AP Minor Mineral Policy Reforms: గనుల ఆదాయానికి రెక్కలు
ABN , Publish Date - Apr 16 , 2025 | 04:54 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనర్ మినరల్ పాలసీ-2025లో కీలక సవరణలు చేసింది. కొత్త విధానంలో సీనరేజీ ఫీజులు ప్రామాణికంగా అమలు చేయబడతాయి, లీజు కాలపరిమితిని పెంచి, ఫీజుల భారం తగ్గించారు

మైనర్ మినరల్-2022 పాలసీలో కీలక సవరణలు
మళ్లీ ఓటీఎస్ విధానం అమలు
రాష్ట్రమంతా ఒకే తరహా సీనరేజీ
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గనులు, ఖనిజాల తవ్వకం ద్వారా వచ్చే ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనర్ మినరల్ పాలసీ-2022లో కీలక సవరణలు చేసింది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేసేలా కొత్త విధానాలను పేర్కొంటూ మైనర్ మినరల్ పాలసీ-2025ని రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. ఒకప్పుడు జీడీపీలో మైనింగ్ రంగం వాటా 3.53 శాతంగా ఉండేది. 2023-24లో 2.71 శాతానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రంగాన్ని బలోపేతం చేసి ఆదాయం పెంచడానికి పాలసీలో మార్పులు తీసుకొచ్చారు. జగన్ హయాంలో తీసుకున్న నిర్ణయం కారణంగా 6 వేల దరఖాస్తులు కొరగాకుండా పోయాయి. కొత్త విధానంలో 2022 మార్చి నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ‘ఫస్ట్‌కమ్-ఫస్ట్‌సర్వ్’(ఎవరు ముందొస్తే వారికే ముందు) విధానంలో పరిష్కరించాలని నిర్ణయించారు. గృహనిర్మాణం, జలవనరుల ప్రాజెక్టులు, రహదారి అభివృద్ధి, విస్తరణ కోసం అవసరమైన రోడ్‌మెటల్, బిల్డింగ్ మెటీరియల్, గ్రానైట్, సిలికాశాండ్, డోలోమైట్ వంటి ఖనిజాలకు ఉత్పత్తితో అనుసంధానించిన ధరను నిర్ణయించనున్నారు. ఈ ధర ప్రకారమే వేలం విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దీనిలో వన్‌టైమ్ ప్రీమియం బదులు సీనరేజీ ఫీజు శాతాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రస్తుతం 7 ఉమ్మడి జిల్లాల్లోనే సీనరేజీ కాంట్రాక్ట్ అమల్లో ఉంది. ఇకపై రాష్ట్రమంతా అమలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల స్థిరమైన ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఇక నుంచి అన్ని జిల్లాల్లో సీనరేజీ కాంట్రాక్ట్ అమలు కానుంది. ఫీజుల వసూళ్లలో గనులశాఖ అధికారుల పెత్తనం ఉండదు.
ఫీజులు సగానికి తగ్గింపు
పెండింగ్ దరఖాస్తులు, కొత్త ప్రాంతాలు, రెన్యువల్స్ ద్వారా లీజులు తీసుకునేవారికి ప్రస్తుతం ఫీజుల భారం ఎక్కువగా ఉంది. ఇకపై కొత్త పాలసీ ద్వారా ఈ ఫీజుల భారాన్ని తగ్గించనున్నారు. 10 రెట్లుగా ఉన్న లీజు స్థిర మొత్తా(డెడ్‌రెంట్)న్ని 5 రెట్లకు తగ్గించారు. ఈ మొత్తాన్ని 2-3 ఏళ్లలో రెండు సులభతర వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. లైమ్‌స్టోన్ శ్లాబ్స్ కోసం ప్రీమియం మొత్తాన్ని 3 రెట్ల డెడ్‌రెంట్‌కు తగ్గించారు. అంతేకాదు.. ఇకపై దీనిని ఏడాదికోసారి నిర్ణయించనున్నారు. డెడ్‌రెంట్లను ఖనిజాల ప్రాతిపదికన సవరించారు. కొత్తగా మంజూరయ్యే గ్రానైట్ లీజు కాలపరిమితిని 20 నుంచి 30ఏళ్లకు పెంచారు. రోడ్‌మెటల్ యూనిట్ లీజు కాలపరిమితిని 15 నుంచి 30 సంవత్సరాలకు పెంచారు. మిగిలిన ఖనిజాల లీజు కాలపరిమితిని 5 నుంచి 10 ఏళ్లకు సవరించారు.
మళ్లీ ఓటీఎస్
గత సంవత్సరాల్లో పెండింగ్‌లో ఉన్న లీజు వివాదాలను పరిష్కరించేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్(ఓటీఎ్‌స)ను అమలు చేయనున్నారు. ఈ మేరకు గనుల శాఖ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జరిమానాలను 10 రెట్ల నుంచి 2 రెట్లకు తగ్గించారు. గనుల ముందస్తు అనుమతులకు ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. గనులు, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సభ్యులుగా ఉంటారు. కుటుంబ సభ్యులకు లీజు బదిలీ చేసే సమయంలో వసూలు చేసే ఫీజను పూర్తిగా మాఫీ చేయనున్నారు. కాగా.. గత ప్రభుత్వంలో 7 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఏర్పాటు చేసిన సీనరేజీ కలెక్షన్ కాంట్రాక్ట్(ఎ్‌ససీసీ)ను మూడు నెలలు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే, సీనరేజీ కాంట్రాక్టర్లకు రూ.190 కోట్ల బకాయిలు మాఫీ చేయాలని గనులశాఖ ప్రతిపాదించింది.
కొవిడ్ లెవీ రద్దు
కొవిడ్ ఖర్చుల నిమిత్తం 2021లో విధించిన కన్సిడరేషన్ అమౌంట్‌ను పూర్తిగా రద్దుచేశారు. ఈ మేరకు గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త పాలసీలో టన్నేజ్ ఆధారిత సీనరేజ్ ఫీజు విధానం అమలవుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేకంగా డోలమైట్, షేల్, స్లేట్‌లపై ఎలాంటి అదనపు భారాలు ఉండవని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Dy Collectors Transfer: భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కరాలు.. ఎప్పటి నుంచంటే..
National Herald Case: ఈడీ ఛార్జ్‌షీట్లో సోనియా, రాహుల్ పేర్లు
BRS MLA: ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
Farmers: దేశ ప్రజలకు అదిరిపోయే వార్త
Errabelli Dayakar Rao: అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకొంటా..
PM Modi: ఏపీకి ప్రధాని మోదీ.. ఎప్పుడంటే..
వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ
Hyderabad Summit:హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ..
For AndhraPradesh News And Telugu News