Tummala: సోనియా పుట్టిన రోజు నాటికి రుణమాఫీ పూర్తి
ABN, Publish Date - Oct 19 , 2024 | 04:48 AM
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు (డిసెంబరు 9) నాటికి ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణ మాఫీని పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
7,500 చొప్పున రైతు భరోసా త్వరలోనే పంపిణీ
వచ్చే బడ్జెట్‌లో రైతు కూలీలకు నిధుల కేటాయింపు
రైతులు పామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలి: తుమ్మల
వికారాబాద్, అక్టోబర్ 18 (ఆంధ్ర జ్యోతి): కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పుట్టిన రోజు (డిసెంబరు 9) నాటికి ప్రతీ రైతుకు రూ.2లక్షల రుణ మాఫీని పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గతంలో ప్రధాని మన్మోహ న్ సింగ్ హయాంలో దేశ వ్యాప్తంగా రూ.70 వేల కోట్ల మేర రుణమాఫీ చేశారని, ఆ తర్వాత సీఎం రేవంత్ ఒకే సారి రూ.31వేల కోట్లు మాఫీ చేస్తున్నారని గుర్తు చేశారు. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో శుక్రవారం నిర్వహించిన మర్పల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ త్వరలోనే ఎకరాకు రూ.7500 చొప్పున రైతు భరోసా అందిస్తామన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వచ్చే బడ్జెట్‌లో వ్యవసాయ రైతు కూలీలకూ నిధులు కేటాయిస్తామన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు మంత్రి పదవి వస్తే బాగుండేదని వికారాబాద్ ప్రజలు కోరుకున్నారని, కానీ.. ఇప్పుడు సీఎంతో సహా మొత్తం మంత్రివర్గమంతా ఆయన అధీనంలోనే ఉందని గుర్తు చేశారు. స్పీకర్‌కు కోపం వస్తే మామూలుగా ఉండదని, ఆయన దగ్గర మంత్రివర్గం మొత్తం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉంటుందని వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తయితేవికారాబాద్ ప్రాంతం సస్యశామలం అవుతుందన్నారు.
రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యానవన, కూరగాయ పంటలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి అని, రైతులు పామాయిల్ సాగుపైనా దృష్టి సారించాలని సూచించారు. ప్రస్తుతం లక్షల కోట్లు వెచ్చించి ఇతర దేశాల నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నామని, ఆ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయినా హామీల అమలుకు సీఎం రేవంత్ కట్టుబడి ఉన్నారని గుర్తు చేశారు. సంక్షేమ పథకాలన్నీ పూర్తి స్థాయిలో అమలయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
Updated Date - Oct 19 , 2024 | 04:48 AM