Telangana: హైదరాబాద్‌లో మంత్రిగారి మంత్రాంగం!

ABN, Publish Date - Jan 05 , 2025 | 03:47 AM

ఆయన తొలిసారి మంత్రి.. బాగా కీలకమైన పదవి. ఈ పదవిని ఆయనకు కట్టబెట్టినప్పుడే పొరుగురాష్ట్రం తెలంగాణతోపాటు, ఏపీలోనూ చర్చోపచర్చలు సాగాయి. ‘‘ఈయనకు ఆ పోర్టుఫోలియో (శాఖ) ఇచ్చారా?

Telangana: హైదరాబాద్‌లో మంత్రిగారి మంత్రాంగం!
CM Chandrababu and CM Revanth Reddy

  • ఆయన సంగతి కాస్త చూసుకోండి

  • ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ-సర్కారు

  • ఆయన తొలిసారి మంత్రి.. బాగా కీలక పదవి

  • వారంలో మూడురోజులు హైదరాబాద్‌లోనే..

  • స్టార్‌ హోటళ్లలో మకాం..అక్కడే సెటిల్‌మెంట్లు

  • ఒక రోజంతా పంచాయతీలు, పరిష్కారాలు

  • మిగిలిన రెండు రోజులూ జోరుగా గానాభజానా

  • ఎమ్మెల్యేగా ఉన్నప్పటినుంచీ ఇదే వరస

  • మంత్రి అయిన తర్వాత మరింత జోరు

  • ఏపీలో పని ఉన్నవారంతా అక్కడే బారులు

  • తెలంగాణ భూవ్యవహారాల్లోనూ జోక్యం

  • ఆ మంత్రి తీరుపై తెలంగాణ సర్కారు నిఘా

  • శ్రుతి మించుతోందంటూ బాబుకు సమాచారం

‘‘ఆయన మా దగ్గర ఏం చేస్తున్నారో, ఎక్కెడెక్కడ తిరుగుతున్నారో మీకు తెలుస్తోందా? ఆయన వ్యవహారాలు శ్రుతి మించిపోతున్నాయి. అవేవో అక్కడే చేసుకోమనండి. ఆయనను జర చూసుకోండి!’’.. ఓ మంత్రి గురించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన సూచన ఇది! ఆ మంత్రి వ్యవహార శైలిపై కీలక వివరాలు ఉన్న నోట్‌ను కూడా పొరుగు రాష్ట్రం పంపించింది. దీంతో ప్రభుత్వంలో ఇప్పుడీ అంశం పెను సంచలనంగా మారింది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌ మహానగరం కేంద్రంగా ఆయన ఏం పనులు చేస్తున్నారన్నది ఏపీ మంత్రివర్గంలో చర్చనీయాంశంగా మారింది.

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ఆయన తొలిసారి మంత్రి.. బాగా కీలకమైన పదవి. ఈ పదవిని ఆయనకు కట్టబెట్టినప్పుడే పొరుగురాష్ట్రం తెలంగాణతోపాటు, ఏపీలోనూ చర్చోపచర్చలు సాగాయి. ‘‘ఈయనకు ఆ పోర్టుఫోలియో (శాఖ) ఇచ్చారా? చంద్రబాబుకు అన్నీ తెలిసే నిర్ణయం తీసుకున్నారా? ఆయన ఇక్కడ ఏం పనులు చేస్తారో తెలిసే ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకున్నారా?’’ అని తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలు, రాజకీయవర్గాల్లో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇవే చర్చలు చంద్రబాబుకు చే రాయి. కానీ, అప్పటికే ఆయనకు పదవి ఇచ్చేయడంతో చంద్రబాబు ఏమీచేయలే ని పరిస్థితి. ఫిర్యాదులున్నాయి...పనితీరులో మంచి ఫలితాలతో ముందడుగు వేయాలని బాబు సూచన చేసినట్లు తెలిసింది.


అధినే త సూచనను ఆ చెవితో విని, ఈ చెవితో వదిలేసినట్లుంది ఆ ‘డార్లింగ్‌ మంత్రి’. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వారంలో రెండు రోజులు నియోజకవర్గం.. రెండు రోజులు అమరావతి, మరో మూడు రోజులు హైదరాబాద్‌లో మకాం... ఇదీ సదరు మంత్రి షెడ్యూల్‌. శుక్ర వారం నుంచే ఆ మంత్రి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టార్‌ హోటల్‌లో దిగిపోతారు. మంత్రికి ఆల్‌ ఇన్‌వన్‌గా ఒకరున్నారు. ఆయన షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఫైళ్లమీద సంతకాలు పెట్టరుకానీ, మిగిలిన వ్యవహారాలన్నీ ఆయనే చక్కదిద్దుతారు. శుక్రవారం వచ్చిందంటే చాలు మంత్రి, ఆయన ఆల్‌ ఇన్‌వన్‌, మరో ఇద్దరు కలిసి హైదరాబాద్‌లో తేలతారు. ఓ ప్రముఖ స్టార్‌హోటల్‌లో బస చేస్తారు. నాలుగు రూమ్‌లు బుక్‌ చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆ మంత్రితో పనులున్నవారు, కీలక వ్యవహారాలు చక్కబె ట్టుకోవాల్సినవారు ఆ హోటల్‌లో బారులు తీరతారు. ఇప్పుడిప్పుడు తెలంగాణలోని భూ వ్యవహారాల్లోనూ వేలు పెడుతున్నట్టు చెబుతున్నారు. ఏమైనా.. ఇదంతా ఆ మూడు రోజులు పెద్ద జాతరలా సాగుతుంది. ఒక రూమ్‌లో పంచాయతీలు, పరిష్కారాలు, సెటిల్‌మెంట్లు. ఇవన్నీ మంత్రి ఆల్‌ ఇన్‌వన్‌ చూస్తుంటారు. మరో రూమ్‌లో మంత్రి దర్జాగా విలాసాన్ని ప్రదర్శిస్తుంటారు. శనివారం మధ్యాహ్నం వరకే విజిటర్స్‌, సెటిల్‌మెంట్‌ కోసం వచ్చినవారిని అనుమతిస్తుంటారు. సాయంత్రం నుంచి ఆదివారం అర్ధరాత్రి వరకు గానాబజానా.. కళా ప్రదర్శనలతో హోరెత్తిస్తుంటారు.


