TSPSC : 14 నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాల్‌టికెట్లు
ABN, Publish Date - Oct 10 , 2024 | 03:40 AM
గ్రూప్-1 మెయిన్ పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల 14వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు.
21-27 వరకు పరీక్షలు..అరగంట ముందే హాల్‌లోకి
హైదరాబాద్, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): గ్రూప్-1 మెయిన్ పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల 14వ తేదీ నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. పరీక్ష ప్రారంభం అయ్యే ఒక రోజు ముందు వరకు ఇవి అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ నెల 21 నుంచి 27వ తేదీల మధ్య గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు అభ్యర్థులు కనీసం 30 నిమిషాల ముందుగా పరీక్ష హాల్‌లోకి చేరుకోవాల్సి ఉంటుందని అధికారులు ప్రకటించారు.
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 1.30 గంటల వరకు అనుమతిస్తామని, ఆ తర్వాత వచ్చే వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు. మెయిన్స్‌లో భాగంగా ప్రతీ అభ్యర్థి ఆరు పేపర్లకు సంబంధించి పరీక్షలను రాయాల్సి ఉంటుంది. ప్రతీ పరీక్ష హాల్‌లో అభ్యర్థుల కోసం వాల్ క్లాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్షలకు సంబంధించిన ఏమైనా సాంకేతిక సమస్యలు, ఇతర అనుమానాలుంటే 040-23452185, 040-23452186, 040-23452187 నంబర్లకు కానీ, ఈ-మెయిల్‌లో కానీ సంప్రదించవచ్చని అధికారులు సూచించారు.
Updated Date - Oct 10 , 2024 | 03:40 AM