CM Revanth: మేడారం మహాజాతరపై కేంద్రానికి ఎందుకింత వివక్ష
ABN, Publish Date - Feb 23 , 2024 | 03:45 PM
మేడారం మహాజాతర(Medaram Jatara)పై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. మంత్రి సీతక్క కృషితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పండుగగా మేడారం జాతరను ప్రకటించారని గుర్తుచేశారు. కుంభమేళాను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించినప్పుడు.. సమ్మక్క- సారలమ్మ జాతరను గుర్తిస్తే తప్పెంటీ అని నిలదీశారు. దక్షిణాది కుంభమేళాకు ప్రాముఖ్యం ఇచ్చినప్పుడు.. మేడారం జాతరను కేంద్రం ఎందుకు విస్మరిస్తుందని ప్రశ్నించారు.
ములుగు(మేడారం): మేడారం మహాజాతర(Medaram Jatara)పై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. మంత్రి సీతక్క కృషితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర పండుగగా మేడారం జాతరను ప్రకటించారని గుర్తుచేశారు. కుంభమేళాను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించినప్పుడు.. సమ్మక్క- సారలమ్మ జాతరను గుర్తిస్తే తప్పెంటీ అని నిలదీశారు. దక్షిణాది కుంభమేళాకు ప్రాముఖ్యం ఇచ్చినప్పుడు.. మేడారం జాతరను కేంద్రం ఎందుకు విస్మరిస్తుందని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమత్రి అమిత్ షా జాతరకు రావాలని కోరారు. మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సీఎంకు అతిథి మర్యాదలతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... సమ్మక్కను దర్శనం చేసుకోకపోవడం వల్లే మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారని.. బీజేపీకి కూడా అదేగతి పడుతుందని హెచ్చరించారు. అయోధ్యలో రాముడిని మాత్రమే కాదని.. మేడారం సమ్మక్క - సారక్కల దర్శనానికి రావాలని కోరారు. బీజేపీ - బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలను త్వరలో బయట పెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఏడు సీట్లు బీఆర్ఎస్‌కు.. పది సీట్లు బీజేపీకు అని రెండు పార్టీల్లోని అగ్ర నేతలు చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని అన్నారు. త్వరలోనే వారి చీకటి ఒప్పందాలు బయట పెడతామని హెచ్చరించారు.
27న మరో 2 గ్యారంటీలు
ఈనెల 27వ తేదీన మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఉచిత గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. సమ్మక్క - సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఇక్కడి నుంచే ‘హాత్ సే హాత్’ జోడోయాత్ర ప్రారంభించినట్లు గుర్తుచేశారు. తమకు పదవులు వచ్చాయంటే అది అమ్మల దీవెనతోనేనని.. అందుకే జాతరకు 110కోట్ల రూపాయలు కేటాయించామని వివరించారు. జాతరకు 18 కోట్ల మంది మహిళలు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి వచ్చారని తెలిపారు. సమ్మక్క - సారలమ్మలను నమ్ముకున్న జనం కోసం వారు అప్పటి పాలకులతో కొట్లాడి అమరులయ్యారని అన్నారు. తాము కూడా అమ్మవార్లనే స్ఫూర్తిగా తీసుకొని ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తమ ఎజెండాతో ముందుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మేడారంకు సంబంధించిన మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 23 , 2024 | 04:56 PM