Ponnam Prabhakar: తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు రండి
ABN, Publish Date - Dec 08 , 2024 | 03:15 AM
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సోమవారం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేయాలంటూ కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు.
మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన పొన్నం
ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి పిలుపు.. గంటపాటు అక్కడే
కేసీఆర్ కోరడంతో భోంచేశా.. ఆప్యాయంగా మాట్లాడారు:మంత్రి
మర్కుక్, హైదరాబాద్, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలికింది. సోమవారం జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేయాలంటూ కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వానించారు. ఇందుకు ఆయన శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌ్‌సకు వచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వాన పత్రికను అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, ఇతర అధికారులు ఉన్నారు. మంత్రి, అధికారులు గంటపాటు ఫామ్‌హౌ్‌సలోనే ఉన్నారు.
అనంతరం పొన్నం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాలకు రావాలంటూ ప్రభుత్వం తరఫున విపక్షనేత కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు చెప్పారు. తెలంగాణ సమాజంలోని పరస్పర గౌరవం అనే భావనకు పెద్దపీట వేస్తూ, అలాగే తెలంగాణ సమాజాన్నంతా వేడుకలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో కేసీఆర్‌కు ఆహ్వానం పలికామని వివరించారు. కేసీఆర్ తమతో చాలా ఆప్యాయంగా మాట్లాడారని చెప్పారు. భోజనం సమయానికి ఫామ్‌హౌ్‌సకు వెళ్లామని.. తప్పకుండా భోజనం చేయాలని తమను ఆయన కోరడంతో భోజనం చేశామని వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్‌ఎస్ నాయకులు పలు విమర్శలు చేస్తున్నారంటూ విలేకరులు ప్రశ్నించగా.. పొన్నం సమాధానం ఇస్తూ రాజకీయంగా ఇలాంటివి బయట మాట్లాడుకోవడం సహజం అని, కేసీఆర్‌తో భేటీ సందర్భంగా ఈ విషయం తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు.
గవర్నర్, కేంద్రమంత్రిని ఆహ్వానించిన పొన్నం
ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలంటూ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి శనివారం రాజ్‌భవన్లో గవర్నర్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని పొన్నం ప్రభాకర్ రాజ్‌భవన్ దిల్ కుశా అతిథి గృహంలో కలుసుకున్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో పాల్గొనాలని, తెలంగాణ తల్లి విగ్రహ అవిష్కరణకు రావాలని కిషన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు.
Updated Date - Dec 08 , 2024 | 03:15 AM