Share News

CM Chandrababu : నియోజకవర్గానికో విజన్‌ ప్లాన్‌

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:02 AM

రానున్న ఐదేళ్లకు నియోజకవర్గ స్థాయి విజన్‌ అమలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాసనసభలో విజన్‌ ప్లాన్‌ను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సభ్యులకు వివరిస్తూ ఆయన మాట్లాడారు.

CM Chandrababu : నియోజకవర్గానికో విజన్‌ ప్లాన్‌

  • ఎమ్మెల్యే చైర్మన్‌గా అమలు పర్యవేక్షణ

  • జిల్లా స్థాయిలో చైర్మన్‌గా ఇన్‌చార్జ్‌ మంత్రి

  • ఇకపై ఏటా 15 శాతం వృద్ధి రేటు లక్ష్యం

  • పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు

  • ఐదేళ్లలో ప్రతి కుటుంబానికీ సొంతిల్లు

  • విద్యార్థులకు యూనిక్‌ స్కిల్‌ పాస్‌పోర్టులు

  • ఉగాది రోజు పీ-4 కార్యక్రమం ప్రారంభం

  • మే నెలలో తల్లికి వందనం

  • స్వర్ణాంధ్ర 2047పై అసెంబ్లీలో చంద్రబాబు ప్రసంగం

  • 2004, 2019లో ఓటమికి నేనే కారణం.. నన్ను ఎవరూ ఓడించలేరు: చంద్రబాబు

అమరావతి, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా రానున్న ఐదేళ్లకు నియోజకవర్గ స్థాయి విజన్‌ అమలు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శాసనసభలో విజన్‌ ప్లాన్‌ను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా సభ్యులకు వివరిస్తూ ఆయన మాట్లాడారు. ‘‘మన రాష్ట్రం ప్రస్తుతం ఏ దశలో ఉంది....భవిష్యత్తులో ఎంత అభివృద్ధి జరగాలనే లక్ష్యాలను స్వర్ణాంధ్ర-2047లో నిర్దేశించాం. జిల్లాలు, నియోజకవర్గాల వారీగా అక్కడి పరిస్థితులకు అనుగుణంగా కొంత వ్యత్యాసం ఉంటుంది. కానీ రాష్ట్రస్థాయిలో విజన్‌ ప్లాన్‌ లక్ష్యాలు చేరుకోవాలి’’ అని ఆకాంక్షించారు. ఒకప్పుడు యూదు జాతి గొప్ప జాతిగా ఉండేదని, 2047 నాటికి ఆ స్థానంలో తెలుగు జాతి ఉంటుందని ఆకాంక్షించారు. ఇప్పటికే కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ నియోజకవర్గాలకు విజన్‌ ప్రణాళికలు తయారయ్యాయని తెలిపారు. ‘‘ఇకపై ప్రతి నియోజకవర్గానికీ అక్కడి అవసరాలు, భౌగోళిక, సామాజిక అంశాల ఆధారంగా విజన్‌ ప్లాన్‌ తయారుచేస్తాం. నియోజకవర్గ పర్యవేక్షణకు నియోజకవర్గ ఎమ్మెల్యే చైర్మన్‌గా ఉంటారు. ఒక స్పెషల్‌ ఆఫీసర్‌, ఐదుగురు సచివాలయాల ఉద్యోగులు, ఒక యంగ్‌ ప్రొఫెషనల్‌ అందులో ఉంటారు. జిల్లా స్థాయిలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి చైర్మన్‌గా ఉంటారు. ప్రతి మూడు నెలలకు పురోగతిని సమీక్షిస్తాం. వచ్చే కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్లాన్‌లు ఆవిష్కరిస్తాం.’’ అని చంద్రబాబు తెలిపారు. పీ-4 కార్యక్రమాన్ని ఉగాదికి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించాలని సూచించారు. ఇంకా ఏమన్నారంటే..


రూ.55 లక్షల తలసరి ఆదాయం లక్ష్యం

‘‘నియోజకవర్గ స్థాయి విజన్‌ ప్లాన్‌ అమలుకు, పేదరిక నిర్మూలనకు ఎమ్మెల్యేలదే బాధ్యత. మీ నియోజకవర్గాల్లో ఉన్న అవసరాలకు అనుగుణంగా దీనిని అమలుచేయండి. నా నియోజకవర్గాన్ని చూసుకుంటూనే, రాష్ట్ర స్థాయిలో లక్ష్యాలు చూసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2,98,058. అది వచ్చే ఏడాదికి రూ.3,47,871, 2028-29 నాటికి రూ.5,42,985కు చేరాలి. 2047 నాటికి అది రూ.54,60,748 కావడం మన లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్ర జీఎ్‌సడీపీ 15.93 లక్షలు ఉండగా, 2047 నాటికి రూ.308 లక్షల కోట్లు కావాలి. ఇకపై వృద్ధి రేటు 15శాతం కావాలి. 2014-19 మధ్య వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. అది 1.5శాతం పెరగాలి. అయితే రానున్న ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధి రేటు అవసరం.’’

