Indiramma Housing Scheme: చిన్న తప్పు.. వెయ్యి కోట్ల నష్టం చేస్తుంది!
ABN, Publish Date - Dec 24 , 2024 | 04:05 AM
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని.. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగొద్దు
దరఖాస్తుల పరిశీలన జాగ్రత్తగా చేయాలి
జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు.. గృహనిర్మాణ శాఖ ఎండీ గౌతమ్ సర్క్యులర్
హైదరాబాద్, డిసెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. గతంలో ఇళ్ల పథకంలో జరిగిన అవకతవకలను పరిగణనలోకి తీసుకుని.. ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ అన్ని జిల్లాల కలెక్టర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనపై కీలక సూచనలు చేస్తూ సోమవారం ఒక సర్క్యులర్ పంపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 80.50 లక్షల దరఖాస్తులు వచ్చాయని, యాప్ ద్వారా వీటిని పరిశీలించే క్రమంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచించారు. గత ప్రభుత్వాల హయాంలో అమలు చేసిన ఇళ్ల పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరిగాయని గుర్తుచేశారు. అలాంటి తప్పులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదన్నారు.
ప్రభుత్వం కోట్ల రూపాయల ఖర్చుతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని, క్షేత్ర స్థాయిలో పరిశీలకులు చిన్న తప్పు చేసినా.. అది రూ.వెయ్యి కోట్ల నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. ఈ దృష్ట్యా దరఖాస్తుదారుల్లో అర్హులను జాగ్రత్తగా ఎంపిక చేయాల్సి ఉందన్నారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదేనా, లేదా అనే విషయాన్ని పరిశీలకులే నిర్ధారించాలన్నారు. యాప్‌లో నమోదైన వివరాలపై 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌తో మరోసారి ఉన్నతస్థాయిలో పరిశీలన జరుగుతుందని తెలిపారు. సొంత ఇంటిని నిర్మించుకోవాలనే ఆలోచనతో కొంతమంది స్థలం లేకపోయినా పక్క వారి భూమి లేదా ప్రభుత్వ భూమిని తమకు చెందినదిగా చూపించే అవకాశాలు లేకపోలేదని ఎండీ అన్నారు. ఈ నేపథ్యంలో పరిశీలకులు చాలా జాగ్రత్తగా ఆ స్థలాన్ని నిర్ధారించిన తరువాతే యాప్‌లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తుదారు ఫొటో దిగిన సమయంలో ఆ స్థలం జియో ట్యాగింగ్ అవుతుందని పేర్కొన్నారు. ఇక స్థానిక ఎంపీడీవోలకు సూపర్ పవర్ చెకింగ్ అధికారాన్ని ఇస్తున్నట్లు తెలిపారు.
Updated Date - Dec 24 , 2024 | 04:05 AM