Share News

ఆక్వాపై అగ్రరాజ్యం సెగ

ABN , Publish Date - Apr 07 , 2025 | 12:43 AM

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిపై అగ్రరాజ్యం అమెరికా విధించిన 27 శాతం సుంకం జిల్లాలోని ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సుంకం కారణంగా 30 కౌంట్‌ ఉన్న రొయ్యలను ఎగుమతి చేయాలంటే కిలోకు రూ.130 అదనపు భారం పడనుంది. ఇప్పటికే 50 కౌంట్‌ కంటే తక్కువ ఉన్న రొయ్యల కొనుగోళ్లను ఎగుమతిదారులు నిలిపివేశారు. విద్యుత చార్జీల రూపంలో ప్రస్తుతం రైతులు పెనుభారం మోస్తున్నారు. పెరిగిన మేత ధరలతో అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా సాగు ఎలా చేయాలి అనే అంశం రైతుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

 ఆక్వాపై అగ్రరాజ్యం సెగ

- ఎగుమతులపై 27 శాతం సుంకం విధించిన అమెరికా

- 30 కౌంట్‌ ఉన్న రొయ్యల ఎగుమతికి కిలోకు రూ.130 అదనపు భారం

- నిలిచిన 50 కౌంట్‌ కంటే తక్కువ ఉన్న రొయ్యల కొనుగోళ్లు

- ఇప్పటికే విద్యుత చార్జీల రూపంలో రైతులపై పెనుభారం

- పెరిగిన మేత ధరలతో అవస్థలు

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిపై అగ్రరాజ్యం అమెరికా విధించిన 27 శాతం సుంకం జిల్లాలోని ఆక్వా పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సుంకం కారణంగా 30 కౌంట్‌ ఉన్న రొయ్యలను ఎగుమతి చేయాలంటే కిలోకు రూ.130 అదనపు భారం పడనుంది. ఇప్పటికే 50 కౌంట్‌ కంటే తక్కువ ఉన్న రొయ్యల కొనుగోళ్లను ఎగుమతిదారులు నిలిపివేశారు. విద్యుత చార్జీల రూపంలో ప్రస్తుతం రైతులు పెనుభారం మోస్తున్నారు. పెరిగిన మేత ధరలతో అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆక్వా సాగు ఎలా చేయాలి అనే అంశం రైతుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లాలో 111 కిలో మీటర్ల సముద్ర తీరం ఉంది. లక్ష ఎకరాలకు పైగా రొయ్యల సాగు జరుగుతోంది. ఏటా 2.52 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి జరుగుతుందని అంచనా. దీంతో పాటు సముద్రపు వేట ద్వారా లభించే రొయ్యలను కూడా విదేశాలకు ఎగుమతి చేస్తారు. చెరువుల్లో సాగు చేసే రొయ్యలు 30 కౌంట్‌ వచ్చేవరకు రైతులు ఆగుతారు. ఈ తరుణంలో 30 నుంచి 50 కౌంట్‌ ఉన్న రొయ్యలు చెరువుల్లో అధికంగా ఉంది. వేసవిలో కొనుగోలు చేసిన రొయ్యలను ప్రాసెసింగ్‌ చేసి ఓడల ద్వారా డిసెంబరు నాటికి అమెరికాకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అమెరికా విధించిన సుంకం కారణంగా 30 కౌంట్‌ ఉన్న రొయ్యలను ఎగుమతి చేయాలంటే కిలోకు రూ.130 అదనపు భారం పడుతుందని, దీంతో స్థానికంగా రొయ్యల ధర తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. ఈ వ్యత్యాసాన్ని ఎగుమతిదారులు భరిస్తారా లేక రైతులకు ఇచ్చే ధరలోనే కోతపెడతారా అనే అంశంపై రైతుల్లో చర్చ జరుగుతోంది. ఆక్వా ఎగుమతులకు బ్రేక్‌ పడకుండా ఎగుమతిదారులు కొంతమేర భారం తమపై వేసుకునేందుకు ముందుకు వస్తారా లేదా అనే అంశంపై వారం రోజుల వ్యవధిలో స్పష్టత వస్తుందని స్థానికంగా రొయ్యలు కొనుగోలు చేసే వ్యాపారులు చెబుతున్నారు. మన దేశం నుంచి అమెరికా, చైనా తదితర దేశాలకు రొయ్యలన ఎగుమతి జరుగుతుందని, పెద్ద కౌంట్‌ ఉన్న రొయ్యలు అధికంగా అమెరికాకు ఎగుమతి అవుతాయని పెద్ద వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన 27 శాతం మేర సుంకం ప్రభావం తప్పనిసరిగా ఆక్వా రైతులపై పడుతుందని చెబుతున్నారు.

