Share News

Fake Ghee Case.. టీటీడీకి కల్తీ నెయ్యి కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ

ABN , Publish Date - Feb 13 , 2025 | 07:55 AM

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న నేరారోపణతో ఏఆర్‌, వైష్ణవి, భోలేబాబా డెయిరీలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులను సిట్‌ గత ఆదివారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే నలుగురు నిందితుల కస్టడీ కోసం సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం తిరుపతి రెండో ఏడీఎం కోర్టులో విచారణ జరగనుంది.

Fake Ghee Case.. టీటీడీకి కల్తీ నెయ్యి కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణ
TTD Fake Ghee Case

తిరుపతి: టీటీడీ (TTD)కి కల్తీ నెయ్యి ( Fake Ghee) సరఫరా చేసిన కేసు (Case)లో అరెస్టయి రిమాండులో ఉన్న నలుగురు నిందితుల కస్టడీ (Custody) కోసం సిట్‌ (SIT) దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం తిరుపతి రెండో ఏడీఎం కోర్టులో విచారణ జరగనుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న నేరారోపణతో ఏఆర్‌, వైష్ణవి, భోలేబాబా డెయిరీలకు చెందిన నలుగురు కీలక వ్యక్తులను సిట్‌ గత ఆదివారం రాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అదే రోజు అర్ధరాత్రి స్థానిక రెండో ఏడీఎం కోర్టు నిందితులు నలుగురికీ 11 రోజుల పాటు రిమాండ్‌ విధించడంతో తిరుపతి సబ్‌ జైలుకు తరలించారు. మరుసటి రోజు సోమవారం సిట్‌ అధికారులు నిందితులు రాజశేఖరన్‌, పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌, అపూర్వ వినయ్‌కాంత్‌ చావడాలను విచారణ నిమిత్తం కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై రెండో ఏడీఎం కోర్టు గురువారం విచారణ చేపట్టనుంది.

ఈ వార్త కూడా చదవండి..

మేడారంలో కొనసాగుతున్న మినీజాతర


తిరుపతికి సీబీఐ చీఫ్..

కాగా సీబీఐ డైరెక్టర్‌ ప్రవీణ్‌ సూద్‌ వారం రోజుల్లో తిరుపతికి వచ్చే అవకాశాలున్నాయి. తిరుపతిలోని సిట్‌ అధికారులతో బుధవారం సీబీఐ చీఫ్‌ వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు పురోగతిపై ఆరా తీశారు. ఈ సమీక్ష సందర్భంగా... ఏఆర్‌ డెయిరీ నుంచి నెయ్యి సరఫరాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్న టీటీడీ మునుపటి ముఖ్యులను ప్రశ్నించే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. సీబీఐ డైరెక్టర్‌ తాజా సమీక్ష, కొద్ది రోజుల్లో ఆయనే స్వయంగా తిరుపతికి వచ్చే అవకాశాలున్న దృష్ట్యా కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. టీటీడీకి సంబంధించిన మునుపటి కీలక అధికారిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి సేకరణకు సంబంధించిన టెండరు నిబంధనలను ఎందుకు సడలించాల్సి వచ్చింది.. తక్కువ ధరకు కోట్‌ చేసిన నెయ్యిని ఎలా కొనుగోలు చేశారు.. బహిరంగ మార్కెట్‌లో నెయ్యి ధర ఎక్కువ ఉండగా తక్కువకు సరఫరా చేయడం ఎలా సాధ్యం? తక్కువకు సరఫరా అంటే నాణ్యతలో రాజీ పడినట్టే కదా? అన్న అంశాలపై ప్రశ్నించాలని సిట్‌ భావిస్తున్నట్టు సమాచారం.


కోట్లాది మంది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదాలకు వాడే నెయ్యి నాణ్యమైనదిగా ఉండాలని, అలాంటప్పుడు తక్కువ ధరకు సరఫరా చేసే నెయ్యి నాణ్యంగా ఉంటుందని అప్పటి టీటీడీ బాధ్యులు ఎలా భావించారు.. దీనిపై ఎలా నిర్ణయాలు తీసుకున్నారనే ప్రశ్నలు సిట్‌ అధికారులను వేధిస్తున్నాయి. దీని వెనుక పర్సెంటేజీలు, కమీషన్లు వంటి ఆర్థిక లబ్ధి గానీ లేదంటే అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనైనా గానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఉండాలని సిట్‌ అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ సందేహాల నివృత్తి కోసమూ, ఇప్పటికే అరెస్టయిన డెయిరీల ప్రతినిధులు తమకు తాముగానే ఈ వ్యవహారం నడిపారా లేక తెర వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది తేల్చుకునేందుకు సిట్‌ అధికారులు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ముందుగా టీటీడీలోని అప్పటి కీలక అధికారిని, ఆపై పాలకమండలి ముఖ్యులను విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సిట్‌ అధికారుల దర్యాప్తులో కొత్తగా మరో అంశం వెలుగు చూసినట్టు సమాచారం. ఏఆర్‌ డెయిరీ నుంచి టీటీడీకి సరఫరా చేసిన ఎనిమిది ట్యాంకర్లలో నాలుగింటిని అనుమతించి, మిగిలిన నాలుగింటిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి పరిమాణంలో కూడా తేడాలున్నట్టు సిట్‌ గుర్తించింది. ట్యాంకరుకు కనీసం 2వేల నుంచి 3వేల కిలోల చొప్పున తేడా ఉన్నట్టు సమాచారం. టీటీడీకి అందజేసిన ట్రిప్‌ షీట్లలో ఎక్కువ పరిమాణం నమోదు చేశారని, అదే డెయిరీలోని లాగ్‌ షీట్లలో తక్కువ పరిమాణం నమోదు చేశారని తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

అప్పు కట్టలేదని ఏం చేశారంటే..

ఉచితం.. అనుచితం

మృతదేహం జాడ దొరకలేదు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 13 , 2025 | 07:55 AM