Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:26 AM
గర్భాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బుతో పేదరికం పోతుందని ఆశించారా దంపతులు! ఎక్కడో ఒడిశా నుంచి పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వచ్చారు!! తీరా ఇక్కడకు వచ్చాక.. వారిని తీసుకువచ్చిన వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు.
కామాంధుడి నుంచి తప్పించుకునే యత్నంలో మహిళ మృతి
తొమ్మిదో అంతస్తు నుంచి కింద పడి కన్నుమూత
రాయదుర్గం పోలీ్‌సస్టేషన్ పరిధిలో విషాద ఘటన
రాయదుర్గం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గర్భాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన డబ్బుతో పేదరికం పోతుందని ఆశించారా దంపతులు! ఎక్కడో ఒడిశా నుంచి పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వచ్చారు!! తీరా ఇక్కడకు వచ్చాక.. వారిని తీసుకువచ్చిన వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. అతడి బారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో తొమ్మిదో అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయిందా మహిళ. నాలుగేళ్ల కుమారుణ్ని, భర్తను తీవ్ర విషాదంలో ముంచేసింది! రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ విషాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని మైహోం భూజలో నివాసం ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి నిత్యం రాజే్‌షబాబు (54) దంపతులకు సంతానం లేదు. దీంతో వారు సరగసీ (అద్దె గర్భం) విఽధానం ద్వారా సంతానం పొందాలని భావించి.. సందీప్ అనే మధ్యవర్తి ద్వారా ఒడిశాకు చెందిన సంజయ్ సింగ్, అశ్విత (25) దంపతులను కలిశారు. వారితో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం మేరకు.. వారిద్దరూ తమ నాలుగేళ్ల కుమారుడితో కలిసి అక్టోబరు 24న హైదరాబాద్‌కు వచ్చారు. అప్పట్నుంచీ అశ్వితను 9వ అంతస్తులోని తమ ఇంట్లోనే నిర్బంధించిన రాజేష్ బాబు.. ఆమె భర్త సంజయ్‌సింగ్‌కు మాత్రం అదే అపార్ట్‌మెంట్‌లో ఏడో అంతస్తులో నివాసం కల్పించాడు.
సరగసీ విధానం ద్వారా బిడ్డను కనేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా.. గత పదిహేనురోజులుగా రాజేష్ బాబు అశ్వితపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చాడు. సరగసీ విధానంలో బిడ్డను కనిస్తాను తప్ప.. లైంగికంగా కలిసేందుకు ఒప్పుకొనేది లేదని రాజే్‌షబాబుకు తేల్చిచెప్పిన అశ్విత, అతడి అకృత్యాల గురించి భర్తకు చెప్పింది. తిరిగి ఒడిశాకు వెళ్లిపోదామని రెండు, మూడుసార్లు చెప్పినా.. ఒప్పందం ప్రకారం బిడ్డను కనిస్తే, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని సంజయ్ సింగ్ తన భార్యకు నచ్చజెప్పాడు. కానీ.. రాజే్‌షబాబు లైంగిక వేధింపులు నానాటికీ తీవ్రతరం కావడంతో అక్కడి నుంచి ఎలాగైన తప్పించుకుని, భర్త, కుమారుడితో కలిసి స్వగ్రామం వెళ్దామనే నిర్ణయానికి వచ్చింది అశ్విత. రాజే్‌షబాబు ఫ్లాట్ బాల్కనీ నుంచి చీరను కట్టి, దాని ద్వారా రెండు అంతస్తుల మేర కిందకు జారితే.. అక్కడ ఉండే ర్యాంపు ద్వారా భర్త ఉండే ఫ్లాట్‌లోకి చేరుకోవచ్చని గుర్తించింది. ఈమేరకు మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో (తెల్లవారితే బుధవారం).. రెండు చీరలను ఒకదానికొకటి కట్టి 9వ అంతస్తు బాల్కనీలోంచి పొడుగ్గా కిందకు వేలాడదీసింది. ఆ చీరలను పట్టుకుని నెమ్మదిగా కిందికి దిగే ప్రయత్నం చేస్తుండగా.. ఆమె చేతులు పట్టు జారి అంత ఎత్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అశ్విత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు రాజే్‌షబాబుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సరగసీ ముసుగులో పేద కుటుంబాలపై జరుగుతున్న అకృత్యాలను ఇప్పటికైనా గుర్తించి.. వాటిని నివారించేలా ప్రభుత్వం కఠిన చట్టాలు రూపొందించాలని పలువురు సూచిస్తున్నారు.