Tirupati: తిరుపతిలో పెను విషాదం.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల కోసం వెళ్లి..
ABN, Publish Date - Jan 08 , 2025 | 09:34 PM
తిరుమల వైకుంఠ దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు పోటెత్తడంతో ఓ మహిళ మృతిచెందింది. శ్రీనివాసం వద్ద జరిగిన తోపులాటలో భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది.
తిరుపతి: తిరుమల (Tirumala) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల (Vaikuntha Darshan tickets) జారీలో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడడంతో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య ఆరుగురికి చేరింది. టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున రావడంతో టీటీడీ సిబ్బంది పద్మావతి పార్కు నుంచి క్యూలైన్‌లోకి వారిని ఒక్కసారిగా వదిలారు. దీంతో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తమిళనాడు (Tamil Nadu)కు చెందిన మల్లిక (Mallika) సహా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయితే మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతరం రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. కాగా, తొక్కిసలాటలో గాయపడిన మిగిలి వారిని సిమ్స్, రుయాకు తరలించారు. రుయాలో చికిత్సపొందుతూ మరో ముగ్గురు భక్తులు మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే తాజాగా స్విమ్స్‌లో చికిత్సపొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
సీఎం చంద్రబాబు దిగ్ర్భాంతి..
కాగా, ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం వెళ్లి పలువురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగ్రాతులకు అందుతున్న చికిత్సపై అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. జిల్లా, టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Updated Date - Jan 08 , 2025 | 10:51 PM