Farmers Suicide: అప్పులబాధతో యువత రైతు ఆత్మహత్య
ABN, Publish Date - Dec 28 , 2024 | 04:41 AM
అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడగా, విద్యుదాఘాతంతో మరో రైతు మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన సండ్రుగు భాస్కర్(29) తనకున్న ఎకరన్నర పొలంలో వేసిన పంటలకు దిగుబడి రాలేదు.
విద్యుదాఘాతంతో మరో రైతు మృతి
కౌడిపల్లి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడగా, విద్యుదాఘాతంతో మరో రైతు మృతి చెందాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన సండ్రుగు భాస్కర్(29) తనకున్న ఎకరన్నర పొలంలో వేసిన పంటలకు దిగుబడి రాలేదు. గ్రామంలో సంవత్సరం క్రితం టెంట్‌హౌస్ నిర్వహణ చేపట్టగా తీవ్రనష్టాలు వచ్చాయి. అయితే అటు వ్యవసాయానికి, ఇటు టెంట్‌హౌస్ కోసం చేసిన రూ.5 లక్షల అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక భార్య సరితతో తరచూ తన మనోవేదన చెప్పుకుంటూ బాధపడేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి భార్య, పిల్లలను అదే గ్రామంలోని అత్తగారి ఇంటికి పంపించి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు.
మరోవైపు నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గ్రామానికి చెందిన బద్దెల గోవిందు(48) అనే రైతు విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. ఎప్పటిలానే శుక్రవారం గోవిందు తన పొలానికి వెళ్లాడు. అప్పుడు సమీపంలో ఉన్న మహిళా రైతు నీల.. పొలంలో విద్యుత్ తీగ తెగి ఉండడాన్ని గమనించి గోవిందుకు తెలియజేసింది. ఆ తీగకు మరమ్మతులు చేస్తుండగా గోవిందు విద్యుదాఘాతానికి గురయ్యాడు. దగ్గర్లో ఉన్న కొంత మంది రైతులు గోవిందును దేవరకొంత ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. గోవిందుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
Updated Date - Dec 28 , 2024 | 04:41 AM