TG : గద్దర్ ఆలోచనా విధానాన్ని అనుసరిస్తున్నాం
ABN, Publish Date - Aug 07 , 2024 | 04:01 AM
గద్దర్ ఆలోచనా విధానాన్ని తమ ప్రభుత్వం ఆచరిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గద్దర్‌ను విశ్వమానవుడిగా అభివర్ణిస్తూ ఆయన లాంటి వ్యక్తి శతాబ్దానికి ఒక్కరే పుడతారంటూ కీర్తించారు.
గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల విరాళం
స్మృతి వనానికి నెక్లెస్ రోడ్డులో ఎకరం స్థలం
ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వెల్లడి
రవీంద్ర భారతిలో గద్దర్ ప్రథమ వర్థంతి సభ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): గద్దర్ ఆలోచనా విధానాన్ని తమ ప్రభుత్వం ఆచరిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గద్దర్‌ను విశ్వమానవుడిగా అభివర్ణిస్తూ ఆయన లాంటి వ్యక్తి శతాబ్దానికి ఒక్కరే పుడతారంటూ కీర్తించారు. మలి దశ తెలంగాణ పోరాటానికి పాట, మాట, ఆటతో ఊపిరి పోసిన గద్దర్‌కు గత ప్రభుత్వంలో సరైన గౌరవం, సరైన స్థానం దక్కలేదన్న బాధ తమను వెంటాడిందన్నారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రవీంద్ర భారతిలో గద్దర్ ప్రథమ వర్థంతి సభ నిర్వహించారు.
కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భట్టివిక్రమార్క మాట్లాడుతూ గద్దర్ ఇక లేరన్న వార్త తెలిసిన వెంటనే అందరికన్నా ముందు స్పందించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని గుర్తుచేశారు. అమెరికా పర్యటన వల్ల ఆయన ఈ సభకు రాలేకపోయారని, కానీ గద్దర్ ఆలోచనలను నిత్యం ప్రజల్లో ఉంచడం కోసం ముందుగానే తమతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. గద్దర్ స్మృతి వనాన్ని నెక్లెస్ రోడ్డులో ఎకరం స్థలంలో ఏర్పాటు చేస్తామన్నారు. భారత రాజ్యాంగం ద్వారానే సమసమాజం సిద్థిస్తుందన్న గద్దర్ ఆలోచనలపై పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు.
ప్రతి జిల్లాలో ఏడాదికి రెండుసార్లు గద్దర్ ఆట, పాటను గుర్తుచేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఫౌండేషన్‌కు సూచించారు. సాంస్కృతిక పోరాట సారథి గద్దర్ అని మంత్రి సీతక్క కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడమే గద్దర్‌కు అర్పించే అసలైన నివాళి అని గద్దర్ ఫౌండేషన్ చైర్మన్ శాంతా సిన్హా అన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ సభాధ్యక్షత వహించారు. ప్రొఫెసర్లు హరగోపాల్, కంచె ఐలయ్య, తమిళనాడు వీసీకే పార్టీ ఎంపీ తలైవర్ తిరుమావళవన్, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, గద్దర్ కుమారుడు సూర్యం, కూతురు వెన్నెల, వివిధ పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీవేత్తలు, సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
Updated Date - Aug 07 , 2024 | 04:01 AM