Uttam Kumar Reddy: రూ.31 వేల కోట్లు మాఫీ చేస్తాం..
ABN, Publish Date - Aug 20 , 2024 | 02:58 AM
రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు అన్ని వివరాలు సరిగా ఉన్న 22,37,848 ఖాతాలకు రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేశామని తెలిపారు.
స్పష్టంగా ఉన్న ఖాతాలకు మాఫీ పూర్తయింది
పరిశీలన అనంతరం ఇతర అకౌంట్లకూ అమలు
2 లక్షల పైన ఉంటే.. పైమొత్తం చెల్లిస్తే వెంటనే మాఫీ
దురుద్దేశంతో విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు
రైతుల కోసం బీజేపీ ఏమీ చేయలేదు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకు అన్ని వివరాలు సరిగా ఉన్న 22,37,848 ఖాతాలకు రూ.2 లక్షల దాకా రుణమాఫీ చేశామని తెలిపారు. ఇంకా.. ఆధార్ వివరాలు సరిగా లేని 1.65 లక్షల ఖాతాలు, తప్పులు ఉన్న 1.50 లక్షల ఖాతాలు, రేషన్‌కార్డు లేని 4.83 లక్షల ఖాతాలు, రూ.2 లక్షల పైన రుణాలు కలిగిన 8 లక్షల ఖాతాలకే రుణ మాఫీ ఆగిందని పేర్కొన్నారు. ఈ ఖాతాలకు వెరిఫికేషన్ అనంతరం రుణమాఫీ చేస్తామని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి రుణమాఫీపై ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల పైన రుణం తీసుకున్నవారు.. ఆ పైన ఉన్న మొత్తాన్ని చెల్లించిన వెంటనేమాఫీ అమలవుతుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక.. స్వతంత్ర భారత చరిత్రలో మరే ఇతర రాష్ట్రం ఇవ్వని విధంగా రుణమాఫీ చేశామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మొదటి పంటకాలంలోనే 22,37,848 మందికి రూ.17,933.19 కోట్లు మాఫీ చేశామని తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండగా.. 2018లో రుణమాఫీలో 2.26 లక్షల ఖాతాలకు చెందిన రూ.1419 కోట్ల సొమ్ము రిటర్న్ కాగా.. చర్యలేమీ తీసుకోలేదని గుర్తు చేశారు. ఓఆర్‌ఆర్‌ను అమ్మేసి 2018లో రుణమాఫీ డబ్బులు వేశారని ఆరోపించారు. కాగా, 2024 రుణమాఫీలో 22 వేల ఖాతాలు రిటర్న్ కాగా.. 8 వేల ఖాతాలకు తిరిగి క్లియర్ చేశామని, పటిష్టమైన ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
ఇక ఈ పంటకాలం నుంచే సన్న వడ్లకుకు రూ.500 బోనస్ అమలు చేస్తామని ఉత్తమ్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు దురుద్దేశపూరితంగా విమర్శలు చేస్తున్నాయని అన్నారు. రైతుల మేలు కోసం బీజేపీ ఒక్క నిర్ణయం కూడా తీసుకున్న దాఖలాల్లేవని, రుణమాఫీపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఉత్తమ్ ధ్వజమెత్తారు. 2 లక్షల దాకా రుణమాఫీ విషయంలో ఆధార్‌కార్డు, పాస్‌పుస్తకం, రేషన్‌కార్డు లేకున్నా మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం గత పదేళ్లలో రెండుసార్లు రుణమాఫీ ప్రకటించిందని, 2014లో నిర్ణయం తీసుకొని నాలుగేళ్లపాటు నాలుగు వాయిదాల్లో రుణమాఫీ నిధులు విడుదల చేశారని ఉత్తమ్ విమర్శించారు. 2014-15లో రూ.4040 కోట్లు, 2015-16లో రూ.4040 కోట్లు, 2016-17లో రూ.4025 కోట్లు, 2017-18లో రూ.4038 కోట్లు విడుదల చేయగా.. ఆ నిధులన్నీ వడ్డీకే సరిపోయాయని తెలిపారు.
అనంతరం 2018లో రుణమాఫీ ప్రకటి ంచారని, కానీ.. 2018-19, 2019-20లలో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని, 2020-21లో 2,96,571 మందికి రూ.408.3 కోట్లు, 2021-22లో 3,88,908 మందికి రూ.1339.5 కోట్లు, 2023-24లో 10,68,779 మందికి మొదటి దశలో 6763 కోట్లు, రెండో దశలో 6,07,641 మందికి 4818 కోట్లు మాఫీ చేశారని వివరించారు. బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే సచివాలయం ఎదురుగా పెడుతున్న రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తొలగించి, ఆ స్థానంలో అంజయ్య విగ్రహాన్ని పెడతామనే కేటీఆర్ వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందిస్తూ ‘‘మళ్లీ వస్తే కదా? అధికారం కోల్పోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు’’ అని మండిపడ్డారు.
Updated Date - Aug 20 , 2024 | 02:58 AM