అసాధ్యం అనుకోకూడదు

‘‘చాలా మంది ఇవి సాధ్యమా అనుకుంటారు. కానీ అసాధ్యమైన లక్ష్యాలతోనే ముందుకు సాగాలి. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 5.3కోట్లుగా ఉంది. 2047 నాటికి 5.8కోట్లకు పెరగాలి. అక్షరాస్యత రేటు 72శాతం నుంచి వంద శాతం కావాలి. మనుషుల జీవితకాలం 70.6 ఏళ్ల నుంచి 85 ఏళ్లకు పెరగాలి. పనిచేసే మహిళల శాతం 45.8 శాతం నుంచి 80 శాతం దాటాలి. ప్రస్తుతం రాష్ట్రంలో పట్టణ జనాభా 36 శాతంగా మాత్రమే ఉంది. అది 60శాతం కావాలి. నిరుద్యోగిత రేటు 4.1శాతం నుంచి 2లోపునకు చేరాలి. ఎగుమతుల విలువ రూ.1.68లక్షల కోట్ల నుంచి రూ.39.12లక్షల కోట్లకు పెరగాలి.’’

లక్ష్యసాధనకు పది సూత్రాలు

స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనకు పది సూత్రాలు ప్రతిపాదిస్తున్నాం. పేదరిక రహిత రాష్ట్రం, జనాభా నిర్వహణ, నైపుణ్య శిక్షణ-ఉపాధి, నీటి భద్రత, వ్యవసాయంలో టెక్నాలజీ తదితర అంశాల ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటి అమలు కోసం జిల్లా, నియోజకవర్గంతో పాటు మండలం, మున్సిపాలిటీ స్థాయిల్లోనూ విజన్‌ ప్లాన్‌ అమలుచేస్తాం. అనంతరం పంచాయతీలు, వార్డులకు స్థానికంగా ప్లాన్‌లు రూపొందించుకుంటారు.’’


ప్రతి కుటుంబానికీ సొంతిల్లు

‘‘వచ్చే ఐదేళ్లలో ప్రతి కుటుంబానికీ సొంతిల్లు ఉండటం లక్ష్యం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తాం. ఒకప్పుడు ఒక కుటుంబంలో ఐదుగురు సభ్యులు దాటితే రేషన్‌ బియ్యం ఐదుగురికే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు జనాభా పెరగాల్సిన అవసరం ఉంది. అందుకే కుటుంబంలో ఎంత మంది ఉన్నా పరిమితి లేకుండా బియ్యం ఇస్తాం. అలాగే ఎక్కువ మంది సభ్యులుండే కుటుంబాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆలోచన చేస్తున్నాం.’’

భాషపై రాజకీయాలు

‘‘భాషను ద్వేషించకూడదు. మనది తెలుగు. జాతీయ భాష హిందీ. అంతర్జాతీయ భాష ఇంగ్లీష్‌ నేర్చుకుంటున్నాం. అవసరమైతే జపనీస్‌, జర్మన్‌ కూడా మన పిల్లలకు నేర్పిస్తాం. భాషపై లేనిపోని రాజకీయాలు వద్దు. విద్యార్థులకు యునిక్‌ స్కిల్‌ పాస్‌పోర్టులు ఇస్తాం. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం.’’

భూగర్భ జలాలు పెరగాలి

‘‘కర్ణాటక, తెలంగాణ, తమిళనాడులో నీటి సమస్య ఉంది. కానీ ఏపీలో ఏటా గోదావరి నుంచి రెండువేల టీఎంసీలు సముద్రంలోకి వృథాగా వెళ్తున్నాయి. అందుకే వాటిని వినియోగించుకునేందుకు పోలవరం-బనకచర్ల, పోలవరం-వంశధార పేరుతో నదుల అనుసంధానం చేస్తున్నాం. పీ-4కు డ్యాష్‌బోర్డు తయారుచేసి ప్రతి నియోజకవర్గంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటాం. మే నెలలో తల్లికి వందనం, ఆ తర్వాత రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తాం.’’ అని చంద్రబాబు అన్నారు.


నా ఓటమికి నేనే కారణం

2004,2019 ఓటమిపై చంద్రబాబు వ్యాఖ్యలు

‘‘నా ఓటమికి నేను కారణం. నన్ను ఎవరూ ఓడించలేరు. ఎప్పుడూ పని పని పని అని పరిగెత్తుతూ ఉండేవాడిని. అందులో మునిగిపోయి ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయంలో అప్పట్లో కొంత అంతరం వచ్చింది. ప్రతి పనిలోనూ ప్రజల్ని భాగస్వామ్యం చేస్తే ఎప్పుడూ గెలుపు మనతోనే ఉంటుంది. ప్రజలు కూడా ఒక్కోసారి తాత్కాలికమైన వాటికోసం చూస్తే ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ర్టాన్ని ఇంతలా అభివృద్ధి చేసినా 2004, 2019లో ఓడిపోవడానికి కారణాలు ఏంటని సోమవారం అసెంబ్లీలో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు ఇలా స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

AP Cabinet Decision : చేనేతలకు ఉచిత విద్యుత్‌

AP Govt: ఎస్సీ వర్గీకరణకు ఓకే

Updated Date - Mar 18 , 2025 | 07:42 AM