Indiramma Housing: ఈ ఏడాదే 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు..
ABN, Publish Date - Sep 27 , 2024 | 03:19 AM
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ.. అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూర్చాలని చూస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.
తొలుత మంజూరు చేయాలనుకున్న 4.50 లక్షల కంటే రెట్టింపు
బిల్లుల చెల్లింపునకు గ్రీన్ చానల్.. ఐదారుగురితో గ్రామ కమిటీలు
అర్హుల ఎంపికకు 360 డిగ్రీ సాఫ్ట్‌వేర్, శాటిలైట్ జియో ట్యాగింగ్
ఇళ్ల కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా ఇంచార్జి మంత్రి, చైర్మన్‌గా కలెక్టర్
హైదరాబాద్, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రతిష్ఠాత్మకంగా భావిస్తూ.. అర్హులైన పేదలందరికీ లబ్ధి చేకూర్చాలని చూస్తున్న ఇందిరమ్మ ఇంటి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. పథకం అమలుకు కావాల్సిన విదివిధానాలు, మార్గదర్శకాలను కొలిక్కితెచ్చింది. తొలుత ఈ ఆర్ధిక సంవత్సరంలో 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని నిర్ణయించినా వాటిని 10 లక్షలకు పెంచినట్లు తెలిసింది. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేసేందుకు అప్ డేటెడ్ సాఫ్ట్‌వేర్ వినియోగంతో పాటు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను నియమించనుంది.
పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్, ఒకరిద్దరితో కలిపి ఐదారుగురితో గ్రామ కమిటీలను వేయనున్నారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి అధికారులతో ఆయా కమిటీలను ఏర్పాటు చేస్తారు. నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్రవాప్తంగా 4,16,500 ఇళ్లు ఇవ్వాలని, రిజర్వ్ కోటా కింద 33,500ఇళ్లను ప్రభుత్వ విచక్షణ (రిజర్వ్ కోటా)లో ఉంచాలని గతంలో భావించింది. ఇప్పుడు 10 లక్షలకు పెంచనుండడంతో ఈ కోటా కూడా పెరగనుంది. డిసెంబరులో నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం 82 లక్షల దరఖాస్తులు రాగా, వీటిలో పట్టణాల్లోవి 23.50 లక్షలు, గ్రామాల్లోవి 58.50 లక్షలున్నాయి. మొదటి దశలో.. అంటే ఈ ఆర్ధిక సంవత్సరంలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో దఫాలో స్థలం లేనివారికి ఇవ్వనున్నారు.
సిబ్బంది వచ్చేశారు..
ఇందిరమ్మ పథకానికి ఉద్యోగులను సమకూరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. హౌసింగ్ కార్పొరేషన్ కింద పనిచేసి వివిధ శాఖలు, సంస్థలకు డిప్యూటేషన్‌పై వెళ్లిన 242 మందిని వెనక్కి తీసుకొచ్చింది. వీరందరూ ఇందిరమ్మ పథకాన్ని పర్యవేక్షించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని చేపట్టినా హౌసింగ్ కార్పొరేషన్ సేవలను పెద్దగా వినియోగించుకోలేకపోయింది. ఉద్యోగులను వివిధ శాఖలు, కార్పొరేషన్లు, బోర్డులకు డిప్యూటేషన్‌పై పంపించింది. హౌసింగ్ కార్పొరేషన్‌ను రోడ్లు భవనాల శాఖలో విలీనం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ‘అభయ హస్తం’ కింద ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. పర్యవేక్షణకు ఉద్యోగులు అవసరం కావడంతో డిప్యూటేషన్‌పై వెళ్లిన ఉద్యోగులను హౌసింగ్ కార్పొరేషన్‌కు రప్పించింది.
కేంద్ర పథకంతో అనుసంధానం..
ఇందిరమ్మ పథకాన్ని పీఎం ఆవాస యోజనకు అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పథకానికి సంబంధించి సంయుక్త పర్యవేక్షణకు అధ్యక్షుడిగా జిల్లా ఇంచార్జి మంత్రి, జిల్లా చైర్మన్‌గా కలెక్టర్ ఉండనున్నారు. బిల్లులు దశలవారీగా చెల్లించనున్న నేపథ్యంలో.. ఆలస్యం లేకుండా అందించేలా గ్రీన్ చానల్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సాంకేతిక అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో అర్హుల జాబితాను గ్రామ కమిటీ ఖరారు చేసి, ఎండీవోకు పంపుతారు. ఎండీవో మరోసారి పరిశీలన చేసి కలెక్టర్‌కు అందజేస్తారు. కలెక్టర్, జిల్లా ఇంచార్జి మంత్రి జాబితాపై నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు అర్హుల ఎంపికలో 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌తోపాటు, శాటిలైట్ జియో ట్యాగింగ్‌ను నియోగించనున్నారు. తొలి విడత లబ్ధి సొంత స్థలం ఉన్నవారికే అందనుంది. అందులోనూ మొదట నిరుపేదలకు, ఆ తరువాత పేదలకు ఇళ్లను అందించనున్నారు.
Updated Date - Sep 27 , 2024 | 03:19 AM