Deputy CM Pawan Kalyan : రాళ్ల సీమలో పవర్ ప్రాజెక్టు.. అద్భుతం
ABN, Publish Date - Jan 12 , 2025 | 03:28 AM
రాయలసీమలో వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో సమగ్ర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) పెట్టాలనే ఆలోచనే అద్భుతమని, సీఎం చంద్రబాబు విజన్‌కు ఇది నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
సీఎం చంద్రబాబు విజన్‌కు నిదర్శనం
ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే అధిక ప్రోత్సాహం
దేశానికి ఐఆర్‌ఈపీ తలమానికం
ప్రత్యక్షంగా, పరోక్షంగా 12 వేల మందికి ఉపాధి
‘అటవీ వివాదం’ త్వరలోనే తొలగిపోతుంది
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడి
ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ వ్యూ
స్వయంగా కారు నడుపుతూ టన్నెల్ పనుల పరిశీలన
కర్నూలు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో వ్యవసాయానికి పనికిరాని బీడు భూముల్లో సమగ్ర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) పెట్టాలనే ఆలోచనే అద్భుతమని, సీఎం చంద్రబాబు విజన్‌కు ఇది నిదర్శనమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకే ప్రభుత్వం అధిక ప్రోత్సాహం అందిస్తోందని చెప్పారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుమ్మటంతండా, నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం గ్రామాల మధ్య గ్రీన్‌కో కంపెనీ ఐఆర్‌ఈపీని ఏర్పాటుచేస్తోంది. నిర్మాణాన్ని దాదాపుగా పూర్తిచేసుకున్న ఈ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పవన్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మా ట్లాడారు. ‘‘ఐఆర్‌ఈపీ కోసం 2,800 ఎకరాలకుగాను 1,700 ఎకరాలను ప్రభుత్వం, రైతుల నుంచి గ్రీన్‌కో కంపెనీ సేకరించింది. మరో 902 ఎకరాలను కేంద్ర ప్రభుత్వ అనుమతితో అటవీ శాఖ భూమి తీసుకొని, అందుకు సమానమైన భూమి నెల్లూరు జిల్లాలో అటవీ శాఖకు ఆ కంపెనీకి అప్పగించింది. మొక్కలు పెంచడానికి మరో రూ.36 కోట్లు కూడా ఇచ్చింది. ఈక్రమంలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య దాదాపు 111 ఎకరాల భూమి విషయంలో వివాదం మొదలైంది. ఇది నా దృష్టికి వచ్చినప్పుడు.. క్షేత్రస్థాయిలో నే పరిస్థితిని గమనించాలని భావించి ఇక్కడకు వచ్చాను.
ఈ వివాదం పరిష్కరించాలని కేంద్రాన్ని కోరాం. సీఎం చంద్రబాబు, మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి గ్రీన్‌కో కంపెనీకి సహకరిస్తాం. రానున్నకాలంలో ఈ ప్రాంతం పర్యటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. భూములు ఇచ్చిన పిన్నాపురం, గుమ్మటంతండా గ్రామాల్లో సామాజిక సేవా కార్యక్రమా లు, సేంద్రియ వ్యవసాయం, గో సంరక్షణ కార్యక్రమాలు గ్రీన్‌కో చేపట్టాలి. విద్యా ప్రగతికి తోడ్బాటు అందించాలి’’ అని పవన్ కోరారు. పిన్నాపురం ఐఆర్‌ఈపీ ప్రాజెక్టు దేశానికే తలమానికమన్నారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఇదే తొలిసారి ప్రాజెక్టు అని వివరించారు. గ్రీన్‌కో సంస్థ దేశంలో గ్రీన్ ఎనర్జీ కోసం ఇప్పటివరకు రూ.1.50 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టగా, అందులో 30 వేల కోట్లు రాష్ట్రంలో పెట్టిందన్నారు. మరో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పిన్నాపురం ప్రాజెక్టులో రూ.12 వేల కోట్టు పెట్టుబడి పెట్టగా, మరో రూ.10 వేల కోట్లు పెట్టాల్సి ఉందని తెలిపారు. ఆ ప్రాజెక్టు 12 వేల మందికి ఉపాధి కల్పిస్తుందని పవన్ చెప్పారు. దీనికి ముందు.. ఆయన ఐఆర్‌ఈపీలో భాగంగా నిర్మించిన అప్పర్ ఇన్‌టెక్ పాయింట్, లోయర్ ఇన్‌టెక్ పాయింట్‌తో పాటు పవర్ హౌస్‌ను పరిశీలించారు. టన్నెల్‌లో స్వయంగా రేంజ్‌రోవర్ కారు నడిపారు. ప్రాజెక్టు నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి.. తదితర వివరాలను పవర్ పాయింట్ ద్వారా పవన్‌కు కంపెనీ ఇంజనీర్లు వివరించారు.
అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ పెట్టాలి
కడప జిల్లాలో వైసీపీ ముఖ్యనాయకుడు అటవీ భూమిని కబ్జా చేసిన వ్యవహారంలో ఇప్పటికే ఓ ఫారెస్ట్ అఽధికారిని సస్పెండ్ చేశామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో అటవీ భూములు అన్యాక్రాంతమైనట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. మిగిలిన జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోందన్నారు. అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అటవీశాఖ భూములు ఎక్కడెక్కడ అన్యాక్రాంతం అయ్యాయో నిగ్గు తేలుస్తామని చెప్పారు. దీనిపై త్వరలోనే అధికారులతో సమీక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామన్నారు. కర్నూలు అద్భుతమైన నగరంగా అభివృద్ధి చెందడానికి అవసరమైన ఎనర్జీ ఇక్కడే (పిన్నాపురం ఐఆర్‌ఈపీ) ఉందని, మేధావుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, గ్రీన్‌కో గ్రూప్ సీఈవో, ఎండీ చలమలశెట్టి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 12 , 2025 | 03:28 AM