Bhatti Vikramarka: క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు చేయండి
ABN , Publish Date - Nov 28 , 2024 | 04:39 AM
రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు
ఎల్బీ స్టేడియంలో ఉత్సవాలకు సీఎం హాజరు
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజా భవన్‌లో వేడుకల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 200 ప్రాంతాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్ ఉత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఇందుకు జీహెచ్‌ఎంసీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని చర్చిల అధిపతులు పాల్గొనేలా చూడాలని, వారందరికీ ఆహ్వానాలు పంపాలని క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్‌కు సూచించారు. సాహిత్యం, క్రీడలు, కళల్లో అవార్డులకు ఎంపికైన వారికి రూ.లక్ష చొప్పున, సామాజిక కార్యక్రమాలు, విద్య, వైద్య సేవల అవార్డులకు ఎంపికైన వారికి రూ.2 లక్షల చొప్పున చెక్కులను సీఎం అందజేస్తారని తెలిపారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని సూచించారు.