High Court: మార్గదర్శి కేసులో వాదనలకు సిద్ధంకండి
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:24 AM
మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో వాదనలు వినిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సిద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు నిర్దేశించింది.
రిజర్వు బ్యాంకుకు తెలంగాణ హైకోర్టు నిర్దేశం
హైదరాబాద్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో వాదనలు వినిపించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సిద్ధంగా ఉండాలని తెలంగాణ హైకోర్టు నిర్దేశించింది. అదేవిధంగా డిపాజిటర్లు, ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించిన నగదు వివరాలకు సంబంధించి సమర్పించిన 69,530 పేజీల వివరాలను ఎలక్ర్టానిక్ రూపంలో సిద్ధం చేయాలని మార్గదర్శికి సూచించింది. ఈ కేసును రెండు కోణాల్లో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు నిర్దేశించిందని వ్యాఖ్యానించింది. పబ్లిక్ నోటీసు ఇచ్చి ఇంకా ఎవరైనా అభ్యంతరాలు ఉన్నవారు ఉంటే వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు, ఆర్బీఐ వాదనలు సైతం వినాల్సి ఉంటుందని తెలిపింది.
ఈ కేసు విచారణ పారదర్శకంగా ఉండాలంటే డిపాజిటర్లకు చేసిన చెల్లింపుల వివరాలను పెన్‌డ్రైవ్(ఎలక్ర్టానిక్) రూపంలో పిటిషనర్ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు అందజేయడమే ఉత్తమమని కోర్టు తెలిపింది. ఇప్పటికే హార్డు కాపీలు ఆయనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎలక్ర్టానిక్ రూపంలో ఇవ్వడం వల్ల వచ్చే నష్టమేమీ ఉండదని పేర్కొంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లు సేకరించిందని పేర్కొంటూ అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీనిని కొట్టేయాలని కోరుతూ మార్గదర్శి సంస్థ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిని 2018లో హైకోర్టు అనుమతిస్తూ మార్గదర్శిపై కేసు కొట్టేసింది. హైకోర్టు తీర్పుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు.. మళ్లీ విచారించాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. సోమవారం జరిగిన విచారణలో ఉండవల్లి అరుణ్‌కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు.
Updated Date - Oct 22 , 2024 | 04:24 AM