Mee Seva: మొబైల్ ‘మీ సేవ’
ABN, Publish Date - Dec 09 , 2024 | 03:47 AM
ఆధునిక సాంకేతికత ద్వారా రైతులకు మెరుగైన సేవలు దక్కేలా, మహిళా సాధికారత, యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే 150 సేవలు
యాప్, టీ ఫైబర్ సేవలను ప్రారంభించిన శ్రీధర్‌బాబు
రూ.7,592 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
హైదరాబాద్, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతికత ద్వారా రైతులకు మెరుగైన సేవలు దక్కేలా, మహిళా సాధికారత, యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా, అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 150 రకాల పౌర సేవలను పొందేలా రూపొందించిన మొబైల్ మీ సేవ యాప్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. మీ సేవ ద్వారా ఇప్పటికే 400 పైగా సేవలు అందుతున్నాయని, అదనంగా గ్యాప్ సర్టిఫికెట్, మైనార్టీ, ఆదాయ, క్రిమీలేయర్, నాన్ క్రిమీలేయర్ ధ్రువపత్రాలు, టింబర్ డిపో, కట్టెల మిల్లుల అనుమతల పునరుద్ధరణ పత్రాలను చేర్చామన్నారు. మీ సేవ యాప్, టీ ఫైబర్ ప్రారంభం, పలు కంపెనీలతో పెట్టుబడుల ఒప్పందాలపై హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రైతులకు రుణ మాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు వివరించారు.
ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో మీ సేవతో అవసరమైన పత్రాలు పొందేందుకు కియో్‌స్కలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పించే టీ-ఫైబర్‌ను రాష్ట్రం నలుమూలలకు విస్తరిస్తామని చెప్పారు. దీని ద్వారా మొబైల్, కంప్యూటర్, టీవీ వినియోగించవచ్చన్నారు. ఈ సేవలను పరిశీలించి మరింత సౌకర్యంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. టీ ఫైబర్ ద్వారా సంగారెడ్డి జిల్లా శ్రీరాంపూర్ వాసులతో మాట్లాడారు. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష, స్థానికులతోనూ సంభాషించారు. మద్దూరు, సంగుపేటల్లోనూ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించారు. మద్దూరు సీఎం రేవంత్‌రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌లోనిదని, మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా బ్రాడ్‌బ్యాండ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారని శ్రీధర్‌బాబు తెలిపారు. స్మార్ట్ అగ్రి క్రెడిట్-ఫైనాన్స్, భూమి పోషకాల నిర్వహణపై సలహాలు, తెగుళ్లు, వాతావరణ మార్పులపై సూచనలు, వ్యవసాయ రికార్డుల డిజిటలైజేషన్ చేస్తున్నామని మంత్రి చెప్పారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ బారినపడకుండా మిత్ర అనే యాప్‌ను తెచ్చారు.
ఏడీఈఎక్స్‌తో 2 రోజుల్లోనే రుణం
రైతులకు సత్వర సేవలందించేందుకు అగ్రికల్చర్ డేటా ఎక్స్ఛేంజీ (ఏడీఈఎక్స్) అప్లికేషన్ దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా లబ్ధి పొంది న రైతులతో మాట్లాడారు. గతంలో రుణం తీసుకునేందుకు 35 రోజులు పట్టగా ఏడీఈఎక్స్ సహకారంతో 2 రోజుల్లోనే పొందినట్లు రైతులు వివరించారు.
7,592 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో రూ.7,592 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఏరో స్పేస్, రక్షణ రంగాల్లో అజాద్ ఇంజనీరింగ్‌కు సంబంధించిన భూపతిరాజు తొలి దశలో రూ.300 కోట్లు, రెండో దశలో రూ.500 కోట్లతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. 600 మందికి ఉపాధి కల్పించే ఈ సంస్థకు ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయించింది. రూ.1950 కోట్లతో సోలార్ అల్యూమినియం ప్యానెల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుపై ప్రీమియర్ ఎనర్జీస్ ఎండీ రేవతి రోహిణి ఒప్పందం చేసుకున్నారు. 1500 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమకు 125 ఎకరాలు కేటాయించారు. రూ.3,342 కోట్లతో ఎంఎక్స్ ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 4 గిగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 1000 మందికి ఉపాధి దొరకనుంది. లెన్స్‌కార్ట్ ప్రతినిధి అమిత్ చౌదరి రూ.1500 కోట్లతో పరిశ్రమ స్థాపనకు ఒప్పందం చేసుకున్నారు. ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లో భూమిని కేటాయించారని తెలిపారు.
Updated Date - Dec 09 , 2024 | 03:47 AM