ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP: జన సునామీ..

ABN, Publish Date - May 14 , 2024 | 03:20 AM

మళ్లీ సంక్రాంతి వచ్చినట్లు.. జాతరేదో జరుగుతున్నట్లు.. ఇంట్లో వేడుకకు విచ్చేసినట్లు.. ‘పదండి ఓటేద్దాం’ అంటూ నవ్యాంధ్ర ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓట్ల వేడుకలో పాల్గొన్నారు. అమ్మా, నాన్నలతో కలిసి కొత్తగా ఓటొచ్చిన టీనేజ్‌ అమ్మాయి... అవ్వా తాతలతో కలిసి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు.

  • ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్లు

  • కడపటి వార్తలు అందే సమయానికి 81ు పోలింగ్‌!.. పల్లెలు, పట్టణాలనే తేడా లేదు.. తొలి ఓటర్లు, విద్యావంతుల్లో జోష్‌

  • దేశ విదేశాల నుంచి సొంతూళ్లకు.. నార్వే, మారిషస్‌ తదితర దేశాల నుంచీ రాక.. ‘సంక్రాంతి’ తరహాలో ఎన్నికల సందడి

  • ఓపిగ్గా క్యూలో నిలబడ్డ జనం.. ఒక లక్ష్యం, కసితో మీట నొక్కిన వైనం.. ఉదయం 6.30 నుంచే బూత్‌ల ముందు బారులు

  • 3 వేలకుపైగా కేంద్రాల్లో రాత్రి పది దాకా పోలింగ్‌.. కొన్నిచోట్ల అర్ధరాత్రీ క్యూలో ఓటర్లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

మళ్లీ సంక్రాంతి వచ్చినట్లు.. జాతరేదో జరుగుతున్నట్లు.. ఇంట్లో వేడుకకు విచ్చేసినట్లు.. ‘పదండి ఓటేద్దాం’ అంటూ నవ్యాంధ్ర ఓటర్లు పోలింగ్‌ బూత్‌లకు పోటెత్తారు. సకుటుంబ సపరివార సమేతంగా ఓట్ల వేడుకలో పాల్గొన్నారు. అమ్మా, నాన్నలతో కలిసి కొత్తగా ఓటొచ్చిన టీనేజ్‌ అమ్మాయి... అవ్వా తాతలతో కలిసి వచ్చిన సాఫ్ట్‌వేర్‌ కుర్రాడు... స్కూటీపై కలిసొచ్చిన కొత్త దంపతులు... ‘పదరా పోదాం’ అంటూ మిత్రబృందం! ఎటు చూసినా ఓట్ల సందడి! సోమవారం ఉదయం 6.30 గంటలకు బూత్‌ల తలుపులు తెరవకముందే బారులు తీరారు. ఏడు గంటలకు ఈవీఎంలపై మొదలైన ఓటు మీట సవ్వడి... సాయంత్రం ఆరుదాకా కొనసాగింది. సాధారణంగా ఉదయం మందకొడిగా మొదలై, తర్వాత పుంజుకొని, సాయంత్రానికి పోలింగ్‌ జోరు తగ్గుతుంది. కానీ... ఈసారి అలా లేదు. అత్యధిక బూత్‌ల వద్ద రోజంతా ఓటర్ల బారులు కనిపించాయి. మూడువేలకుపైగా బూత్‌లలో రాత్రి 10 దాకా... కొన్నిచోట్ల అర్ధరాత్రి దాకా కూడా పోలింగ్‌ కొనసాగడం గమనార్హం. ‘వీళ్లకు ఓపిక తక్కువ. ఓట్లు వేసేందుకు రారు’ అనే అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ... విద్యావంతులు, ఉద్యోగులు, యువత, ఎగువ మధ్య తరగతి వారు కూడా పోలింగ్‌ బూత్‌లకు తరలి వచ్చారు. క్యూలో ఓపిగ్గా నిలబడి... గంటైనా, రెండు గంటలైనా తమ వంతు వచ్చేదాకా వేచి చూసి ఓటేశారు. పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన వారు సొంత వాహనాలు, రైళ్లు, బస్సుల్లో ఓటున్న చోటుకు తరలి వచ్చారు.


