చిగురిస్తున్న చిత్తూరు
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:19 AM
ఐదేళ్ల అరాచకం అంతమైంది. విధ్వంసంలోంచి నిర్మాణం దిశగా పాలన మళ్లింది. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలి ఉగాదికి చిత్తూరు జిల్లా ప్రజలు కోటి ఆశలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ పది నెలల కాలంగా జిల్లాలో జరుగుతున్న పనులను చూసి భవిష్యత్తుపై నమ్మకాలు పెంచుకుంటున్నారు. విశ్వావసు నామ సంవత్సరంపై జిల్లా ప్రజల్లో చిగురు తొడుగుతున్న ఆశలు ఇవీ...

అరాచకం నుంచి అభివృద్ధి వైపు అడుగులు
చిత్తూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):
ఐదేళ్ల అరాచకం అంతమైంది. విధ్వంసంలోంచి నిర్మాణం దిశగా పాలన మళ్లింది. కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత వస్తున్న తొలి ఉగాదికి చిత్తూరు జిల్లా ప్రజలు కోటి ఆశలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ పది నెలల కాలంగా జిల్లాలో జరుగుతున్న పనులను చూసి భవిష్యత్తుపై నమ్మకాలు పెంచుకుంటున్నారు. విశ్వావసు నామ సంవత్సరంపై జిల్లా ప్రజల్లో చిగురు తొడుగుతున్న ఆశలు ఇవీ...
బంగారు బాటలు రెండు హైవేలు
బెంగుళూరు- చెన్నై ఎక్స్‌ప్రెస్ వే, చిత్తూరు- తచ్చూరు హైవేలు భవిష్యత్తులో జిల్లా అభివృద్ధికి బంగారు బాటలు కానున్నాయి. దక్షిణ భారతదేశంలోనే కీలకమైన రెండు మహానగరాలకు ఈ హైవేలు మన జిల్లాను మరింత చెరువ చేయనున్నాయి. పారిశ్రామికంగా, ఐటీ పరంగా అభివృద్ధికి ఇవి ఊతం ఇస్తాయి అని ఆశిస్తున్నారు. చెన్నై- బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వే మన జిల్లా పరిధిలో రూ.3997 కోట్లతో 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా.. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి కానున్నాయి. అలాగే రూ.2366 కోట్లతో మన జిల్లాలో 75 కిలోమీటర్లు ప్రయాణించే చిత్తూరు- తచ్చూరు హైవే ఈ ఏడాది అక్టోబరులో పూర్తి కానుంది.
హంద్రీనీవా పరుగులు
వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో హంద్రీనీవా పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక హంద్రీనీవా మెయిన్ కెనాల్‌తో పాటు, పుంగనూరు, కుప్పం బ్రాంచి కెనాల్స్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ రెండు బ్రాంచి కెనాల్స్‌లో కాంక్రీట్ లైనింగ్ పనుల కోసం డిసెంబరులో రూ.516 కోట్లను మంజూరు చేయగా.. వచ్చే మేలోగా పూర్తయ్యేలా పనులు వేగం అందుకున్నాయి.
గతుకులు పూడిన రోడ్లు
పల్లె పండుగలో భాగంగా రూ.వంద కోట్లతో 1372 సీసీ రోడ్ల పనులు మంజూరయ్యాయి. వాటిలో 1225 పూర్తయ్యాయి. అలాగే రూ.22 కోట్లతో గుంతలున్న ఆర్‌అండ్‌బీ రోడ్లను మరమ్మతులు చేశారు. ఐదేళ్ల గతుకుల ఇక్కట్టు జిల్లా ప్రజలకు తప్పాయి.
