Srisailam Dam Safety: శ్రీశైలం డ్యాం భద్రతకు కేంద్రం ఓకే
ABN , Publish Date - Apr 16 , 2025 | 05:37 AM
శ్రీశైలం డ్యాం ప్లంజ్‌పూల్ వద్ద ఏర్పడిన భారీ గోతిని పూడ్చేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఎన్‌డీఎస్‌ఏ చైర్మన్ ఈ నెల 28న విజయవాడ వచ్చి స్థితిగతులు సమీక్షించనున్నారు

ప్లంజ్‌పూల్ మరమ్మతుపైకార్యాచరణ
28న విజయవాడకు ఎన్‌డీఎస్ఏ చైర్మన్
ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్‌తో భేటీ
మర్నాడు జలాశయం, భారీగొయ్యి పరిశీలన
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాం భద్రతకు సంబంధించి ఉభయ రాష్ట్రాల ఆందోళనలపై కేంద్రం స్పందించింది. ప్లంజ్‌పూల్ వద్ద ఏర్పడిన భారీ గొయ్యిని పూడ్చడంపై కార్యాచరణ సిద్ధం చేయనుంది. ఇందుకోసం జాతీయ జలాశయాల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ ఈ నెలాఖరులో విజయవాడ రానున్నారు. 2009 సెప్టెంబరులో పెను వరదల కారణంగా శ్రీశైలం జలాశయం ప్లంజ్‌పూల్ వద్ద భారీ గొయ్యి ఏర్పడింది. దీనికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వం ఎన్‌డీఎస్ఏను అప్పటి నుంచి కోరుతూనే ఉంది. ఇటీవల సదరు గొయ్యి మరింత పెరిగి భయానకంగా మారింది. 2009 తరహాలో మరోసారి ఎగువ నుంచి భారీగా వరద వస్తే డ్యాం కొట్టుకుపోయే ప్రమాదం ఉందని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ కూడా.. ఈ గొయ్యి వల్ల జలాశయానికి ఏదైనా నష్టం వాటిల్లితే.. దాని ప్రభావం నాగార్జున సాగర్‌పై పడుతుందని.. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బంది తప్పదని కలవరపడుతోంది.
ఉభయ రాష్ట్రాల భయాందోళనల నేపథ్యంలో ఈ నెల 28న ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్ అనిల్ జైన్ బృందం విజయవాడ వస్తోంది. ఆరోజున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, డ్యాం ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమవుతుంది. మర్నాడు 29న శ్రీశైలం జలాశయాన్ని సందర్శిస్తుంది. ప్లంజ్‌పూల్ పరిస్థితిని అంచనా వేస్తుంది. 30న హైదరాబాద్‌లో తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో భేటీ తర్వాత ఢిల్లీ వెళ్లిపోతుంది. వాస్తవానికి శ్రీశైలం జలాశయం ముందున్న భారీ గొయ్యిని పూడ్చడం, మరమ్మతులు చేయడానికి సంబంధించిన అధ్యయన బాధ్యతను కేంద్రం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)కు అప్పగించింది. ఇందుకోసం రూ.16.70 కోట్లను డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా అందజేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ సంసిద్ధత తెలిపింది. ఇప్పటికే రూ.3 కోట్లు చెల్లించింది. తర్వాత ప్లంజ్‌పూల్‌ను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్.. మరమ్మతులకు 14 కీలకమైన సూచనలు చేసింది. వీటిని అనిల్ జైన్ బృందం తన పర్యటనలో సమీక్షించి కార్యాచరణ ప్రకటిస్తుందని జల వనరుల శాఖ వర్గాలు వెల్లడించాయి.