TTD EO: తిరుపతిలో తొక్కిలాటపై టీటీడీ ఈవో ఏమన్నారంటే..
ABN, Publish Date - Jan 09 , 2025 | 11:03 AM
Tirupati stampede: తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారిని టీటీడీ ఈవో శ్యామలారావు పరామర్శించారు. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. దాదాపు 41 మంది గాయపడ్డారన్నారు. ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నామని తెలిపారు.
తిరుపతి, జనవరి 9: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి పద్మావతి మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ ఈవో శ్యామలారావు (TTD EO Shyamalarao) గురువారం ఉదయం పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్తితిపై వైద్యుల బృందంతో ఈవో ఆరా తీశారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ... తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందారని.. దాదాపు 41 మంది గాయపడ్డారన్నారు. వారిలో ఇప్పటికే 21 మందిని డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఘటనకు కారణం ఏంటనేది విచారిస్తున్నామని తెలిపారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉందని అన్నారు. బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. భక్తుల ఆరోగ్యం పరిస్థితిని స్విమ్స్ సూపరింటెండెంట్ రవికుమార్ వివరించారు. అందరికీ చికిత్స అందిస్తున్నామని.. ఈ రోజు సాయంత్రానికి చాలా మందిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారు. ముగ్గురు మాత్రం మరో రెండు మూడు రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉండాల్సి ఉంటుందని సూపరింటెండెంట్ రవికుమార్ పేర్కొన్నారు.
కాగా.. వైకుంఠ ఏకాదాశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాటు చేసిన టోకెన్ కౌంటర్ల వద్ద తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కౌంటర్ కేంద్రాల వద్ద అర్ధరాత్రి తొక్కిసలాట జరగడంతో ఆరుగురు భక్తులు మృతి చెందారు. వారిలో ఐదుగురు మహిళలే ఉన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం అర్ధరాత్రి నుంచి తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో దాదాపు 90 కౌంటర్లను ఏర్పాటు చేసింది టీటీడీ.
ముందుగా గురువారం తెల్లవారుజామున కౌంటర్లు తెరవాలని టీటీడీ భావించినప్పటికీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. దీంతో భక్తులు తిండి, నీళ్లు మరిచి బుధవారం మధ్యాహ్నం నుంచే కౌంటర్ కేంద్రాల వద్దకు భారీగా చేరుకున్నారు. బుధవారం రాత్రి గేట్లు తెరవగా భక్తులు ఒక్కసారిగా దూసుకొచ్చారు. దీంతో మూడు కౌంటర్ కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో ఆరుగులు భక్తులు మృత్యువాత పడగా.. అనేక మంది గాయపడ్డారు. వెంటనే వారిని రుయా, స్విమ్స్ ఆస్పత్రులకు తరలించారు. తొక్కిసలాటలో ఊపరాడక అనేక మంది మహిళలు అల్లాడిపోయారు.
ఇవి కూడా చదవండి...
తొక్కిసలాటకు కారణం ఇదే.. భక్తుల ఆవేదన
ఆఫ్ఘాన్‌పై బ్యాన్.. ఇక మీదట నో క్రికెట్
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 09 , 2025 | 01:19 PM