మామిడి బోర్డు వైపు అడుగులు
రాష్ట్రంలోనే మన జిల్లా మామిడికి ప్రసిద్ధి. తాజాగా మామిడి బోర్డు ఏర్పాటుకు ఎంపీ దగ్గుమళ్ల పార్లమెంటులో మాట్లాడడంతో పాటు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారు. కలెక్టర్ల సదస్సులో కూడా చిత్తూరులో మామిడి బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. ఈ పరిణామాలు మామిడి రైతుల్లో ఆశలు రేపుతున్నాయి.
అభివృద్ధికి ఐకాన్.. కుప్పం
సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం అయ్యాక ఇప్పటికే రెండుసార్లు పర్యటించారు. కుప్పం అభివృద్ధి మండలి (కడ)ని ఏర్పాటుచేసి ప్రత్యేకంగా ఓ ఐఏఎస్ అధికారిని నియమించారు. ఎయిర్‌పోర్టు, కేంద్రీయ విద్యాలయ, కృషి విజ్ఞాన కేంద్రాల మంజూరు, ననియాల ఎకో ఫారెస్టు అభివృద్ధి వంటి పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లాలో అభివృద్ధికి ఐకాన్‌గా కుప్పం మారనుంది.
చిత్తూరులో యూనివర్శిటీ
చిత్తూరులో కేంద్రీయ విద్యాలయ మంజూరు, పీవీకేఎన్‌ను యూనివర్శిటీగా ఏర్పాటు చేసేందుకు చర్యలు, అడవిపల్లె రిజర్వాయర్ నుంచి చిత్తూరుకు నీళ్ళ కేటాయింపు, రహదారుల అభివృద్ధి వంటి పనులు పురోగతిలో ఉన్నాయి. ఎమ్మెల్యే గురజాల జిల్లా కేంద్రం అభివృద్ధిపై పూర్తి శ్రద్ధ పెట్టారు. జిల్లాల విభజనలో వెనుకబడిన చిత్తూరు అభివృద్ధి దిశగా పరుగు అందుకుంటుందనే నమ్మకం ప్రజల్లో పెరిగింది.
జీడీ నెల్లూరులో పారిశ్రామికవాడ
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్ సూచన మేరకు చిత్తూరు- తచ్చూరు హైవేకు సమీపంలో 2 వేల ఎకరాల భూసేకరణ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇది సాకారమైతే చెన్నైకు దగ్గర్లో ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుంది. అత్యంత వెనుకబడిన ప్రాంతం అయిన జీడీనెల్లూరు నియోజకవర్గం భవిష్యత్తు మారబోతోందనే ఆశ ఈ ప్రాంత ప్రజల్లో పెరుగుతోంది.
నేతన్నల్లో పెరిగిన హుషారు
నగరిలో పెద్దఎత్తున ఉన్న మరమ్మగ్గ, చేనేత కార్మికులకు ఉచిత కరెంటు ఇస్తామని వైసీపీ ఎగ్గొట్టింది. దశాబ్దాలుగా కార్మికులు ఎదురుచూస్తున్న ఉచిత విద్యుత్తును ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు మంజూరు చేశారు. తాజా బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కోశలనగరంలో సేకరించిన 1650 ఎకరాల్లో పారిశ్రామికవాడ ఏర్పాటుకు ఎమ్మెల్యే భాను కృషి చేస్తున్నారు.
ఏనుగుల సమస్య పరిష్కారం దిశగా..
జిల్లాలోని ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన నాలుగు కుంకీ ఏనుగులు ఇక్కడికి రానున్నాయి. వాటి ద్వారా ఏనుగుల దాడుల్ని నివారించనున్నారు. ఈ విషయంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి కృషి చాలా ఉంది. అలాగే 2019లో ఆగిపోయిన అభివృద్ధి పనుల్ని మళ్లీ మంజూరు చేయించి ప్రారంభించారు.
యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళ్యంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుచేశారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళి కొత్తవాడైనా నియోజకవర్గం సమస్యలపై అసెంబ్లీలో గొంతు విప్పుతుండడం ఆ ప్రాంత ప్రజల్లో ఆశలు రేపుతోంది.