Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బండి సంజయ్ ఏమన్నారంటే..
ABN, Publish Date - Dec 13 , 2024 | 03:41 PM
కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన కేసులో తాజాగా అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్(Allu Arjun)ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆయన చిత్రం 'పుష్ప 2: ది రైజ్' ప్రీమియర్ షోలో ఒక మహిళ మరణించినందుకు బాధిత మహిళ భర్త అల్లు అర్జున్‌పై ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు.
జాతీయ అవార్డు గ్రహీత, నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసే విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ డ్రెస్ మార్చుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా నేరుగా తన బెడ్‌రూమ్ నుంచి తీసుకెళ్లడం అవమానకరమైన చర్య అని పేర్కొన్నారు. ప్రముఖ హీరో విషయంలో పోలీసులు ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మర్యాద ఇదేనా
భారతీయ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన ఒక స్టార్ హీరోకు పోలీసులు ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ ప్రశ్నించారు. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, అయితే ఆ భారీ జనసందోహాన్ని కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తుందని వ్యాఖ్యానించారు.
భారీగా జనాలు వచ్చిన కార్యక్రమానికి సరైన ఏర్పాట్లను నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ భావించారు. ఇది నిర్లక్ష్యం, తప్పు అని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రత్యక్షంగా ప్రమేయం లేని అల్లు అర్జున్, ఆయన అభిమానులకు గౌరవం ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో వారిని నేరస్థులుగా చూడటం సరికాదని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేసు
డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఆయన నటించిన 'పుష్ప 2' సినిమా ప్రీమియర్ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన ఘటనపై ఈ కేసు నమోదైంది. ఆ క్రమంలో తొక్కిసలాటలో 39 ఏళ్ల రేవతి అనే మహిళ మృతి చెందారు. దీంతో సంధ్య థియేటర్ యాజమాన్యం, నటుడు, భద్రతా బృందంపై బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - Dec 13 , 2024 | 03:49 PM