తొలినుంచీ కళా పోషకుడే..

నిజానికి మంత్రి కాకముందే, ఓ సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నసమయంలో ఇదే జోరుండేది. మంత్రి అయ్యాక బుక్‌చేసే గదుల సంఖ్య పెరిగింది. ఆయన కోసం వచ్చే సందర్శకులు అదనం. హైదరాబాద్‌లో ఆ మంత్రికి రియల్‌ ఎస్టేట్‌, ఇతర వ్యాపార సంబంధాలున్నాయి. అదే సమయంలో ఏపీలోనూ పలు వ్యాపారా ఉలున్నాయి. ఆయన హైదరాబాద్‌లో కాలుపెట్టారంటే బ్యాచ్‌కు పండగే. ఇది రానురాను ఓ పెద్ద అంశంగా మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈయనపై దృష్టి పెట్టేంతగా వెళ్లింది. అంతకుముందు ఆయన హోటల్‌లో దిగితే ఏం చేస్తారో తెలుసు. కానీ ఏపీలో మంత్రి అయ్యాక, హైదరాబాద్‌ కేంద్రంగా ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత ఆరు నెలలుగా ఆ మంత్రి, ఆయన ఆల్‌ ఇన్‌వన్‌ ఎక్కడా తగ్గకుండా వీకెండ్‌ జోరుతోపాటు హైదరాబాద్‌ కేంద్రంగా వ్యవహారాలు అనేకం చక్కబె డుతున్న సమాచారం అక్కడి ప్రభుత్వ పెద్దలకు పక్కా ఆధారాలతో సహా చేరింది. దీంతో మరో అడుగు ముందుకేసి పూర్తిస్థాయి నిఘాపెట్టారు. అప్పుడే విస్మయం గొలిపే అంశాలు వారి దృష్టికి వెళ్లాయి. ఇక లాభం లేదనుకొని ఇటీవల సీఎం చంద్రబాబుకు తెలంగాణ ప్రభుత్వం ఓ లిఖితపూర్వక సమాచారం అందించింది. దాంతోపాటు మౌఖిక సూచనలతో ఒక కాల్‌ వచ్చినట్లు తెలిసింది. ఆ మంత్రి సాధారణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు? మంత్రి అయ్యాక ఏం చేస్తున్నారనేది ఆ నోట్‌లో సవివరంగా పేర్కొన్నట్లు తెలిసింది.


’’మీ మంత్రిని జర చూసుకోండి. ఆయన ఇక్కడ చేస్తున్న పనులేవీ బాగోలేవు. తెలంగాణ భూముల వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు. సెటిల్‌మెంట్లకు కౌంటర్‌ తెరిచారు. మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. అ పనులేవో అక్కడే (ఏపీలో) చేసుకోమనండి’’ అని సూటిగా, స్పష్టంగా చంద్రబాబుకు సూచన చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆ మంత్రి లీలలు, పనితీరుపై చంద్రబాబు పూర్తి నివేదిక తెప్పించుకున్నారని తెలిసింది. ఈ సందర్భంగా ఆ మంత్రి పేషీలో ఆల్‌ఇన్‌వన్‌ చేస్తున్న పనులు వెలుగుచూశాయి. మంత్రికి సన్నిహితుడు, వ్యాపార భాగస్వామిగా ఉన్న వ్యక్తే ఆ శాఖకు ఆల్‌ ఇన్‌వన్‌గా వ్యవహరిస్తున్నారని బయటకొచ్చింది. మంత్రికి వచ్చే కీలకమైన ఫైళ్లు, మంత్రి కోర్టు పరిధిలోని అంశాల్లో ఆయన వేలుపెట్టడం, ఇంకా ఏ నిర్ణయాలు తీసుకోవాల్నో దిశానిర్దేశం చేస్తున్నారని గుర్తించారు.

విజయవాడలోనూ అదే జోరు..

విజయవాడ గురునానక్‌ కాలనీలో మంత్రికి ప్రైవేటు నివాసం ఉంది. దానికి కూతవేటు దూరంలో ఓ స్టార్‌ హోటల్‌ ఉంది. అక్కడ మంత్రి పరివారం చేసే కార్యక్రమాలు వేరే లెవల్‌ అని ప్రభుత్వం గుర్తించింది. అటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఏపీ ప్రభుత్వ సొంత నివేదికలు ఆ డార్లింగ్‌ మంత్రిని పక్కాగా బుక్‌చేశాయి. మరి ప్రభుత్వాధినేత చంద్రబాబు ఎలా స్పందించనున్నారన్నది సహచర మంత్రులు, అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Jan 05 , 2025 | 06:59 AM