Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి కోసం హైదరాబాద్‌లో గాలింపు
ABN , Publish Date - Apr 14 , 2025 | 06:46 PM
Raj Kasireddy: మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులకు సహకరించాలని ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి తప్పించుకొని తిరుగుతోన్నారు. ఈ నేపథ్యంలో అతడి కోసం ఏపీ సిట్ అధికారులు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.

అమరావతి, ఏప్రిల్ 14: సిట్ అధికారుల విచారణకు హాజరుకావాలంటూ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డిని ఏపీ హైకోర్టు ఆదేశించిన అతడు తప్పించుకొని తిరుగుతోన్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ సిట్ అధికారులు అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అందులోభాగంగా సోమవారం హైదరాబాద్ మహానగరంలోని పలు ప్రాంతాలు.. జూబ్లీహిల్స్‌తో పాటు గచ్చిబౌలి, ఫైనాన్స్ డిస్ట్రిక్‌లో ఏపీ సిట్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఆ క్రమంలో అతడి నివాసానికి నోటీసులు అంటించారు.
అలాగే అతడి కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న రాయదుర్గంలోని ఆరేట ఆసుపత్రితోపాటు రాజ్ కసిరెడ్డికి చెందిన ఈడీ క్రియేషన్స్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అయితే మద్యం స్కాం కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డి దేశంలోనే ఉన్నాడని సిట్ అధికారులు స్పష్టం చేశారు. అతనిపై గతంలోనే LOC ఇచ్చామని వారు పేర్కొన్నారు. ఇక రాజ్ కసిరెడ్డి త్వరలోనే కలుగులో నుంచి బయటకు వస్తాడని వారు ధీమా వ్యక్తం చేశారు.
తన ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి.. వేరే ఫోన్లను రాజ్ కసిరెడ్డి వాడుతోన్నారని గుర్తించినట్లు సిట్ అధికారుల చెప్పారు. మరోవైపు రాజ్ కసిరెడ్డి సిట్ విచారణకు హాజరుకాకుండా.. హైదరాబాద్‌లో తలదాచుకున్నట్లు వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కసిరెడ్డి కోసం నిర్వహించిన దాడుల్లో మొత్తం 50 మంది అధికారులు పాల్గొన్నారు.
ఇక లిక్కర్ స్కాంలో అతడు కీలక పాత్ర పోషించినట్లు ఇప్పటికే ఏపీ సిట్ అధికారులు గుర్తించారు. సిట్ విచారణకు హాజరు కావాలంటూ ఏపీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. వాటిని ఆతడు బేఖతరు చేసి.. తప్పించుకొన్ని తిరుగుతోన్నాడు. ఈ నేపథ్యంలో అతడి కోసం గాలింపు చర్యలను సిట్ అధికారులు తీవ్ర తరం చేశారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లను గెలుచుకొంది. దీంతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మార్కెట్‌లోని అప్పటి వరకు ఉన్న మద్యం బ్రాండ్లను పక్కన పెట్టి.. జే బ్రాండ్లను తీసుకు వచ్చారు. ఈ బ్రాండ్ల ద్వారా ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింది. అంతేకాదు.. మద్యం విక్రయాలన్నీ డిజిటల్ పేమెంట్లలో కాకుండా.. నేరుగా నగదు చెల్లించి దుకాణాల్లో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు సైతం వెల్లువెత్తాయి.
ఇక 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తర్వాత గతంలో జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన జే బ్రాండ్లను రద్దు చేసి.. పూర్వం ఉన్న బ్రాండ్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే మద్యం కుంభకోణం కారణంగా.. వేలాది కోట్ల నగదు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టింది. అందులోభాగంగా ఈ మద్యం కుంభకోణంతో ప్రమేయమున్న వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి ఎవరికి చిక్కకుండా తప్పించుకొని తిరుగుతోన్నారు. దాంతో అతడి కోసం హైదరాబాద్‌లో గాలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Gutkha Khaini: గుట్కా తయారీలో వాడేవి ఇవే.. తింటే డైరెక్ట్‌గా అక్కడికే..
Kancha Gachibowli: కంచ గచ్చిబౌలిపై సుప్రీంలో అఫిడవిట్.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పిందంటే..
New Delhi: విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ టెర్మినల్‌లోకి నో ఎంట్రీ
UPI Transactions: ఫోన్‌పే, గూగుల్‌పే చేస్తున్నారా ఈ 12 అంకెల యూటీఆర్ చరిత్ర తెలుసా
For AndhraPradesh News And Telugu News