Polavaram Project: టీ-5 మిశ్రమంవైపే సీఎస్ఎంఆర్ఎస్ మొగ్గు!
ABN, Publish Date - Jan 16 , 2025 | 05:40 AM
పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఉపయోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం ఎంపికపై కేంద్ర జల సంఘం ఒకట్రెండు గురువారం నిర్ణయమూ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టీ-15కి ఓటేసిన విదేశీ నిపుణులు
ప్లాస్టిక్ కాంక్రీట్‌పై నేడు ఐఐటీ-తిరుపతి నివేదిక
అది చూశాక జలసంఘం నిర్ణయం!
అమరావతి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన డయాఫ్రం వాల్ నిర్మాణానికి ఉపయోగించే ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం ఎంపికపై కేంద్ర జల సంఘం ఒకట్రెండు గురువారం నిర్ణయమూ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జర్మన్ సంస్థ బావర్, మేఘా ఇంజనీరింగ్ సంస్థ నాలుగు రకాల మిశ్రమాలు తయారుచేసి దానికి, అంతర్జాతీయ నిపుణులు డేవిడ్ బ్రియాన్ పాల్, జియాన్ ఫ్రాంకో డి సిక్కో (అమెరికా), సీన్ హించ్‌బెర్గర్, చార్లెస్ రిచర్డ్ డొనెల్లీ (కెనడా)కు పంపింది. వాటిని పరిశీలించిన నిపుణులు ఈ నెల 9న వర్చువల్ భేటీలో తలో అభిప్రాయం చెప్పారు. టీ-15 మిశ్రమం వాడాలని సూచిస్తూ 10న నివేదిక పంపారు. వారితో సెంట్రల్ సాయిల్-మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్‌సఎంఆర్‌ఎస్) విభేదించింది. వాల్ నిర్మాణానికి గతంలో బావర్, ఎల్ అండ్ టీ సంస్థలు వాడిన టీ-5 మిశ్రమం మంచిదని స్పష్టం చేసింది. 2019లో గోదావరికి 14 లక్షల క్యూసెక్కులు, 2020లో 23 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా పాత వాల్ తట్టుకోగలిగిందని గుర్తుచేసింది.
ఇదే విషయాన్ని జల సంఘం కూడా ఇదివరకు జరిగిన పలు సమీక్షల్లో అంగీకరించింది. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో ఢిల్లీలో సీఎ్‌సఎంఆర్‌ఎస్ అధికారులతో జలసంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అధికారుల బృందం వరుస భేటీలు నిర్వహించింది. టీ5 మిశ్రమమే వాడాలని సీఎ్‌సఎంఆర్‌ఎస్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఇంకోవైపు.. బావర్-మేఘా తయారుచేసిన నాలుగు మిశ్రమాల పనితీరును పరీక్షించి అంచనా వేసే బాధ్యతను జలసంఘం ఐఐటీ-తిరుపతికి అప్పగించింది. అది గురువారం నివేదికను సమర్పించనుందని జలసంఘం బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావుకు తెలియజేసింది. దానిని పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సమాచారమిచ్చింది. గురు లేదా శుక్రవారం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని జల వనరుల శాఖ చెబుతోంది.
Updated Date - Jan 16 , 2025 | 05:41 AM