ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Job Placement: ఐటీ కొలువుల కష్టాలు!

ABN, Publish Date - Jul 14 , 2024 | 04:50 AM

ఇంజనీరింగ్‌ విద్య పూర్తవుతున్న సమయంలోనే విద్యార్థులకు ఐటీ సంస్థలు ప్రాంగణ నియామకాల పేరిట కొలువులు ఇస్తుంటాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వేతన ప్యాకేజీలూ భారీగా ఉంటాయి. అలాంటి ఐటీ ఉద్యోగాలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి.

  • ఈ ఏడాది ప్రాంగణ నియామకాలు తక్కువే

  • ప్రముఖ కాలేజీల్లోనూ అంతంతమాత్రమే

  • ఎంపికైన వారూ ఎక్కువగా బెంచ్‌లకే!!

  • 4 నెలలు గడుస్తున్నా.. కంపెనీల్లోకి ప్రవేశాల్లేవ్‌

  • మరో ఏడాది పాటు ఇలాగే ఉంటుందని అంచనా!

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ విద్య పూర్తవుతున్న సమయంలోనే విద్యార్థులకు ఐటీ సంస్థలు ప్రాంగణ నియామకాల పేరిట కొలువులు ఇస్తుంటాయి. విద్యార్థుల ప్రతిభ ఆధారంగా వేతన ప్యాకేజీలూ భారీగా ఉంటాయి. అలాంటి ఐటీ ఉద్యోగాలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నాయి. ఓ వైపు ఈ ఏడాది ప్రాంగణ నియామకాలు (క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు) తక్కువగా ఉండగా.. మరోవైపు ఉద్యోగాలకు ఎంపికైన వారు బెంచ్‌లకే పరిమితం అవుతున్నారు. ఏడాది కాలంగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరో ఏడాది పాటు ఈ సంక్షోభం తప్పదని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు గణనీయంగా పడిపోయాయి. అనేక ఐటీ కంపెనీలు ప్రాంగణ నియామకాలకు దూరంగా ఉంటున్నాయి.


దాంతో పేరుమోసిన కాలేజీల్లో ఇంజనీరింగ్‌ కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకూ ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. సాధారణంగా ఏటా డిసెంబరులో తొలి విడత; ఫిబ్రవరి, మార్చిలో రెండో విడతగా ఆయా విద్యా సంస్థల్లో ప్రాంగణ నియామకాలు జరుగుతాయి. బహుళజాతి కంపెనీలతో పాటు ప్రఖ్యాత ఐటీ సంస్థలు కూడా కాలేజీల్లో నిర్వహించే ప్లేస్‌మెంట్లలో పాల్గొని విద్యార్థులను తమ సంస్థల్లోకి తీసుకోవడానికి పోటీ పడతాయి. ఈ పోటీలో అత్యుత్తమ మానవ వనరులను దక్కించుకోవడానికి వీలుగా అభ్యర్థులకు ఆఫర్‌ లెటర్లను ఇస్తాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏటా సాధారణంగా జరిగే ప్లేస్‌మెంట్లతో పోలిస్తే గత డిసెంబరులో అభ్యర్థులకు వచ్చిన అవకాశాలు సగమే ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ప్రాంగణ నియామకాల్లోనూ పరిస్థితి మెరుగు పడలేదు. చాలా కంపెనీలు తమ భవిష్యత్తు అవసరాలతో పాటు విస్తరణ ప్రాజెక్టుల కోసం కూడా ముందుగానే ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. కొత్తగా వచ్చే ప్రాజెక్టుల ఆధారంగా ఎంపిక చేసుకున్న అభ్యర్థులను తమ సంస్థల్లోకి చేర్చుకుంటాయి. అయితే.. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.


ఇప్పటికీ చేర్చుకోలేదు..

