172 ఎకరాలు డీనోటిఫై!
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:49 AM
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) కోసం ఎన్టీఆర్ జిల్లాలో అటవీ భూముల డీ నోటిఫై చేయటానికి వీలుగా ఎన్‌హెచ్ అధికారులు రంగం సిద్ధం చేశారు. మొత్తం 172 ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చేయనున్నారు. ఈ భూములన్నీ కొండపల్లి (తిమ్మాపురం), గుర్రాజుపాలెం, దుగ్గిరాలపాడు, గూడెం మాధవరం గ్రామాల పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ డీ నోటిఫికేషన్ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ అనుమతుల కోసం అధికారులు సిద్ధమవుతున్నారు.

- ఓఆర్‌ఆర్ కోసం ఎన్టీఆర్ జిల్లాలో అటవీ భూములు
-కొండపల్లి (తిమ్మాపురం), గుర్రాజుపాలెం, దుగ్గిరాలపాడు, గూడెం మాధవరంలో గుర్తింపు
-ప్రత్యామ్నాయంగా 172 ఎకరాలు కేటాయించనున్న రాష్ట్ర ప్రభుత్వం
- పర్యావరణ అనుమతులకు ఎన్‌హెచ్ అధికారులు సన్నద్ధం
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) కోసం ఎన్టీఆర్ జిల్లాలో అటవీ భూముల డీ నోటిఫై చేయటానికి వీలుగా ఎన్‌హెచ్ అధికారులు రంగం సిద్ధం చేశారు. మొత్తం 172 ఎకరాల అటవీ భూములను డీ నోటిఫై చేయనున్నారు. ఈ భూములన్నీ కొండపల్లి (తిమ్మాపురం), గుర్రాజుపాలెం, దుగ్గిరాలపాడు, గూడెం మాధవరం గ్రామాల పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ డీ నోటిఫికేషన్ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాల్లో పర్యావరణ అనుమతుల కోసం అధికారులు సిద్ధమవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో మొత్తం ఐదు కిలోమీటర్ల పరిధిలో అటవీ భూములు ఉన్నాయి. ఒక కిలో మీటరు అంటే ఏడు హెక్టార్లు. ప్రస్తుతం 70 మీటర్ల వెడల్పు లెక్కన చూసుకుంటే 86 ఎకరాల అటవీ భూములు అవసరమవుతున్నాయి. అదే అవుటర్ రింగ్ రోడ్డు వెడల్పు 140 మీటర్లు అయితే మరో 86 ఎకరాల అటవీ భూములను తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ లెక్కన 172 ఎకరాల అటవీ భూములు అవసరమవుతాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా సరే ఈ మేరకు అటవీ భూములను డీనోటిఫై చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడు పడితే అప్పుడు డీ నోటిఫై అనేది చేసేది కాదు కాబట్టి.. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందుగానే 172 ఎకరాల అటవీ భూములకు సంబంధించి డీనోటిఫికేషన్‌కు ప్రతిపాదించాలని ఎన్‌హెచ్ వర్గాలు భావిస్తున్నాయి.
వెడల్పుపై కేంద్రం నుంచి రాని స్పష్టత!
కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి వెడల్పు ఎంత అనే దానిపై స్పష్టతనిచ్చేలా మినిట్స్ రాకపోవడంతో దీని కోసం ఎన్‌హెచ్ అధికారులు ఎదురు చూస్తున్నారు. మినిట్స్ రాగానే అవసరాన్ని బట్టి అటవీ భూముల డీ నోటిఫికేషన్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్ అధికారులు భావిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ (తిమ్మాపురం), గుర్రాజుపాలెం, దుగ్గిరాలపాడు, గూడెం మాధవరం అటవీ ప్రాంతాల మీదుగా ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్ వస్తోంది. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు ఈ భూములు అవసరం అవుతున్నాయి. ఈ భూముల డీ నోటిఫై చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని, ఇబ్బందులు తలెత్తవని ఎన్‌హెచ్ అధికారులు అంటున్నారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఎన్టీఆర్ జిల్లాలో ఆంధ్ర - తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో రెండు టన్నెల్స్ నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఈ టన్నెల్స్ అటవీ, కొండ ప్రాంతాల పరిధిలోనే ఏర్పాటు చేయాల్సి వస్తోంది.