కొనుగోళ్లు నిలిపివేత

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా సుంకం పెంచడంతో 50 కౌంట్‌ కంటే పెద్ద రొయ్యల కొనుగోలును ప్రాసెసింగ్‌ యూనిట్‌ల యజమానులు, ఎగుమతి దారులు నిలిపివేశారు. కిలోకు 50, 60, 70, 80, 90, 100 కౌంట్‌ ఉన్న రొయ్యలనే ప్రస్తుతం కొనుగోలు చేస్తున్నారు. అదికూడా ధరలు తగ్గించి మరీ చేస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు కిలోకు 100 కౌంట్‌ ఉన్న రొయ్యలు రూ.250 మేర ధర ఉండగా, గత రెండు రోజులుగా ఈ ధరను రూ.200లకు తగ్గించివేశారు. 60 కౌంట్‌ ఉన్న రొయ్యల ధర గతంలో రూ.330 వరకు ఉండగా నేడు రూ.250కు పడిపోయింది. 50 నుంచి 100 కౌంట్‌ ఉన్న రొయ్యలను చైనా దేశానికి ఎగుమతి చేసేందుకే కొనుగోలు చేస్తున్నామని, పరిస్థితులు చక్కబడేవరకు అమెరికాకు రొయ్యల ఎగుమతులు ఉండవని ఎగుమతిదారులు చెప్పడం గమనార్హం. ఇప్పటికే తమ వద్ద ఉన్న సరుకును ఏ పద్ధతిలో ఎగుమతి చేయాలో తెలియడం లేదని, 30, 40, 50 కౌంట్‌ ఉన్న రొయ్యలను ఇప్పట్లో కొనుగోలు చేయబోమని ప్రాసెసింగ్‌ యూనిట్‌ల యజమానులు, ఎగుమతిదారులు స్పష్టం చేస్తున్నారు.

స్థానికంగా ఉన్న ఇబ్బందులు ఇవీ

ఏటా నవంబరు నుంచి జూన్‌ వరకు రొయ్యల సాగుకు అనుకూలంగా ఉంటుంది. గత వైసీపీ ప్రభుత్వం ఆక్వా జోన్‌లో ఉన్న భూములకే విద్యుతపై సబ్సిడీని ఇస్తామని ఆంక్షలు పెట్టింది. తీర ప్రాంతంలో అసైన్డ్‌ భూములే అధికంగా ఉండగా, వేరే పంటలు సాగు చేసే అవకాశం లేకపోవడంతో ఈ భూముల్లో రొయ్యల చెరువులను రైతులు సాగు చేస్తున్నారు. గతంలో అసైన్డ్‌ భూముల్లో సాగు చేసే రొయ్యల చెరువులకు కూడా విద్యుత సబ్సిడీ ఇచ్చేవారు. ఆక్వా జోన్‌ అంశం తెరపైకి వచ్చాక అసైన్డ్‌ భూముల్లో సాగు చేసే రొయ్యల చెరువులకు విద్యుతపై రాయితీని ఎత్తివేశారు. దీంతో రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్న భూములనే ఆక్వా జోన్‌ పరిధిలోకి తెచ్చి అసైన్డ్‌ భూములను మినహాయించడంతో ఆక్వా రైతులకు విద్యుత రాయితీ అందని పరిస్థితి నెలకొంది. ఆక్వాజోన్‌లో ఉన్నప్పటికీ ఒక్కో రైతుకు 10 ఎకరాల వరకే విద్యుత రాయితీని ఇస్తామని గత ప్రభుత్వం మెలికపెట్టింది. తాము సాగు చేస్తున్న రొయ్యల చెరువులను ఆక్వా జోన్‌ నుంచి తొలగించారని, దీంతో విద్యుత రాయితీ రావడం లేదని రైతులు గతంలోనూ, ఇప్పుడు ప్రజాప్రతినిధుల చుట్టూ నెలల తరబడి తిరుగుతూనే ఉన్నారు. చూస్తాం, చేస్తామని చెప్పడమే తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు.

రూ.వేలల్లో వచ్చే విద్యుత బిల్లు నేడు లక్షల్లోకి..

రొయ్యల చెరువులకు సంబంధించి యూనిట్‌కు విద్యుత బిల్లుగా రూ.3.84లను వసూలు చేసేవారు. దీనికి అదనంగా మరో ఐదుపైసలను చేర్చి యూనిట్‌కు రూ.3.90 వరకు వసూలు చేస్తున్నారు. 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్‌ ద్వారా 10 ఎకరాల్లోపు విద్యుతను వాడుకుంటే ఒక్కో యూనిట్‌కు రూ.2.35 రాయుతీగా వచ్చేది. దీంతో రైతులు నెలకు రూ.50 వేల నుంచి 60 వేల వరకు విద్యుత బిల్లులను చెల్లించేవారు. ప్రస్తుతం ఆక్వా జోన్‌లో భూమి నమోదై లేదనే కారణంతో విద్యుత రాయితీ ఎత్తివేయడంతో 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత వాడుకున్నందుకు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు విద్యుత బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. వివిధ రూపాల్లో విద్యుత బిల్లులను వసూలు చేస్తుంటంతో నెలకు లక్ష రూపాయలకు పైగా అదనంగా విద్యుత బిల్లుల రూపంలో నగదు చెల్లింపు చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మచిలీపట్నం మండలం కోన గ్రామంలో ఒక రైతు నెల రోజులుగా రొయ్యల చెరువుల్లో సాగును నిలిపివేశాడు. కనీస చార్జీల కింద రూ.2,500, వివిధ రూపాల్లో మరో రూ.70 వేలను బిల్లుగా ఇవ్వడం గమనార్హం. రొయ్యల సాగులో విద్యుత బిల్లులు, మేత ఖర్చులు అధికమవుతున్నాయనే కారణంతో రైతులు రొయ్యల సాగును చేయాలా, నిలిపివే యాలా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో అగ్రరాజ్యం రూపంలో మరో విపత్తు వచ్చి పడటంతో రొయ్యల సాగు చేసే రైతులు డోలాయమానంలో పడ్డారు.

Updated Date - Apr 07 , 2025 | 12:43 AM