Tragic Incident: 7 గంటల పాటు ఆర్తనాదాలు!
ABN, Publish Date - Sep 06 , 2024 | 04:17 AM
కనీవినీ ఎరుగని వరద... నిమిషాల వ్యవధిలోనే ఆ ఇంటిని చుట్టుముట్టేసింది. ఇద్దరు దంపతులు, వారి కుమారుడు తేరుకొని బయటకు వచ్చే లోపే దారి కూడా కనిపించని పరిస్థితి..
ఉదయం లేచి చూసే సరికే జల ప్రళయం.. రెస్క్యూ బృందాలు వచ్చినా కాపాడలేని పరిస్థితి
యాకూబ్ దంపతులను బలిగొన్న పాలేరు వరద.. వారి కుమారుడిని కాపాడిన స్థానికులు
కూసుమంచి, సెప్టెంబరు 5: కనీవినీ ఎరుగని వరద... నిమిషాల వ్యవధిలోనే ఆ ఇంటిని చుట్టుముట్టేసింది. ఇద్దరు దంపతులు, వారి కుమారుడు తేరుకొని బయటకు వచ్చే లోపే దారి కూడా కనిపించని పరిస్థితి... ఎటు చూసినా నీళ్లే.. ఇలా కాదని ధైర్యం చేసి వారందరూ ఇంటి పైకప్పు మీదకు ఎక్కారు... కాసేపట్లోనే అధికారులు, రెస్క్యూటీమ్ సభ్యులు అక్కడికి చేరుకున్నా ఏమీ చేయలేని పరిస్థితి. అందరూ చూస్తుండగానే ఆ దంపతులు, వారి కుమారుడు కొట్టుకుపోయారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో గత ఆదివారం పాలేరు జల ప్రళయానికి బలైన యాకూబ్ కుటుంబం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి ఇది.
సూర్యాపేట జిల్లా మోతె మండలం కరక్కాయలగూడేనికి చెందిన యాకూబ్(50), సైదాబీ(45) దంపతులు పదేళ్ల క్రితం నాయకన్‌గూడేనికి వలస వచ్చారు. పాలేరు జలాశయం కాజ్‌వే సమీపంలో నివాసం ఉంటూ సిమెంటు ఇటుకల తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు యూసుఫ్ చెన్నైలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతుండగా, చిన్నకుమారుడు షరీఫ్ ఖమ్మంలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏటా వరదలు వచ్చిన సమయంలో వారు తమ ఇల్లు ఖాళీ చేసి మెరక ప్రాంతానికి వస్తుండే వారు.
కానీ, ఈ ఏడాది గతానికి భిన్నంగా పాలేరు జలాశయానికి రెండు లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తింది. దీంతో ఆదివారం ఉదయం 5.30గంటలకే వారు నివసిస్తున్న ఇంట్లోకి నీళ్లు చేరాయి. అరగంట వ్యవధిలోనే ఆరు నుంచి ఏడు అడుగుల మేర వరద చేరడంతో వారి ఇల్లు పూర్తిగా నీట మునిగింది. దీంతో యాకూబ్, సైదాబీ, చిన్న కుమారుడు షరీఫ్ ఇంటి పైకప్పు ఎక్కారు. ఏడు గంటల పాటు తమను కాపాడాలంటూ వారు ఆర్తనాదాలు చేశారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఆధ్వర్యంలో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నా.. వరద చుట్టుముట్టేయడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. చివరకు డ్రోన్ సాయంతో లైఫ్ జాకెట్లు, ట్యూబులు అందించారు. ఇంతలోనే వారు ఉంటున్న ఇల్లు కూలిపోవడంతో యాకూబ్, సైదాబీతోపాటు షరీఫ్ వరదలో కొట్టుకుపోయారు.
చెట్లలో ఇరుక్కుపోయి యాకూబ్, సైదాబీ దుర్మరణం చెందగా, ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారిపై స్ధానికులు, పోలీసులు షరీ్‌ఫను కాపాడి బయటకు తీశారు. ‘ఆరేడు గంటలపాటు బతికేందుకు పోరాడాం. నా కళ్ల ముందే మమ్మీ, డాడీ వరదలో కొట్టుకుపోయారు. నేనూ బతుకుతాననుకోలేదు’’ అని ఆ నాటి ఘటనను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నాడు షరీఫ్. వరదల్లో సర్వస్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని అనాథలుగా మిగిలిన యూసుఫ్, షరీఫ్ కోరుతున్నారు. కాగా, ఆ రోజు హైదరాబాద్ నుంచి సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి.. దంపతుల మృతి వార్త తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. అన్ని రకాల చర్యలు తీసుకున్నా వారిని కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - Sep 06 , 2024 | 04:17 AM