Chiranjeevi Chowdhary : సొంత ఖాతా నుంచే ఇంటి అద్దె చెల్లించా!
ABN , Publish Date - Mar 04 , 2025 | 06:38 AM
మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయ భవనానికి రెండేళ్ల తర్వాత ఇతర ప్రభుత్వ విభాగాలు చెల్లించే అద్దెతో సమానంగానే

‘ఆంధ్రజ్యోతి’ కథనంపై రిటైర్డ్ పీసీసీఎఫ్ చిరంజీవ్ వివరణ
అమరావతి, మార్చి3(ఆంధ్రజ్యోతి): మంగళగిరిలోని రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన కార్యాలయ భవనానికి రెండేళ్ల తర్వాత ఇతర ప్రభుత్వ విభాగాలు చెల్లించే అద్దెతో సమానంగానే అద్దె సవరించినట్టు రిటైర్డ్ పీసీసీఎఫ్ చిరంజీవ్ చౌదరి తెలిపారు. భవన యజమాని అటవీ శాఖ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని లేదా ఇతర శాఖలతో సమానంగా అద్దె చెల్లించాలని కోరినందున అద్దె పెంచినట్లు వివరించారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో అడవిలో ‘కిమ్’ రాజ్యం శీర్షికతో కథనం వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. 2016నుంచి తాను రెయిన్ ట్రీ పార్కులో ఉంటుండగా, అదే సొసైటీకి చెందిన ప్రస్తుత ఇంటికి నెలకు రూ.50 వేలు తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతా నుంచి అద్దె చెల్లిస్తున్నట్లు తెలిపారు. తన పదవీ కాలంలో ప్రభుత్వ వాహనాలను అధికారిక పనుల కోసమే వినియోగించానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ వాడలేదన్నారు. పీసీసీఎ్‌ఫగా వాడిన వాహనాలన్నీ పదేళ్ల కంటే పాతవని చెప్పారు. శాఖాపరమైన బదిలీలు, పోస్టింగ్‌ల్లో ఏ ఒక్కరి ప్రమేయం, అవినీతికి ఆస్కారం లేకుండా ఉపముఖ్యమంత్రి మద్దతుతోనే చేసినట్లు తెలిపారు. చాలాకాలంగా ఒకే పోస్టులో ఉన్న వారిని పరిపాలనా కారణాలతో బదిలీ చేయగా, కోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు పొందారన్నారు.