తీర్ణం తగ్గింది. ఇక నెలన్నర నుంచి కురుస్తున్న వర్షాలు, వాతావరణ పరిస్థితులు రైతును తీవ్రంగా ముంచాయి. ఏటా దసరా, దీపావళి మధ్య తొలి కాత వస్తుంది. ఈ సమయంలోనే వర్షాలు కురవడంతో పంట తెగుళ్ల బారినపడింది. చేలల్లో నీరు నిల్వ ఉండడంతో వేర్లకు తెగుళ్లు సోకి చెట్లు ఎండిపోవడం, కాయలు నల్లబడడం, ఆకులు ఎర్రగా మారుతున్నాయి. ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్లకు దిగుబడికి గాను నాలుగైదు క్వింటాళ్లు మించడం లేదు. మొదటి తీతలోనే దిగుబడి సంగతి తేలిపోవడంతో రైతులు కొన్ని ప్రాంతాల్లో పత్తి చెట్లను తొలగించి, మొక్కజొన్న సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారు. కానీ, నాలుగైదు క్వింటాళ్ల దిగుబడే వస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. వారం నుంచి పెద్ద మార్కెట్లయిన వరంగల్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్లలో క్వింటా రూ.5,300- రూ.7,100 వరకు మాత్రమే ధర పలుకుతోంది. రెండు, మూడు రోజుల్లో 3.5 లక్షల క్వింటాళ్ల పత్తిని రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. కాగా, కేంద్ర ప్రభుత్వం క్వింటా పత్తికి రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. దీనికంటే కూడా తక్కువకే వ్యాపారులు ఖరీదు చేస్తున్నారు. తొలి విడత పత్తి మార్కెట్లోకి వస్తున్నా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తెలంగాణలో కొనుగోళ్లు ప్రారంభించలేదని.. ఇదే అదనుగా వ్యాపారులు, దళారులు ధర భారీగా తగ్గించేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ వైఖరి కారణంగా తాము నష్టపోతున్నామని వాపోతున్నారు.
రూ.475 బోనస్ హమీ ఉత్తదేనా?
ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కొక్క హామీని అమలు చేస్తున్న ప్రభుత్వం రూ.475 బోన్‌సపై దృష్టిపెట్టడం లేదని పత్తి రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్ల పైగా దిగుబడి తగ్గిన నేపథ్యంలో బోనస్ అందిస్తే ఎంతో కొంత ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు. రాష్ట్రంలో 25.33 లక్షల టన్నుల పత్తి వస్తుందని మార్కెటింగ్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన బోనస్ కింద రూ.1,108 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పటికే పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావడంతో బోనస్ రానట్లేనని రైతులు భావిస్తున్నారు. మరోవైపు గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పంట భారీగా దెబ్బతిన్నది. వ్యవసాయ శాఖ అధికారులు 33 శాతం పంట నష్టం వాటిల్లితేనే పరిహారానికి అర్హులుగా గుర్తించారు. వివిధ సాంకేతిక కారణాలతో అర్హులైన వారికి పరిహారం రాలేదనే ఆరోపణలున్నాయి. అయితే, 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడికి గాను 50 శాతం కూడా రావడం లేదని.. ఈ లెక్కన చూసినా నిబంధనల ప్రకారం 33 శాతం కంటే అధికంగానే నష్టం వాటిల్లిందని రైతులు పేర్కొంటున్నారు. 50 శాతం దిగుబడి కోల్పోయిన రైతులను గుర్తించి పరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఎకరాకు 5 క్వింటాళ్లూ రావడం లేదు
ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పత్తి వేశా. రూ.50 వేల చొప్పున రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన. ఎకరానికి ఐదు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదు. వరుస వానలతో తెగుళ్లు విజృంభించి పంట ఎండిపోయింది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. కష్టానికి కూడా ప్రతిఫలం దక్కేలా లేదు. ప్రభుత్వం పత్తి రైతులకు బోన్‌సతో పాటు నష్టపరిహారం కూడా ఇచ్చి ఆదుకోవాలి.
-ర్యాకం రవీందర్, చిట్యాల, భూపాలపల్లి జిల్లా
3 క్వింటాళ్ల దిగుబడీ లేదు..
పత్తి సాగుకు చేసిన ఖర్చులు కూడా రావడం లేదు. రెండెకరాల్లో రూ.లక్ష పైగా పెట్టుబడి పెట్టిన. మా శ్రమకు తగిన ప్రతిఫలం కూడా వచ్చేలా లేదు. 45 రోజులుగా కురిసిన వర్షాలకు తెగుళ్లు సోకాయి. మా ప్రాంతంలో ఎకరానికి మూడు క్వింటాళ్ల దిగుబడీ రాలేదు. ప్రభుత్వం మద్దతు ధరను కల్పించడంతో పాటు బోనస్ చెల్లించాలి.
-కొర్ర గవర్సింగ్, రైతు, పర్శనాయక్ తండా, వరంగల్ జిల్లా
Updated Date - Oct 18 , 2024 | 03:45 AM