TG politics: 13 సీట్లు మావే..!
ABN, Publish Date - May 10 , 2024 | 06:48 AM
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17సీట్లలో 13సీట్లు కాంగ్రెస్ పార్టీనే గెలవబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదన్నారు. 3సీట్లలో బీజేపీతో, ఒక్క సీటులో ఎంఐఎంతో తమకు పోటీ ఉంటుందని తెలిపారు.
బీఆర్‌ఎ్‌సకు ఒక్కటీరాదు.. 3చోట్ల బీజేపీతో పోటీ: మంత్రి ఉత్తమ్
రాజ్యాంగాన్ని మార్చేందుకే ‘ఇస్ బార్ చార్ సౌ’ నినాదం
రిజర్వేషన్లను ఎత్తేయాలని చూస్తున్న బీజేపీ: పొన్నం, శ్రీధర్
హైదరాబాద్, గోదావరిఖని/ హుస్నాబాద్, మే 9: (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17సీట్లలో 13సీట్లు కాంగ్రెస్ పార్టీనే గెలవబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదన్నారు. 3సీట్లలో బీజేపీతో, ఒక్క సీటులో ఎంఐఎంతో తమకు పోటీ ఉంటుందని తెలిపారు. నల్లగొండ లోక్‌సభ సీటులో అత్యధిక మెజారిటీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు జనాలను మోసం చేసి మళ్లీ గెలవాలని చూస్తున్నాయని, తెలంగాణకు ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పాలన్నారు. రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ వాళ్లు చాలాసార్లు మాట్లాడారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ పార్టీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోవడంలేదని, గతంలోకంటే నాణ్యమైన కరెంట్‌ను అందిస్తున్నామన్నారు. ఎన్నికలుకాగానే అర్హులకు రేషన్ కార్డులిస్తామని, ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామన్నారు.
పంట నష్టపోయిన రైతులనూ ఆదుకుంటామని చెప్పారు. బీజేపీ ‘ఇస్ బార్ చార్ సౌ’ నినాదంతో ఎన్నికలకు వస్తోందని, పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం ద్వారా రాజ్యాంగాన్ని మార్చడమే ఈ నినాదం వెనుకున్న ప్రధాన ఉద్దేశమని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీకి అదాని, అంబానీలతో సంబంధం ఉందని మోదీ ఆరోపిస్తున్నారని, ఆయన దగ్గరే కేంద్ర ప్రభుత్వం, వ్యవస్థలు ఉన్నాయని, అవన్నీ పని చేయడం లేదా అని ప్రశ్నించారు. రాహుల్ నీతివంతమైన నాయకుడని, ఆయన కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని కొనియాడారు.
మరోవైపు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నిర్వహించిన సీపీఐ కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను ఎత్తేయాలని బీజేపీ భావిస్తోందని ఆరోపించారు. మోదీ పదేళ్ల పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని అన్నారు. ఆయన మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా అక్షింతలు వచ్చాయా..? రాముడు ఫొటో వచ్చిందా..? అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. మోదీ వేములవాడకు వస్తే ఆలయ అభివృద్ధికి ఏదైనా ఇస్తారనుకున్నాం కానీ ఒక కోడే కూడా ఇవ్వలేదని పొన్నం దుయ్యబట్టారు. అనంతరం సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మతోన్మాద బీజేపీని ఓడిస్తేనే దేశంలో ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందని అన్నారు..
Updated Date - May 10 , 2024 | 06:48 AM