అటవీ భూముల్లో చెట్ల లెక్కింపు
అటవీ భూముల డీ నోటిఫికేషన్‌కు సంబంధించి జాతీయ రహదారుల సంస్థ అధికారులు ముందుగానే తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. పలు సర్వేలు కూడా నిర్వహించారు. ప్రతిపాదిత అటవీ భూముల్లో ఎన్ని చెట్లు ఉన్నాయి అన్న వివరాలను కూడా అధ్యయనం చేశారు. అటవీ ప్రాంతాన్ని డీజీపీఎస్ రోవర్ల ద్వారా జల్లెడ పట్టించి విస్తీర్ణాన్ని కూడా మదింపు చేశారు. అటవీ భూముల సర్వే కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం 70 మీటర్ల వెడల్పుకు మాత్రమే ఈ సర్వే చేపట్టినా.. 140 మీటర్ల వెడల్పుకు కూడా ఎన్ని చెట్లు ఉంటాయి ? ఎంత మీరా విస్తీర్ణం అవసరమవుతుంది ? అన్నదానిపై కూడా ముందుగానే సర్వే చేయించి సిద్ధంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంత మేర అటవీ ప్రాంత భూములకు డి నోటిఫికేషన్ ఇస్తే అంత విస్తీర్ణం మేర రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా భూములు కల్పించాల్సి ఉంటుంది. అటవీ ప్రాంతంలో ఎన్ని చెట్లు ఉన్నాయో అంతకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా చూపించే భూముల్లో మొక్కలను నాటాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పరిధిలో కానీ మరెక్కడైనా కానీ డీనోటిఫై చేసినంత మేరకు భూములను తప్పనిసరిగా కల్పించాల్సిన అవసరం ఉంది.
త్వరలో పర్యావరణ అనుమతుల కోసం ప్రతిపాదన
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు కోసం అతి త్వరలో ఎన్‌హెచ్ అధికారులు పర్యావరణ అనుమతులు కోరనున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన ప్రక్రియను కూడా ఎన్‌హెచ్ అధికారులు చేపట్టారు. అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు అనేది గ్రిన్ ఫీల్డ్ ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే. అవుటర్ రింగ్ రోడ్డు వల్ల అమరావతి రాజధాని ప్రాంత పరిధిలోని ప్రజలపై ప్రత్యక్షంగా పరోక్షంగా పర్యావరణంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందన్న దానిపై అధ్యయన రిపోర్టును కేంద్రానికి పంపించాల్సి ఉంటుంది. అమరావతి ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్‌కు సంబంధించి భౌగోళిక పరిస్థితులను చూస్తే పర్యావరణ విఘాతానికి ఎలాంటి ఆస్కారం లేదు కాబట్టి పర్యావరణ అనుమతుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్‌హెచ్ అధికారులు భావిస్తున్నారు. పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు రింగ్ రోడ్డు పరిధిలోని మిగిలిన మూడు జిల్లాల్లో కూడా స్థానికంగా ప్రజల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించడం జరుగుతుంది. ప్రజల అభ్యంతరాలను కూడా తీసుకొని దానికి అనుగుణమైన మార్పులు చేర్పులు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు మంజూరు చేేస అవకాశం ఉంది.
అవుటర్‌లోనూ ‘హై టెన్షన్స్’
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డుకు కూడా హై టెన్షన్ లైన్స్ సమస్య ఉంది. అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో మొత్తం 34 చోట్ల హై టెన్షన్ విద్యుత్ వైర్లు అడ్డొస్తున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్‌లో 16 చోట్ల ఈ పరిస్థితి ఉంటే, అవుటర్ రింగ్ రోడ్డులో 34 చోట్ల హై టెన్షన్ విద్యుత్తు లైన్స్ వస్తున్నాయి. విజయవాడ వెస్ట్ బైపాస్‌లో హై టెన్షన్ విద్యుత్తు లైన్ల మార్పిడికి అనేక సమస్యలు ఏర్పడ్డాయి. దాదాపు మూడేళ్లుగా ఈ సమస్యలు తెగటం లేదు. తేలటం లేదు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్‌హెచ్ అధికారులు ముందస్తుగా ట్రాన్స్‌కో, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ బైపాస్‌లో వస్తున్న సమస్యలు, అభ్యంతరాలు, కోర్టు కేసులను దృష్టిలో పెట్టుకుని అమరావతి అవుటర్ రింగ్ రోడ్‌లో అలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉండడానికి ఇప్పటి నుంచే తగిన అలైన్‌మెంట్స్‌ను సిద్ధం చేసుకోవాలని, స్థానిక రైతులతో ఇబ్బందులు లేకుండా వారితో సంప్రదింపులు జరపాలని కూడా ఎన్‌హెచ్ అధికారులు సూచిస్తున్నారు.
అలైన్‌మెంట్ లొకేషన్ల మార్పు పూర్తి
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు మొత్తం ఇప్పటి వరకు 13 లొకేషన్లలో మార్పులు, చేర్పులు జరిగాయి. మొదటి దశలో తొమ్మిది లొకేషన్లలో ఈ మార్పులు చేశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఎనిమిది లొకేషన్లలోనూ, గుంటూరు జిల్లాలో ఒక లొకేషన్‌లోనూ అలైన్‌మెంట్ మార్పులు జరిగాయి. ఆ తర్వాత కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్త్) ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి, పేరేచర్లలో మరో నాలుగు చోట్ల అలైన్‌మెంట్ మార్పుకు సూచించింది. రెండో దశలో అలైన్‌మెంట్ మార్పులకు సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాలో అయితే లేవు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో శ్మశానాలు, చెరువులు ఆక్రమణల వంటివి ఉండడంవల్ల అలైన్‌మెంట్‌లో స్వల్ప సవరణలు చేపట్టాల్సి వచ్చింది.