చిత్తూరు నగరంలో పరువు హత్య
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:37 AM
యాస్మిన్ మృతిలో కుటుంబ సభ్యులదే పాత్ర పరారీలో తండ్రి, ఇద్దరు సోదరులు బంధువు నుంచి కూపీ లాగుతున్న పోలీసులు మతాంతర వివాహం చేసుకోవడమే కారణం

చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు నగరంలోని బాలాజీనగర్ కాలనీలో సోమవారం జరిగిన అనుమానాస్పద మృతిని పోలీసులు పరువు హత్యగా దాదాపు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మతాంతర వివాహం చేసుకుందన్న కక్షతో యాస్మిన్‌ను ఆమె తండ్రి, ఇద్దరు సోదరులు కలిసి అంతమొందించి పరారయ్యారు. అయితే యాస్మిన్‌ను హత్య చేయాలని ముందే కుటుంబ సభ్యులు ప్లాన్ చేసుకున్నట్లు పోలీసుల అదుపులో ఉన్న వారి దగ్గరి బంధువు చెప్పినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
చిత్తూరు బాలాజీనగర్ కాలనీలో నివాసముంటున్న ముంతాజ్, షౌకత్‌ఆలీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు.చిన్న కూతురు యాస్మిన్(26) ఎంబీఏ పూర్తి చేసింది. కాలేజీలో ప్రేమించిన పూతలపట్టు మండలం పోటుకనుమకు చెందిన సాయితేజ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.ఈ విషయం ఇంట్లో తెలిసి తల్లిదండ్రులు యాస్మిన్‌కు పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి మూడు రోజులు ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యాస్మిన్ ఫిబ్రవరి 9వ తేదీన నెల్లూరులో సాయితేజ్‌ను పెళ్లి చేసుకుంది. ప్రాణహాని ఉందని గుర్తించిన యాస్మిన్, సాయితేజ్ తిరుపతి పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాల వారిని పోలీసులు ిపలిపించి సర్ది చెప్పి పంపించారు. అప్పటి నుంచి రెండు నెలల వరకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా వీరి సంసారం సాగింది.
తండ్రికి ఆరోగ్యం బాలేదని పిలిపించి..
యాస్మిన్ పెళ్లితో కుటుంబ పరువు పోయిందని భావించిన షౌకత్‌ఆలీ కుటుంబ సభ్యులు ఆమెపై కక్ష పెంచుకున్నారు.పూర్తిగా విచక్షణ కోల్పోయి ఆమె ప్రాణం తీసేందుకు ప్లాన్ చేశారు.షౌకత్‌ఆలీకి ఆరోగ్యం బాలేదంటూ ఫోన్లు చేసి ఆదివారం ఉదయం యాస్మిన్‌ను ఇంటికి పిలిపించారు.ఆమె భర్త సాయితేజ్ చిత్తూరు గాంధీసర్కిల్లో వదిలిపెట్టగా ఆమె పెద్దమ్మ కుమారుడు లాలూ సాహెబ్ ఇంటికి యాస్మిన్‌ను తీసుకెళ్లాడు. వచ్చిన 20 నిమిషాల్లోపే ముందుగా అనుకున్న పథకం ప్రకారం యాస్మిన్‌ను గొంతు నులిమి చంపేశారు.భార్యకోసం షౌకత్‌ఆలీ ఇంటికి వచ్చిన సాయితేజ్‌కు ఆమె ఉరేసుకుని చనిపోయిందని నమ్మించారు.చిత్తూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో శవముందని చెప్పడంతో సాయితేజ్ అక్కడికెళ్లాడు.పోస్టుమార్టం సందర్భంగా యాస్మిన్ మెడ కింద గాయాన్ని వైద్యులు నిర్ధారించారు.పోస్టుమార్టం పూర్తయ్యాక సోమవారం సాయంత్రం శవాన్ని అప్పగించడంతో సాయితేజ్ సొంతూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు.
పోలీసుల అదుపులో దగ్గరి బంధువు
యాస్మిన్ మృతి కేసులో తండ్రి, ఇద్దరు సోదరులు పరారయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కుటుంబ దగ్గరి బంధువును అదుపులోకి తీసుకున్నారు. యాస్మిన్ మృతి విషయంలో ఏం జరిగిందని, నిందితులు ఎక్కుడున్నారని విచారిస్తున్నారు. యాస్మిన్‌ను చంపాలని ముందే ప్లాన్ చేసుకుని పిలిపించినట్లు పోలీసుల అదుపులోని వ్యక్తి అంగీకరించినట్లు తెలుస్తోంది. చంపింది నిజమే కానీ, ఎలా చంపారనేది పోలీసులు ఇంకా నిర్ధారణకు రావడం లేదు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితులు దొరికితేనే విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక క్లారిటీ
యాస్మిన్ మృతి విషయం సెన్సిటివ్ కావడంతో పోస్టుమార్టం రిపోర్టు విషయంలో వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సోమవారమే పోస్టుమార్టం పూర్తయినా మంగళవారం రాత్రికి కూడా రిపోర్టు సిద్ధం కాలేదని సమాచారం. పోస్టుమార్టం చేసిన వైద్యులు సీనియర్ల ఒపీనియన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం రిపోర్టు వచ్చాక ఏ విధంగా హత్య చేశారనేది విషయంపై స్పష్టత రానుంది.