Share News

Suryapet: అయ్యో.. ‘అమ్మ’..!

ABN , Publish Date - May 17 , 2024 | 03:03 AM

నవమాసాలు మోసి, పురిటినొప్పులను భరించి.. తమను కని, పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా.. శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు, కూతుళ్లు తగవులాడుకున్న ఉదంతమిది..! చిన్నప్పుడు తల్లి వద్ద మారాం చేసి మరీ తనకు కావాల్సినవి సమకూర్చుకున్న ఆ కొడుకు.. ఇప్పుడు పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ మారాం చేస్తున్నాడు. దీంతో.. కూతుళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా.. ఆ అమ్మ మృతదేహం రెండ్రోజులుగా ఫ్రీజర్లో ఉండిపోయింది.

Suryapet: అయ్యో.. ‘అమ్మ’..!

  • తల్లి అనంతలోకాలకు చేరినా.. తెగని ఆస్తి పంచాయితీ

  • కుమారుడు, కుమార్తెల మధ్య గొడవ

  • పంపకాలు కొలిక్కి వచ్చినా పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ కొడుకు పట్టు

  • ఫ్రీజర్‌లోనే మృతదేహం.. సూర్యాపేట జిల్లాలో ఘటన

నేరేడుచర్ల, మే 16: నవమాసాలు మోసి, పురిటినొప్పులను భరించి.. తమను కని, పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా.. శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు, కూతుళ్లు తగవులాడుకున్న ఉదంతమిది..! చిన్నప్పుడు తల్లి వద్ద మారాం చేసి మరీ తనకు కావాల్సినవి సమకూర్చుకున్న ఆ కొడుకు.. ఇప్పుడు పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ మారాం చేస్తున్నాడు. దీంతో.. కూతుళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా.. ఆ అమ్మ మృతదేహం రెండ్రోజులుగా ఫ్రీజర్లో ఉండిపోయింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడెంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కందులవారిగూడేనికి చెందిన వేం వెంకటరెడ్డి, లక్ష్మమ్మ(80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. చిన్న కుమారుడు గతంలోనే చనిపోయారు. వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితం మృతిచెందారు. ఐదేళ్లుగా లక్ష్మమ్మ నేరేడుచర్లలోని చిన్న కుమార్తె వద్దే ఉంటున్నారు. ఇటీవల ఆమె ఇంట్లో కాలుజారి కిందపడ్డారు. దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో.. ‘‘ఇంటికి తీసుకెళ్లండి. ఆక్సిజన్‌పైనే ఆమె బతుకుతుంది.


ఆక్సిజన్‌ పైపు తీసేస్తే.. చనిపోతుంది’’ అని వైద్యులు బుధవారం తేల్చిచెప్పారు. దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్‌తోనే చిన్నకుమార్తె తమ ఇంటి వద్దకు తీసుకెళ్లింది. రాత్రి 9గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్‌ వద్ద అంబులెన్స్‌ను పార్క్‌ చేయించగా.. లక్ష్మమ్మ ఆక్సిజన్‌పై అందులోనే ఉండిపోయారు. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని.. పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పడంతో.. మిగతా కూతుళ్లు ఆస్తి పంపకాలు తేలే వరకూ అంబులెన్స్‌ కదిలేది లేదని పట్టుపట్టారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు. మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించినా.. కొడుకు, కూతుళ్ల పంచాయితీ మాత్రం తీరలేదు. లక్ష్మమ్మ గతంలో రూ.21లక్షల మేర పలువురికి అప్పులిచ్చారు.


ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్నకూతురికి ఆ రూ.21 లక్షల్లోంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగతా రూ.15లక్షలను కొడుకు దక్కించుకున్నాడు. 20 తులా ల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు. అంతా సవ్యంగా సాగింద నుకున్న తరుణంలో కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానని భీష్మించుకు కూర్చున్నాడు. ప్రస్తుతం లక్ష్మమ్మ మృతదేహం కుమారుడి ఇంట్లో ఫ్రీజర్‌లో ఉంది. ఈ పేచీ ఎప్పుడు తెగుతుందోనని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 17 , 2024 | 03:03 AM