ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Indiramma House: ‘ఇందిరమ్మ ఇళ్ల’కు కమిటీలు!

ABN, Publish Date - Oct 12 , 2024 | 03:49 AM

రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

  • గ్రామ, మునిసిపల్‌ స్థాయిలో ఏర్పాటు

  • ఊళ్లలో సర్పంచ్‌ లేదా పంచాయతీ ప్రత్యేకాధికారి చైర్మన్‌

  • మునిసిపాలిటీలో చైర్మన్‌గా కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌

  • సభ్యులుగా బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒక్కొక్కరు

హైదరాబాద్‌, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘ఇందిరమ్మ ఇల్లు’ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కమిటీలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిష్ఠాత్మక పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ‘ఇందిరమ్మ కమిటీ’లను నియమించనుంది. శుక్రవారం ఈ కమిటీల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పంచాయతీ, మునిసిపల్‌ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కమిటీల నియామకానికి శనివారంకల్లా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. అలాగే కమిటీల నియామకానికి పేర్లను పంపాలని మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలను ఆదేశించింది. గ్రామస్థాయిలో ఏర్పాటు చేసే కమిటీకి సర్పంచ్‌ లేదా పంచాయతీ ప్రత్యేక అధికారి చైర్మన్‌గా, పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా ఉంటారు.


మునిసిపల్‌ వార్డు స్థాయిలో వార్డు కౌన్సిలర్‌ లేదా కార్పొరేటర్‌ చైర్మన్‌గా, వార్డు అధికారి కన్వీనర్‌గా ఉంటారు. ఈ రెండు కమిటీల్లో.. స్వయం సహాయక సంఘాల నుంచి ఇద్దరు మహిళలు, గ్రామ, మునిసిపల్‌ వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ముగ్గురిని సభ్యులుగా నియమించనున్నారు. ఈ ముగ్గురిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమించాలని ఉత్తర్వుల్లో సూచించారు. కమిటీల్లో నియమించేవారి పేర్లను ఎంపీడీవో, మునిసిపల్‌ కమిషనర్లు కలెక్టర్లకు పంపుతారు. అనంతరం కలెక్టర్లు ఆ వివరాలను జిల్లాల ఇన్‌చార్జి మంత్రులకు వివరించి, వారి ఆమోదంతో కమిటీలను ఏర్పాటు చేస్తారు. తర్వాత కమిటీల చైర్మన్లు, కన్వీనర్లు, సభ్యులకు పథకం అమలుపై అవగాహన తరగతులను కూడా నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.


  • ‘ప్రజాపాలన’ దరఖాస్తులు కమిటీలకు..!

ఈ కమిటీలు ఇందిరమ్మ పథకం గురించి ఎప్పటికప్పుడు గ్రామ, మునిసిపల్‌ వార్డు స్థాయిలో అవగాహనను పెంపొందించే కార్యక్రమాలను చేపడతాయి. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సహాయంగా ఉండడంతో పాటు సోషల్‌ ఆడిట్‌ను నిర్వహించనున్నాయి. అర్హులకు ఇల్లు అందకపోవడం, అలాగే అనర్హులకు దక్కడం లాంటివి ఏమైనా జరిగితే.. ఆ వివరాలను ఎంపీడీవోలకు, మునిసిపల్‌ కమిషనర్లకు తెలియజేయడంలో కమిటీలు కీలకపాత్ర పోషించనున్నాయి.


మరోవైపు గత ఏడాది డిసెంబరులో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను కమిటీలకు అందించనున్నట్లు సమాచారం. అదే విధంగా కమిటీ చైర్మన్‌, సభ్యులకు గ్రామ, మునిసిపల్‌ వార్డు స్థాయిలో ఇళ్లు లేని అర్హులైన పేదల వివరాలు తెలిసి ఉంటే ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులు, కమిటీ క్షేత్రస్థాయిలో గుర్తించిన వారి జాబితాను పరిగణనలోకి తీసుకుని ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిసింది. ప్రజాపాలన కార్యక్రమంలో ఇళ్ల కోసం దాదాపు 82 లక్షల దరఖాస్తులు రాగా, వీటిలో అర్బన్‌ పరిధిలో 23.50 లక్షలు, రూరల్‌లో 58.50 లక్షలు ఉన్నట్లు సమాచారం.

Updated Date - Oct 12 , 2024 | 03:49 AM