Tax: పన్ను వసూళ్లలో తిరుపతి మూడోస్థానం
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:10 AM
తిరుపతి నగర పాలక సంస్థ పన్ను వసూళ్లలో తిరుపతి మూడో స్థానంలో నిలిచింది.

తిరుపతి, ఏప్రిల్10 (ఆంధ్రజ్యోతి): పన్నుల వసూళ్లలో తిరుపతి నగరపాలక సంస్థ రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ ఆధ్వర్యంలో గురువారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈసందర్భంగా రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం నిలిచినందుకు తిరుపతి కమిషనర్ ఎన్.మౌర్యను ప్రత్యేక కార్యదర్శి సురేష్, సీడీఎంఏ సంపత్‌కుమార్ సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. తిరుపతి నగర పాలక సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.100కోట్ల వివిధ రకాల పన్ను చెల్లింపులు జరిగాయి. ఆస్తిపన్ను రూ80.44కోట్లు, ఖాళీస్థలాల పన్ను (వీఎల్టీ) రూ9.92కోట్లు, నీటి పన్ను రూ8.18కోట్లు, మురుగునీటి పన్ను రూ1.50కోట్లు పన్నుల రూపంలో కార్పొరేషన్ ఖాతాలోకి చేరింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.84కోట్లు మాత్రమే వసూలు కాగా, ఈసారి వంద కోట్ల మార్కు దాటడంతో పన్నుల వసూళ్లలో రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లలో తిరుపతి మూడో స్థానంలో నిలిచింది. ఖాళీ స్థలాల పన్నులు చెల్లించడంలో తొలి నుంచీ కార్పొరేషన్ వెనుకంజలో ఉంది. ఎంత ఒత్తిడి చేసినా రూ4కోట్లు పైన వసూలైన సందర్భాలు లేవు. ఖాళీ స్థలాల యజమానులు స్పందించకపోతే ప్రభుత్వ స్థలమని బోర్డులు పెడతామని.. వీఎల్టీ చెల్లించకుంటే టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవని కమిషనరు చెప్పడంతో ఈ ఏడాది దాదాపు రూ10కోట్లు వసూలయ్యాయి. టీటీడీ నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులకు సంబంధించిన పన్నుల వివాదం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈమొత్తాన్ని మినహాయిస్తే రాష్ట్రంలోనే తిరుపతి నగరపాలక సంస్థ పన్ను వసూళ్లలో మొదటి స్థానంలో ఉన్నట్టేనని రెవెన్యూ అధికారి ఒకరు చెప్పారు.