ఇక పంచాయతీరాజ్‌లో ఒకే విడత రిజర్వేషన్
ABN, Publish Date - Dec 22 , 2024 | 04:37 AM
పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్లు ఇక నుంచి ప్రతిసారి మారనున్నాయి. ఇంతవరకు రిజర్వేషన్లు రెండు పర్యాయాలు అమల్లో ఉండగా దీనిని తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేశారు.
ఉప సర్పంచినీ సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్‌కు
ప్రతి మండలానికి కనీసం అయిదుగురు ఎంపీటీసీలు
చట్టంలో సవరణలకు శాసనమండలి ఆమోదం
హైదరాబాద్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ వ్యవస్థలో భాగమైన గ్రామపంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లలో రిజర్వేషన్లు ఇక నుంచి ప్రతిసారి మారనున్నాయి. ఇంతవరకు రిజర్వేషన్లు రెండు పర్యాయాలు అమల్లో ఉండగా దీనిని తొలగిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు చేశారు. ఇకపై రిజర్వేషన్లు ఒక పర్యాయానికే పరిమితం కానున్నాయి. దీంతో పాటు పలు సవరణలకు శనివారం శాసనమండలి ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేయకపోవడం, నిధుల దుర్వినియోగంపై సర్పంచిని సస్పెండ్ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉండేది. ఆ తర్వాత ఉప సర్పంచి.. సర్పంచిగా బాధ్యతలు స్వీకరిస్తే అతడు కూడా అవినీతికి పాల్పడితే తొలగించే అధికారం కలెక్టర్‌కు ఉండేది కాదు.
తాజా సవరణల్లో సర్పంచిగా బాధ్యతలు నిర్వహించే ఉప సర్పంచిని సస్పెండ్ చేసే అధికారం కూడా కలెక్టర్‌కు అప్పగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులతోపాటు వార్డు సభ్యులు సైతం తమ ఎన్నికల ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉండేది. తాజా సవరణల్లో వార్డు సభ్యులకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం 3-4వేల జనాభాకు ఒక ఎంపిటిసి సభ్యుడు చొప్పున ఉండగా.. దీనిని మార్చారు. ఇక నుంచి ప్రతి మండల పరిషత్ పరిధిలో కనీసం అయిగురు ఎంపిటిసిలు ఉంటారు. ఔటర్ రింగురోడ్డు పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీప పురపాలికల్లో విలీనం, రాష్ట్రవ్యాప్తంగా 80 గ్రామ పంచాయతీలను స్థానిక పురపాలికల్లో విలీనం చేస్తూ చట్టంలో సవరణలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ఎన్నికల సంఘం, ట్రైబ్యునల్ సూచనల మేరకు చట్టంలో సవరణలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు.
Updated Date - Dec 22 , 2024 | 04:37 AM