Solar Power: పొలాలకు పీఎం కుసుమ్!
ABN , Publish Date - Jan 03 , 2025 | 05:38 AM
రాష్ట్రంలోని వ్యవసాయ పంపు సెట్లకు ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్తు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

17 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్లు
కేంద్ర పథకంలో చేరాలని రాష్ట్రం నిర్ణయం
గ్రిడ్ అనుసంధానంతో రైతులు మిగులు కరెంట్ అమ్ముకొనే చాన్స్
అమరావతి, జనవరి 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వ్యవసాయ పంపు సెట్లకు ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్తు అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అస్మదీయ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు గత వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విస్మరించిన ఈ స్కీమ్‌లో చేరి, రైతులకు లబ్ధి చేకూర్చాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ను కుసుమ్ స్కీమ్‌లో చేర్చాలని న్యూఅండ్ రెన్యువల్ ఎనర్జీ కార్పొరేషన్ ఎండీ చక్రధరబాబు ఇటీవల కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖను కోరారు. ఈ వినతి పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. దీంతో రాష్ట్రంలోని 17 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ ప్యానళ్లతో కూడిన విద్యుత్తు పరికరాలు బిగించేలా కార్పొరేషన్ కార్యాచరణ సిద్ధం చేసింది. సంబంధిత ఆదేశాలు అధికారికంగా వెలువడలేదు. అయితే వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ కొంతకాలం నిలిపివేయాలని ప్రభుత్వం నుంచి డిస్కమ్‌ల సీఎండీలకు మౌఖిక ఆదేశాలు వెళ్లాయి.
కుసుమ్ కింద సోలార్ విద్యుత్తు అందించేందుకు స్థానికంగా గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ట్రాన్స్‌మిషన్ వ్యయం, నష్టాలు తగ్గుతాయి. రైతులు తమకు అవసరమైన మేర సోలార్ విద్యుత్తు వాడుకుని, మిగిలిన దాన్ని గ్రిడ్ ద్వారా డిస్కమ్‌లకు విక్రయించుకునే వెసులుబాటు కల్పిస్తారు. కాగా, కుసుమ్ పథకాన్ని గత వైసీపీ ప్రభుత్వం అందిపుచ్చుకోలేదు. ఈ స్కీమ్‌లో చేరడంలేదని కేంద్రానికి సీఎం హోదాలో జగన్ అప్పట్లో స్పష్టం చేశారు. తన అస్మదీయ కంపెనీకి వ్యవసాయ మీటర్లను బిగించే పనులు అప్పగించాలన్న రహస్య అజెండాతో.. పీఎం కుసుమ్‌లో చేరడం లేదని జగన్ ప్రకటించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉచిత వ్యవసాయ విద్యుత్తు పథకాన్ని కొనసాగిస్తామని చెబుతూనే.. రైతులు వాడే కరెంటును లెక్కగట్టి ప్రతినెలా వారి ఖాతాలో ఆ మొత్తాన్ని జమ చేస్తామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు గృహాలు, వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించే పనులు అప్పగించారు. పట్టణాలు, నగరాల్లో విద్యుత్తు వినియోగం నెలకు 200 యూనిట్లు దాటితే మీటర్లు బిగించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను అదానీ కంపెనీకి అప్పగించారు. వ్యవసాయ విద్యుత్తు మీటర్లను బిగించే పనులు తమ అస్మదీయ సంస్థ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌కు కట్టబెట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడేలోపే ఆయా సంస్థలు స్మార్ట్ మీటర్ల సరఫరా ప్రారంభించాయి. అయితే ఈ లావాదేవీలు ఇంకా ప్రారంభం కాలేదు.
రైతులు వద్దంటున్నా..
వైసీపీ పాలనలో రైతులు వద్దంటున్నా.. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లు అమర్చడం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టారు. రైతుల పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. వీటి నిర్వహణను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నెలనెలా రైతు ఖాతాలో కరెంటు బిల్లుల సొమ్ము పడటం.. అవి డిస్కమ్‌లకు జమ కావడం లాంటి ప్రక్రియ నోచుకోలేదు. వ్యవసాయ విద్యుత్తుకు స్మార్ట్‌మీటర్ల బిగింపుపై రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీఎం కుసుమ్ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.