టచ్ చేసి చూడు! హైటెన్షన్ వైరులా ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా
ABN, Publish Date - Apr 20 , 2024 | 08:29 AM
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్‌లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్ చూసుకోవాలని అన్నారు.
- కాంగ్రెస్‌ను ముట్టుకుంటే మాడి మసైపోతావు
- ముందు.. నీ దొడ్లో ఎందరుంటారో చూసుకో
- చిటికె కాదు.. మిద్దెక్కి డప్పు కొట్టినా ఏం చేయలేరు
- కారును ఇక తుక్కు కింద తూకానికి వేయాల్సిందే
- కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం
- ఢిల్లీ మోదీ.. ఫాంహౌస్ కేడీ ఇద్దరూ తోడుదొంగలు
- పదేళ్లపాటు అధికారం కాంగ్రెస్ ప్రజాపాలనదే
- పంద్రాగస్టులోపు ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తాం
- రూ.2 లక్షల రుణమాఫీ, వరికి 500 బోనస్ ఇస్తాం
- భద్రాద్రి రాముడి సాక్షిగా చెబుతున్నా: రేవంత్
- మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లో కాంగ్రెస్
- అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు హాజరైన సీఎం
మహబూబ్‌నగర్/మహబూబాబాద్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 20 మంది తమతో టచ్‌లో ఉన్నారని, చిటికేస్తే వస్తారంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లడం కాదని, ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఆ పార్టీలో ఉంటారో కేసీఆర్ చూసుకోవాలని అన్నారు. తమ ఎమ్మెల్యేలకు తాను హైటెన్షన్ వైరులా కాపలా ఉంటానని, కేసీఆర్ ముట్టుకుంటే మసై పోతారని హెచ్చరించారు. శుక్రవారం మహబూబ్‌నగర్, మహబూబాబాద్‌లలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థులు వంశీచంద్‌రెడ్డి, బలరాంనాయక్‌ల నామినేషన్ల దాఖలు కార్యక్రమాలకు సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో మాట్లాడారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడుతూ, ‘‘నిన్నటికి నిన్న పొంకనాలాయన, పిట్టలదొర అంటుండు.. తనతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నరని, చిటికె వేస్తే వస్తారని. చిటికేసుడు కాదు.. మిద్దె ఎక్కి డప్పు కొట్టు. నీ దగ్గర ఉన్నోళ్లయినా.. అక్కడ ఉంటరేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల గొర్ల మందను తోడేళ్లలా వచ్చి తాపకొకటి కొట్టుకుపోదామనుకుంటున్నవేమో. బిడ్డా.. ఈడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. నువ్వు ప్రయత్నం చేసి చూడు. మా ఎమ్మెల్యేలను కంచె వేసి కాపాడుకునే శక్తి, హైటెన్షన్ వైర్ రేవంత్‌రెడ్డి ఉన్నడు. వచ్చి ముట్టుకో బిడ్డా.. కరెంటు తీగ మీద వాలిన కాకి ఎలా కర్రెగా అయి చస్తదో.. కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి కూడా గట్లనే అయితది. నువ్వు మా దిక్కు చూసుడు కాదు.. సాయంత్రం నీ దొడ్లకు ఎన్ని వస్తాయో లెక్కబెట్టుకో’’ అని కేసీఆర్‌నుద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
ఎర్రకోటపై రాహుల్ జెండా ఎగరేస్తారు..
