Jishnu Dev Varma: స్వయం సమృద్ధి సాధించేలా పంచాయతీలను అభివృద్ధి చేయాలి
ABN, Publish Date - Aug 23 , 2024 | 03:56 AM
స్వయం సమృద్ధ్ధి సాధించేలా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని అధికారులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు.
కీలక విభాగాల ఉన్నతాధికారులతో గవర్నర్
హైదరాబాద్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): స్వయం సమృద్ధ్ధి సాధించేలా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేయాలని అధికారులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. రాష్ట్ర నూతన గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కీలక విభాగాల ఉన్నతాధికారులతో రాజ్‌భవన్‌లో గురువారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా విభాగాల పనితీరు, సాధించిన విజయాలు, కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కొన్ని విభాగాల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో తమ శాఖ పనితీరును గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. అన్ని అంశాల్లో స్వయం సమృద్ధి సాధించి మోడల్ గ్రామ పంచాయతీలుగా సేవలు అందించే వాటిని ఎంపిక చేసి అభివృద్ధి చేయాలన్నారు. ఆయా విభాగాల పనితీరును గవర్నర్ అభినందించారు. మునిసిపల్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, గిరిజన, పర్యాటక, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.
Updated Date - Aug 23 , 2024 | 03:56 AM