Share News

CM Chandrababu : డేటా అనుసంధానం వేగవంతం చేయాలి

ABN , Publish Date - Feb 11 , 2025 | 06:54 AM

ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

CM Chandrababu : డేటా అనుసంధానం వేగవంతం చేయాలి

  • శాంతిభద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాల వినియోగం

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌లో మరిన్ని సేవలు అందుబాటులోకి

  • ఆర్టీజీఎ్‌సపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

అమరావతి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో సోమవారం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ(ఆర్టీజీఎస్)పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని శాఖల మధ్య ఉన్న డేటాను ఆర్టీజీఎ్‌సతో అనుసంధానం చేసే పనుల్లో వేగం పెరగాలని సూచించారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజలకు ప్రస్తుతం అందిస్తున్న సేవలతోపాటు అదనంగా ఏం అందించగలమో పరిశీలించాలని ఆదేశించారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌ వినియోగంలో సాంకేతిక అవరోధాలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 14,770 సీసీ కెమెరాలు వినియోగంలో ఉన్నాయని, శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరస్తులను పట్టుకోవడంలో ఏఐ సాంకేతికను ఉపయోగించుకోవాలని నిర్దేశించారు. నేరం జరిగిన వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌ ఉన్నతాధికారికి అలర్ట్‌ మెసేజ్‌ వెళ్లి, నేరస్తులు పారిపోకుండా పట్టుకునేందుకు సీసీ కెమెరాలు సహాయపడేలా రూపకల్పన చేయాలన్నారు. రౌడీషీటర్లపై ముందుగానే నిఘా పెట్టి, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టీజీఎస్‌ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు ఏయే దశల్లో ఉన్నాయో ఆ విభాగం సీఈవో దినేశ్‌కుమార్‌ వివరించారు. ఏఐ వినియోగంలో గూగుల్‌ సంస్థ సహకారం అందిస్తోందని చెప్పారు. సమావేశంలో సీఎస్‌ విజయానంద్‌, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2025 | 06:54 AM