రాహుల్‌గాంధీ ప్రధానిగా ఎర్రకోటపై జెండా ఎగురవేయడం ఖాయమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లపాటు పరిపాలించిన బీజేపీ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేసిందని, ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అవసరమని ఉద్ఘాటించారు. మహబూబాబాద్‌లో కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలోని మోదీ, ఫాంహౌ్‌సలోని కేసీఆర్ ఇద్దరూ తోడుదొంగలేనన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సను బొందపెట్టిన ప్రజలే ఈ లోక్‌సభ ఎన్నికల్లో మోదీని కూడా ఓడించి కాంగ్రె్‌సతో కూడిన ఇండియా కూటమిని అధికారంలోకి తీసుకు వస్తారని తెలిపారు. తల్లిని చంపి బిడ్డను ఇచ్చారంటూ తెలంగాణను మోదీ పదే పదే అవమానపరిచారని చెప్పారు. కూతురు కవిత బెయిల్ కోసం కేసీఆర్.. మోదీతో చేతులు కలిపారని, మహబూబ్‌నగర్, చేవెళ్ల, మల్కాజ్‌గిరి, జహీరాబాద్, సికింద్రాబాద్‌లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించే చీకటి ఒప్పందం ఆ రెండు పార్టీల మధ్య కుదిరిందని ఆరోపించారు. మొదట్నుంచి మోదీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వస్తున్నారని, 42 సీట్లు ఉన్న తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక్క మంత్రిపదవి ఇచ్చి 30 సీట్లు ఉన్న గుజరాత్‌కు ఏడు మంత్రిపదవులు ఇచ్చారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం.. తెలంగాణకు రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని మోదీ తుంగలో తొక్కారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా వదిలేసిన బీజేపీ.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుందని ఆరోపించారు. ఉత్తరాది కుంభమేళా, గంగానది శుద్ధికి రూ.వేల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం.. తెలంగాణలో మేడారం మహాజాతరకు రూ.3 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. మేడారం మహాజాతరకు గుర్తింపు ఇవ్వబోమని చెప్పిన కిషన్‌రెడ్డి.. కమలం పార్టీకి ఓటు వేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. కేసీఆర్ తమను దిగిపో.. దిగిపో అంటున్నారని, తామేమైనా అల్లాటప్పాగా వచ్చామా? అని ప్రశ్నించారు. మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, రూ.500 బోనస్ ఇస్తామని, భద్రాద్రి రాముడి సాక్షిగా చెబుతున్నానని అన్నారు.
కారు మళ్లీ ఇంటికి రాదు..
కారు కొంచెం ఖరాబ్ అయిందని, గ్యారేజీకి పోయిందని నిన్నమొన్న కేటీఆర్ అంటున్నారని, కానీ, కారు ఖరాబ్ కాలేదని. ఇంజన్ చెడిపోయి వర్క్‌షా్‌పకు వెళ్లిందని సీఎం రేవంత్ అన్నారు. అక్కడి నుంచి మళ్లీ ఇంటికి రాదని, ఇనుప సామాను దుకాణంలో తూకం పెట్టి అమ్మాల్సిందేనని చెప్పారు. ‘‘నీ కారే కాదు.. నీ అయ్య ఆరోగ్యం కూడా అనుము చెడ్డది. ఇవ్వాల్టికీ నడవలేకపోతున్నడు. మొన్న జరిగిన ఎన్నికల్లో కారును బండకేసి కొట్టిన్రు. వంద మీటర్ల గోతి తీసి పాతిన్రు’’ అంటూ రేవంత్ మండిపడ్డారు. 2009లో కేసీఆర్‌ను కరీంనగర్ ప్రజలు తిరస్కరిస్తే.. పాలమూరు ప్రజలు తెలంగాణ వస్తుందని, బతుకులు మారుతాయని భావించి ఎంపీగా గెలిపించారని తెలిపారు. కానీ, పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరుకు ఏమీ చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద రోజుల్లో 35 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారని, ఆరోగ్య శ్రీ ద్వారా పేదల వైద్యం కోసం రూ.10 లక్షలు ఇస్తున్నామని.. గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నామని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆదుకున్నామని, 30 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీసీలకు తగినన్ని నిధులు కేటాయించేందుకు బీసీ జనాభా లెక్కలు తీస్తున్నామని అన్నారు. వంద రోజుల్లో పాలమూరు జిల్లాకు రూ.10 వేల కోట్లు మంజూరు చేశామని వెల్లడించారు. ముదిరాజ్ బిడ్డను పంద్రాగస్టులోపు మంత్రిని చేస్తామని మరోసారి సీఎం హామీ ఇచ్చారు. మాదిగల వర్గీకరణ కోసం పార్లమెంట్, సుప్రీంకోర్టులో పోరాడే బాధ్యత తమ ప్రభుత్వానిదని చెప్పారు. బీఆర్‌ఎస్- బీజేపీ ఒక్కటై కాంగ్రె్‌సను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పని చేయాలని సూచించారు.
Updated Date - Apr 20 , 2024 | 09:21 AM