Pongulati: ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలతాయి!
ABN, Publish Date - Oct 24 , 2024 | 03:00 AM
దీపావళికి ముందే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ బాంబు పేల్చారు. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో హాన్ నది పునరుజ్జీవనంపై అధ్యయనానికి వెళ్లిన పొంగులేటి అక్కడ ఓ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి సహా 10 అంశాల్లో చర్యలు
ప్రధాన నేతలకు షాక్ తప్పదు పూర్తి ఆధారాలతో ఫైళ్లు సిద్ధం
తప్పు చేసింది ఎవరైనా విడిచిపెట్టం
దక్షిణ కొరియాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): దీపావళికి ముందే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజకీయ బాంబు పేల్చారు. దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో హాన్ నది పునరుజ్జీవనంపై అధ్యయనానికి వెళ్లిన పొంగులేటి అక్కడ ఓ తెలుగు చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని.. ప్రధాన నేతలకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి వంటి సుమారు 8 నుంచి 10 ప్రధాన అంశాల్లో చర్యలు ఉంటాయన్నారు. ఇందుకు సంబంధించి అన్ని సాక్ష్యాధారాలతో ఫైళ్లు కూడా సిద్ధం చేశామని తెలిపారు.
సియోల్ నుంచి హైదరాబాద్ చేరేలోపే ఈ చర్యలు ప్రారంభమవుతాయన్నారు. ఇది కక్ష్యసాధింపు కాదని.. పూర్తి ఆధారాలతో సర్కారు చర్యలు తీసుకోబోతోందని స్పష్టం చేశారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ దాదాపు పూర్తయిందని, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి చర్యలు లేవని ప్రజలు భావించవద్దని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాలతో ముందుకు రాబోతున్నామని వెల్లడించారు.
అన్ని భూ సమస్యలకు చెక్ పెట్టేలా..
భూహక్కులపై సామాన్య రైతుల నుంచి భూస్వాముల వరకు ఎవరికి అపోహలకు తావు లేకుండా అన్ని సమస్యలకు చెక్‌పెట్టేలా కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తెస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. అభద్రతలో ఉన్న లక్షలాది మంది రైతులకు ఇందిరమ్మ ప్రభుత్వం భరోసా కల్పించబోతోందని స్పష్టం చేశారు. 15 దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ రెవెన్యూ విధానాలను అధ్యయనం చేసి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించామన్నారు. అంతేకాకుండా ముసాయిదాపై సామాన్య రైతులు, మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరించి వారి సూచనలు, సలహాలను క్రోడీకరించి చట్టంలో పొందుపర్చామని వెల్లడించారు.
ధరణి లోపాల వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. లక్షలాది ఎకరాల భూరికార్డులను విదేశీ సంస్థల చేతిలో పెట్టిన కేసీఆర్.. పోర్టల్ నిర్వహణ పేరుతో రూ.కోట్ల ఖర్చు చేశారని ఆరోపించారు. పార్ట్-బీలో ఉన్న 13 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడంతోపాటు ధరణిలో కనిపించకుండా ఉన్న భూములను బయటపెట్టి అర్హులకు, హక్కుదారులకు దక్కేలా చూస్తామని చెప్పారు. గతంలో మాన్యువల్‌గా ఉన్న పహాణీలో 32 కాలాలు ఉండేవని అవన్నీ గత ప్రభుత్వం తొలగించి ధరణి ముసుగులో ఒకే కాలం పెట్టి గందరగోళ పరిస్థితిని సృష్టించిందన్నారు. ఇదే కాలంలో మార్పులు చేసి సుమారు 14 కాలాలు ఉండేలా ధరణి పేరు మార్చి కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తేబోతున్నామన్నారు. ప్రతి రైతుకు క్లియర్ టైటిల్‌తో డాక్యుమెంట్ ఉండబోతోందని వివరించారు.
Updated Date - Oct 24 , 2024 | 08:08 AM