Uttam: సన్నం, దొడ్డు వడ్లు వేర్వేరుగా కొనుగోలు
ABN, Publish Date - Sep 24 , 2024 | 02:58 AM
సన్న వడ్లు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అక్టోబరు మొదటివారం నుంచే ఖరీఫ్ ధాన్యం సేకరణ
7,139 కేంద్రాలు.. 91 లక్షల టన్నుల ధాన్యం అంచనా
సన్నాలకు ఈ సీజన్ నుంచే రూ.500 బోనస్
బకాయిలున్న మిల్లర్లకు ధాన్యాన్ని ఇచ్చేది లేదు
పొరుగు రాష్ట్రాల నుంచి రాకుండా చెక్‌పోస్టులు
జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): సన్న వడ్లు, దొడ్డు వడ్లకు వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. వచ్చే జనవరి నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) ద్వారా సన్నబియ్యం పంపిణీకి సమాయత్తమవుతున్న ప్రభుత్వం.. ఈ సారి అక్టోబరు మొదటి వారం నుంచే ధాన్యం సేకరణను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 7,139 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి 91.28 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించింది.
ఈ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 4,496 సెంటర్లు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 2,102 సెంటర్లు, ఇతరుల ద్వారా మరో 541 సెంటర్లు.. మొత్తం 7,139 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు, రైస్ మిల్లుల్లో పాత ధాన్యం నిల్వలున్న నేపథ్యంలో 40 లక్షల టన్నుల ధాన్యం నిల్వచేయటానికి గోదాములను కూడా ఏర్పాటు చేశారు. సాధారణంగా ఖరీఫ్ ధాన్యం సేకరణ అక్టోబరు చివరి వారం నుంచి మొదలవుతుంది. అయితే, ముందస్తుగా వరి నాట్లువేసి, వరి కోతలు ముందుగా జరిగే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ప్రైవేటు ట్రేడర్లు రైతులను మోసం చేయకుండా అక్టోబరు మొదటి వారం నుంచే ధాన్యం సేకరణ ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
అక్టోబరు మొదటి వారంలోప్రారంభమై... జనవరి నెలాఖరు వరకు ధాన్యం సేకరణ జరగనుంది. ఖరీఫ్‌లో సాగుచేసిన మొత్తం 60.39 లక్షల ఎకరాల వరి విస్తీర్ణంలో.. 36.80 లక్షల ఎకరాల్లో సన్నరకాలు వేయగా 88.09 లక్షల టన్నుల సన్న ధాన్యం దిగుబడి వస్తుందని, 23.58 లక్షల ఎకరాల్లో రైతులు దొడ్డు రకాలు సాగుచేయగా.. 58.18 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దొడ్డు రకాలను కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ)కు కొనుగోలు చేయనున్నారు. 2024-25 సీజన్‌కు గాను వరి ధాన్యం సాధారణ రకానికి క్వింటాలుకు రూ.2,300, ఏ-గ్రేడు ధాన్యానికి రూ.2,320 చొప్పున మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ ఎమ్మెస్పీ కంటే సన్నాలకు క్వింటాలుకు రూ.500 అదనంగా బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఆ నిర్ణయాన్ని అమలు చేయనుంది. ఈ లెక్కన సన్నరకాలకు క్వింటాలుకు రూ.2,800 వరకు ఉంటుంది.
అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించం
గతంలో ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకొని మిల్లింగ్ చేసి బియ్యం ఇవ్వకుండా డిఫాల్టర్ల జాబితాలో ఉన్న రైస్‌మిల్లర్లకు ఈసారి ఖరీఫ్ సీజన్ ధాన్యం ఇచ్చేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ టార్గెట్ పూర్తిచేయకుండా అక్రమాలకు పాల్పడిన రైస్‌మిల్లర్లను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఖరీఫ్ ధాన్యం సేకరణపై ఉత్తమ్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అధికారులు ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరించి సేకరణ లక్ష్యాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటుచేయాలన్నారు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని కొనుగోలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీ్‌ఫలో సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి.. జనవరి నుంచి రేషన్ కార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు.
Updated Date - Sep 24 , 2024 | 02:58 AM