HYDRA: హైడ్రా కోసం 374-బీ
ABN, Publish Date - Oct 01 , 2024 | 03:45 AM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం విస్తృత అధికారాలు కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రత్యేక సెక్షన్‌ను చేరుస్తున్నారు.
మునిసిపల్ చట్టంలో ఈ సెక్షన్ చేరుస్తూ ఆర్డినె న్స్
10 రోజుల క్రితమే రాజ్‌భవన్‌కు ఫైల్
ఆమోదం కోసం ఎదురుచూపులు హైడ్రాకు అదనపు
అధికారాలు ఇస్తూ పలు జీవోలు ఆమోదం కోసం ఎదురుచూపులు
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు ప్రభుత్వం విస్తృత అధికారాలు కల్పిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టంలో ప్రత్యేక సెక్షన్‌ను చేరుస్తున్నారు. 374-బీ పేరిట ఉన్న సెక్షన్‌లోని అంశాలను ఆర్డినెన్స్‌లో పొందుపరిచి ప్రభుత్వం దాని ఆమోదం కోసం గవర్నర్‌కు పంపింది. గత పది రోజులుగా గవర్నర్ ఆమోదం కోసం సర్కారు ఎదురు చూస్తోంది. ఈ నెల 20న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ప్రవేశపెట్టిన ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర లభించిన మరుసటి రోజే అది రాజ్‌భవన్‌కు చేరింది. హైడ్రాకు ఔటర్ రింగ్ వరకు ఉన్న పరిధిలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం అవసరమయ్యే పలు రకాల అధికారాలను బదలాయిస్తూ ఆయా అంశాలను ఆర్డినెన్స్‌లో పొందుపర్చారు. మంత్రివర్గ సమావేశంలోని నిర్ణయాల మేరకు ఈ అధికారాలకు సంబంధించిన పలు జీవోలను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.
ఆర్డినె న్స్‌లో ఏముంది?
తెలంగాణ కోర్ అర్బన్ రీజన్ పరిధిలోని ప్రభుత్వ ఆస్తులను రక్షించేందుకు హైడ్రాకు ఎదురవుతున్న కొన్ని ఆటంకాలను తొలగిస్తూ, దానికి విశేష అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ రూపొందించింది. హైడ్రాకు బదలాయించిన అధికారాలను వివరిస్తూ జీహెచ్‌ఎంసీ చట్టం 1955లో ప్రత్యేకంగా 374-బీ సెక్షన్‌ను చేరుస్తున్నారు. ఈ సెక్షన్‌లో రాష్ట్రంలోని ఒక కార్పొరేషన్, లేదా ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్లు, డ్రెయిన్లు, వీధులు, నీటి వనరులు, ఖాళీ స్థలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా వాటిని పరిరక్షించడానికి అవసరమైన అన్ని అధికారాలను హైడ్రాకు బదిలి చేస్తూ ఆయా అంశాలను పొందుపరిచారు.
ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఎలాంటి అధికారాలనైనా అమలు చేయడానికి, బదలాయించడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుందని సెక్షన్‌లో పేర్కొన్నారు. కాలానుగుణంగా ప్రభుత్వం సూచించిన ఈ అధికారాలు మారుతూ ఉంటాయని సెక్షన్ 374-బీలో పొందుపర్చారు. అంటే ప్రభుత్వం ఓఆర్‌ఆర్ పరిధిలోని అన్ని రకాల ప్రభుత్వ శాఖల (జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్ వర్క్స్, రెవెన్యూ, మునిసిపాలిటీలు) అధికారాలను హైడ్రాకు బదిలీచేస్తూ ఆర్డినెన్స్‌ను రూపొందించినట్లు తెలిసింది.
ఎందుకు చేయాల్సి వచ్చింది?
హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని చెరువుల్లో ఉన్న ఆక్రమణలను తొలగించాలని హైడ్రా నోటీసులు జారీ, కూల్చివేతల సందర్భంలో వివిధ ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాల్సి వస్తోంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలపై ఆధారపడాల్సి వస్తోంది. ఆయా శాఖలకు సంబంధించిన పలు చట్టాల పరిధిలో పని చేయాల్సి వస్తోంది. ఈ సెక్షన్‌ను చేరిస్తే సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయవచ్చునని లేదా అవసరాన్ని బట్టి వారి అధికారాలు హైడ్రాకు అప్పగించాలని ఆయా శాఖలను ఆదేశించవచ్చు.
అధికారాలు బదలాయిస్తూ జీవోలు
హైడ్రాకు అధికారాలు బదలాయించే క్రమంలో ప్రభుత్వం పలు జీవోలు జారీ చేసింది. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ మునిసిపల్ చట్టం 2019, హైదరాబాద్ వాటర్ వర్క్స్ చట్టం 1989, హెచ్‌ఎండీఏ చట్టం 2008లోని కొన్ని అధికారాలను హైడ్రాకు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజన్‌లోని చెరువుల పరిరక్షణ కమిటీ చైర్మన్‌గా, హెచ్‌ఎండీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యునిగా, ఉమ్టాలో సభ్యునిగా చేరుస్తూ వివిధ జీవోలు జారీ చేసింది. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని అన్ని ప్రభుత్వ ఆస్తులు, చెరువుల రక్షణకు అవసరమైన అధికారాలు హైడ్రాకు దఖలు పరిచినట్లయింది.
తెలంగాణ మునిసిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్ 72 ప్రకారం మునిసిపాలిటీలను పర్యవేక్షించడానికి అధికారులను నియమిస్తూ ప్రభుత్వానికి ఉన్న అధికారం, సెక్షన్ 99ప్రకారం కమిషనర్ లేదా ఎవరైనా అధీకృత అధికారి నుంచి సమాచారాన్ని కోరడానికీ, ఆ ప్రాంతంలో ప్రవేశించే అధికారం, సెక్షన్186 ప్రకారం నీటి వనరులు, పార్కులు, వారసత్వ కట్టడాలను రక్షించే అధికారం హైడ్రాకు బదలాయిచింది.
హెచ్‌ఎండబ్ల్యుఎ్‌సఎ్‌సబీ చట్టం 1989 లోని సెక్షన్-81 ప్రకారం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రక్షణ, ఇతర విఽధులను నిర్వర్తించే అధికారం హైడ్రాకు ఇవ్వనున్నారు.
హెచ్‌ఎండీఏ చట్టం 2008లోని సెక్షన్ 5 ప్రకారం హైడ్రా కమిషనర్‌ను హెచ్‌ఎండీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యునిగా నియమిస్తూ జీవో
ఉమ్టాలో సెక్షన్ 16 (1) ప్రకారం హైడ్రా కమిషనర్‌ను కూడా సభ్యునిగా చేరుస్తూ జీవో జారీ.
ఓఆర్‌ఆర్ పరిధిలోని మొత్తం ప్రాంతం, జంట జలాశయాలు, జంట నగరాల్లోని అన్ని చెరువుల పరిరక్షణకు సంబంధించి హైడ్రా కమిషనర్ చైర్మన్‌గా, హెచ్‌ఎండీఏ కమిషన్ కో చైర్మన్‌గా చెరువుల రక్షణ కమిటీని ఏర్పాటు చేస్తూ సెప్టెంబరు 18న జీవో 129 జారీ.
Updated Date - Oct 01 , 2024 | 03:45 AM