అమెరికా, గల్ఫ్‌ దేశాల నుంచి ఓ మోస్తారుగా ఓటేసేందుకు రావడం సహజమే! ఈసారి... నార్వే, స్వీడన్‌, కెనడా, మారిషస్‌ వంటి దేశాల్లో స్థిరపడిన వారూ ఓటేసేందుకు సొంతూళ్లకు వచ్చారు. గ్రామాల్లో ‘సంక్రాంతి’కి మాత్రమే కనిపించే సందడి.. ఇప్పుడు ఓట్ల పండక్కి కనిపించింది. ఏదో కసితో, ఒక లక్ష్యంతో ఓటు వేయాలన్న భావన వీరిలో కనిపించింది. ‘ఈసారి ఓటేయకపోతే ఏదో కోల్పోతాం!’ అనే ఆందోళనతోనే వీరంతా తరలి వచ్చినట్లు స్పష్టమైంది. రాష్ట్రంలో, సొంతూళ్లో సంగతులన్నీ తెలుసుకుని... మార్పు కోసమే ఓటు వేయక తప్పదనే బలమైన సంకల్పంతోనే బూత్‌ల ముందు బారులు తీరినట్లు అవగతమైంది. ఇక... గ్రామీణులు, కార్మికులు, కర్షకులు ఎప్పట్లాగానే తమ ఓటును ఉపయోగించుకున్నారు. ఆదర్శంగా నిలిచారు. అన్ని వర్గాల ప్రజలు ఓటుకు పోటెత్తడంతో సోమవారం రాత్రి కడపటి వార్తలందేసరికే 81 శాతం నమోదైంది. మొత్తం పోలింగ్‌ పూర్తయి, తుది లెక్కలు పూర్తయ్యేసరికి పోలింగ్‌ 85 శాతానికి చేరవచ్చని అంచనా! ఇప్పటిదాకా గత ఎన్నికల్లో నమోదైన 79.84 శాతం పోలింగే రికార్డు! ఇప్పుడు అది బద్దలైనట్లే! వాతావరణం కాస్త చల్లబడటంతో ఓటర్లకు ఊరట కలిగింది.


హింసాత్మకమే.. కానీ!

ఓటమి భయం వెంటాడుతోందో... ఓటు చేజారుతోందని అర్థమైందో తెలియదుకానీ వైసీపీ వర్గాలు అనేకచోట్ల విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలకు దిగాయి. పల్నాడులో భారీగా దాడులు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎస్పీ వాహనంపైనే దాడి చేశారు. పలుచోట్ల టీడీపీ అభ్యర్థులనూ అడ్డుకుని దాడికి దిగారు. టీడీపీ ఏజెంట్లను లక్ష్యంగా చేసుకుని కొట్టారు. సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్ల నుంచి వెబ్‌కాస్టింగ్‌ చేసినా ఇదీ పరిస్థితి. ఆయా ఘటనలపై టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశారు. గత ఎన్నికలతో పోల్చితే మాత్రం ఈసారి హింసాత్మక ఘటనలు తక్కువే అని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంతో పోల్చితే ఓట్ల గల్లంతుపైనా ఫిర్యాదులు తక్కువగానే వచ్చాయి. ఓట్ల తొలగింపుపై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో జనం ముందుగానే అప్రమత్తమయ్యారు. తమ ఓట్లను కాపాడుకున్నారు. ఈవీఎంలు మొరాయించడంతో పలుచోట్ల పోలింగ్‌ ఆలస్యంగా మొదలైంది.


గంట గంటకూ పైపైకి!

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం పోలింగ్‌ ప్రక్రియలో గంట గంటకూ ఓటింగ్‌ శాతం పెరిగిందని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంచనాలకు మించి ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చారని చెప్పారు. సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా 68.04 శాతం మేర పోలింగ్‌ నమోదైందని వివరించారు. నిర్ణీత సమయం దాటినా లైన్‌లలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించామన్నారు. మొత్తం 3,500 కేంద్రాల్లో పోలింగ్‌ అర్ధరాత్రి వరకు కొనసాగిందని వివరించారు. ఎక్కడా రీ పోలింగ్‌ అవసరం లేదని చెప్పారు.

Updated Date - May 14 , 2024 | 03:20 AM

Advertising
Advertising