Jagga Reddy: రాహుల్‌కు విజనుంది.. త్యాగ గుణమూ ఉంది
ABN, Publish Date - Dec 19 , 2024 | 03:35 AM
అదానీ కళ్లలో ఆనందం చూసేందుకు దేశాన్నే ప్రధాని నరేంద్ర మోదీ పణంగా పెడుతున్నారని, ప్రజల సంపదను ఆయనకు దోచి పెడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు.
మోదీకి ఆ రెండూ లేవు.. తాను, అదానీ బాగుండాలన్నదే ఆయన నినాదం
అందుకే దేశ సంపదను దోచి పెడుతున్నడు
ప్రజల కోసమే ‘మోదీ, అదానీకో హఠావో, దేశ్‌కో బచావో’ నినాదాన్ని రాహుల్ ఎత్తుకున్నడు
హరీశ్ కోరినట్లు అసెంబ్లీలో ‘డ్రంకెన్’ టెస్టు పెట్టేందుకు సీఎంకు ఏ అభ్యంతరం లేదు..
ఆ టెస్టు పెడితే కేసీఆర్ అసెంబ్లీకే రాడేమో..!
రాహుల్ దాకా ఎందుకు మాట్లాడతవు కిషన్‌రెడ్డీ.. అదానీ గురించి అమెరికా చెప్పలేదా?
కవిత 3 నెలలు జైల్లో ఉండి డిస్ట్రబ్ అయింది..
మూసీ గురించి ఆమెకు తొందరెందుకు?
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అదానీ కళ్లలో ఆనందం చూసేందుకు దేశాన్నే ప్రధాని నరేంద్ర మోదీ పణంగా పెడుతున్నారని, ప్రజల సంపదను ఆయనకు దోచి పెడుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు. దేశ భవిష్యత్తు, ప్రజల మేలు కోసమే ‘అదానీ, మోదీకో హఠావో, దేశ్ కో బచావో’ నినాదాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకున్నారని చెప్పారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పేదల కడుపు నింపేందుకు ఉపాధి హామీ వంటి అద్భుత పథకాలను సోనియా, మన్మోహన్‌సింగ్‌ల నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం తెచ్చిందని, పేదల సంక్షేమం కోసమూ పని చేసిందని గుర్తుచేశారు. అయినా మోదీ మాటలను దేశం నమ్మిందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలే గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటుంటే.. మోదీ మాత్రం పేదల డబ్బును అదానీకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ విజన్ ఉన్న.. త్యాగం చేసే గుణమున్న నాయకుడని.. మోదీకి ఆ రెండూ లేవని.. తాను, అదానీ బాగుండాలన్నదే ఆయన నినాదమని విమర్శించారు. ప్రజలు ఇది గమనించాలని కోరారు.
కిషన్‌రెడ్డి.. స్ర్కిప్టు రెడ్డి!
‘అదానీపై ఆరోపణలకు ఆధారాలుంటే ఇవ్వాలంటూ కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నడు. ఆయన సెంట్రల్ మినిస్టర్‌గిరీ చేస్తున్నడా.. లేక చౌకీదార్ పని చేస్తున్నడా? రాహుల్ దాకా వెళ్లి మాట్లాడుతున్నడు. అదానీ మోసం చేసినట్లుగా అమెరికానే చెబుతుంటే ఆయనకు ఇంకేం సాక్ష్యం కావాలి?’ అంటూ జగ్గారెడ్డి నిలదీశారు. కిషన్‌రెడ్డి సొంతంగా ప్రెస్‌మీట్ కూడా పెట్టలేడని, ఎవరో స్ర్కిప్టు రాసిస్తే చదువుతాడన్నారు. అందుకే ఆయన ప్రెస్‌మీట్లలో స్పష్టత ఉండదని చెప్పారు. కిషన్‌రెడ్డి కాదు.. ఆయన స్ర్కిప్టురెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. ఆయన పార్టీ ఇచ్చిన స్ర్కిప్టు కన్నా ఎక్కువ మాట్లాడితే ఉద్యోగం ఊడుతదన్న భయం ఆయనకు ఉందన్నారు.
అప్పుడు కేసీఆర్ అసలే రాడేమో..
‘అసెంబ్లీలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలంటూ హరీశ్‌రావు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ఎందుకు? ఇప్పటికే కేసీఆర్ సభకు రావట్లేదు. ఆ టెస్టు పెడితే సభకు అసలే రాడు’ అని జగ్గారెడ్డి అన్నారు. హరీశ్ కోరిక మేరకు అసెంబ్లీలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టడానికి సీఎంకు ఏ అభ్యంతరం లేద ని, అయితే హరీశ్ మళ్లొకసారి కేసీఆర్‌ను అడిగి చెబితే మంచిదన్నారు. కేసీఆర్ అసలు సభకు రావద్దనే డ్రంకెన్ టెస్టు పెట్టాలని హరీశ్ అనుకుంటున్నారని అనుమా నం వ్యక్తం చేశారు. కవిత జైలుకు వెళ్లి వచ్చాక మెంటల్‌గా డిస్ట్రబ్ అయి ఏదేదో మాట్లాడుతోందని, ఆమెకు రెస్టు అవసరమన్నారు. తాను జైల్లో ఉన్నా ఆమెలాగే డిస్ట్రబ్ అవుతానని చెప్పారు. మూసీ గురించి ఇప్పుడే ఆమెకు ఎందుకంత తొందరని ప్రశ్నించారు.
Updated Date - Dec 19 , 2024 | 03:35 AM