గత డిసెంబరులో ప్రాంగణ నియామకాల్లో ఎంపికైన వారిలో కొంత మందిని ఇప్పటికీ ఉద్యోగాల్లో చేర్చుకోలేదు. ఫిబ్రవరి, మార్చిలో ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆఫర్‌ లెటర్‌ ఇచ్చినా.. వారిని ఇంకా ఉద్యోగాల్లో చేర్చుకోకపోవడంతో బెంచ్‌లకే పరిమితం అవుతున్నారు. ఇలాంటి వారు కొత్త ఉద్యోగాలను వెతుక్కోలేక.. వచ్చిన ఉద్యోగంలో చేరలేక సతమతమవుతున్నారు. ఏ క్షణంలోనైనా తాము ఆయా సంస్థల్లో చేరాల్సి ఉంటుందనే అభిప్రాయంతో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నాలుగైదు నెలల నుంచి హైదరాబాద్‌, ఇతర పట్టణాల్లో నివాసం ఉంటున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ ఉద్యోగాల పట్ల వారికి అనుమానం కలుగుతోంది. అభ్యర్థులు ఆర్థిక పరిస్థితుల కారణంగా ఐదారుగురు కలిసి ఒక గదిని అద్దెకు తీసుకుని నెట్టుకొస్తున్నారు.


ఐటీ ఉద్యోగాలపై ఆశలు సన్నగిల్లుతుండడంతో ప్రత్యామ్నాయ మార్గాలను ఆన్వేషిస్తున్నారు. మరో ఏడాది పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో పరిస్థితి బాగా లేకపోవడంతో దాని ప్రభావం ఇక్కడ పడుతోందని చెబుతున్నారు. రాష్ట్రంలో పేరుమోసిన ఎన్‌ఐటీ, ఐఐటీ వంటి కాలేజీలతో పాటు ప్రముఖ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుకున్న అభ్యర్థులకు కూడా ఈ సమస్య తప్పడం లేదు. ఉదాహరణకు వరంగల్‌లోని ఎన్‌ఐటీలో బీటెక్‌, ఎంటెక్‌ ముఖ్యంగా సీఎ్‌సఈ కోర్సులను పూర్తి చేసిన వారికి 99-100 శాతం ప్లేస్‌మెంట్‌ లభిస్తుంది. కానీ, ఈ ఏడాది అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ కాలేజీలో ఈ ఏడాది సాధారణం కంటే 10 శాతం ప్లేస్‌మెంట్లు తగ్గిపోయాయి. మెకానికల్‌, సివిల్‌ రంగాల్లో అయితే ఇంకా తగ్గాయి. ఈ కాలేజీకి ఏటా సుమారు 300 కంపెనీలు ఉద్యోగాలను ఇవ్వడానికి ముందుకొస్తాయి. ఈ ఏడాది మాత్రం అందులో 60 కంపెనీలే ఆసక్తి చూపాయి. ఐఐటీ హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.


గత ఏడాది ఈ కాలేజీ నుంచి సుమారు 335 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు విద్యార్థులను ఎంపిక చేసుకోగా, ఈ సారి మాత్రం సగానికి పడిపోయింది. ఉద్యోగాలు పొందే అభ్యర్థుల సంఖ్యతో పాటు వారికి చెల్లించే ప్యాకేజీలు కూడా భారీగా తగ్గాయి. ఉస్మానియా, జేఎన్‌టీయూలతో పాటు పలు ప్రముఖ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ ప్రాంగణ నియామకాలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని కంపెనీలు మాత్రం ఎంపికైన అభ్యర్థుల నుంచి ఉచిత సేవలను పొందుతున్నాయి. శిక్షణ పేరిట వారితో పని చేయించుకుంటున్నా.. జీతాలు చెల్లించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ఎంపిక చేసుకున్న అభ్యర్థులను ఇప్పటికీ ఉద్యోగాల్లోకి ఆహ్వానించడం లేదు. దాంతో వారంతా బెంచ్‌లకే పరిమితం అవుతున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 04:50 AM

Advertising
Advertising
<