IT Department AP : డౌన్‌లోడ్‌ చేస్తే మీ ఫోన్‌ పనిచేయదు

ABN, Publish Date - Mar 28 , 2025 | 05:21 AM

రాష్ట్రంలో బెట్టింగ్‌ యాప్‌లపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి వాటిని నిషేధించే చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీ శాఖ తెలిపింది

IT Department AP : డౌన్‌లోడ్‌ చేస్తే మీ ఫోన్‌ పనిచేయదు
  • బెట్టింగ్‌ యాప్‌లపై యుద్ధానికి ‘ఐటీ’ సిద్ధం

  • త్వరలో హోం శాఖకు శక్తివంతమైన సాఫ్ట్‌వేర్‌

అమరావతి, మార్చి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బెట్టింగ్‌ యాప్‌లపై ఉక్కుపాదం మోపాలని, వాటిపై నిషేధం విధించడానికి ఉన్న అన్ని అవకాశాలనూ పరిశీలించాలని హోం, ఐటీ శాఖలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన ఐటీ శాఖ... అమలులో ఉన్న జాతీయ, అంతర్జాతీయ చట్టాలను పరిశీలించేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో ఇప్పటికే బెట్టింగ్‌ యాప్‌లపై నిషేధం అమలులో ఉందని, అయితే వాటిని వాడుతున్నవారికీ, ప్రమోట్‌ చేస్తున్నవారికి కఠినశిక్షలు పడేలా చర్యలు లేవని గుర్తించింది. దీంతో.. ఇప్పటికే ఉన్న నిషేధం ఉత్తర్వును సరిదిద్దాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్లుగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ సాయంతో బెట్టింగ్‌ యాప్‌లను ఎవరు డౌన్‌లోడ్‌ చేసుకున్నా సైబర్‌ క్రైమ్‌ విభాగానికి సమాచారం చేరుతుంది. అంతేకాదు డౌన్‌లోడ్‌ చేసుకున్న ఎలకా్ట్రనిక్‌ పరికరం ఆటోమేటిక్‌గా బ్లాక్‌ అవుతుంది. వీలైనంత త్వరగా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసి హోం శాఖకు అందించే దిశగా ఐటీ శాఖ కృషి చేస్తోంది. అలాగే బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తే కఠినంగా శిక్షలు పడేలా చట్టాలను అమలు చేసేందుకు హోం శాఖకు సహకరించనుంది. త్వరలోనే బెట్టింగ్‌ యాప్‌లను సంపూర్ణంగా నిషేధిస్తూ ఉత్తర్వు జారీ చేయనున్నట్లు ఐటీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.


For More AP News and Telugu News

Updated Date - Mar 28 , 2025 | 05:21 AM