Uttam Kumar Reddy: భయపడాల్సింది లేదు..
ABN, Publish Date - Oct 26 , 2024 | 03:04 AM
హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.
అనుమతులు పొందిన నిర్మాణాల కూల్చివేత ఉండదు
హైడ్రా చర్యలపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం
రియల్టర్లకు అండగా ఉంటాం
ఫ్యూచర్ సిటీలో భాగమవ్వాలి
నరెడ్కో ప్రొపర్టీ షో ప్రారంభంలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు25 (ఆంధ్రజ్యోతి) : హైడ్రా కూల్చివేతలపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ప్రభుత్వ విభాగాల నుంచి అన్ని అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టిన వారు కూల్చివేతల అంశంలో భయపడాల్సిన అవసరమే లేదని భరోసా ఇచ్చారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రియల్టర్లు గతంలో పొందిన అనుమతులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయిగా నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో రియల్టర్లు, బిల్డర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు నరెడ్కో(నేషనల్ రియల్ ఎస్టేట్ డెవల్‌పమెంట్ కౌన్సిల్) తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సందర్శించి ఆయా సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఫ్లాట్లు, ఇళ్లు, విల్లాల క్రయవిక్రయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్‌తోపాటు నిర్మాణ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ అనుమతులతో నిర్మించిన కట్టడాలకు కూల్చివేతల భయం లేదని, ఈ అంశంలో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.
నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన వివిధ అనుమతుల జారీ ప్రక్రియను సులభతరం చేస్తామని ప్రకటించారు. నరెడ్కో, క్రెడాయ్, ఇతర రియల్ ఎస్టేట్, నిర్మాణ సంఘాలు కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రియల్ ఎేస్టట్ రంగంతో పాటు నిర్మాణాదారులు ఏ విషయంలోనైనా ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుందని తెలిపారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు వస్తున్నారని గుర్తు చేశారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, బడ్జెట్‌లో రూ.10,000 కోట్లు కేటాయించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదేనని, రీజనల్ రింగ్ రోడ్‌తో పాటు అనుసంధాన రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని చెప్పారు.
మెట్రో విస్తరణ పనులు వేగవంతం చేశామని వెల్లడించారు. మూసీ అభివృద్ధితో నగర రూపురేఖలు మారతాయని, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో రియల్టర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కావాలని మంత్రి ఉత్తమ్ కోరారు. కాగా, నరెడ్కో జాతీయ అధ్యక్షులు హరిబాబు మాట్లాడుతూ జీడీపీలో నిర్మాణ రంగం వాటా అధికమని తెలిపారు. అందుబాటు ధరల్లో లభించే ఫ్లాట్లకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందించాలని, నిర్మాణ రంగంపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని కోరారు. నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు మేక విజయసాయి మేక మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చార్జీలు తగ్గిస్తే స్థిరాస్తుల క్రయవిక్రయాలు పెరుగుతాయని సూచించారు. నరెడ్కో ప్రతినిధులు కిరణ్, కాళిదాస్, ఆర్ వెంకటేశ్వరరావు, చలపతిరావు, సునిల్ చంద్రారెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Oct 26 , 2024 | 03:04 AM