CM Chandrababu Naidu: మళ్లీ అంబేడ్కర్ విదేశీ విద్య
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:35 AM
అంబేడ్కర్ జయంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎస్సీ విద్యార్థులకు విదేశీ విద్యా దీవెన పునఃప్రారంభం చేశారు. వైసీపీ నేతలపై కుటుంబాలను నాశనం చేశారంటూ విమర్శలు చేశారు.

ఎస్సీల పిల్లలకు అత్యున్నత విద్యే లక్ష్యం
పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తా
రాజకీయమంటే మభ్యపెట్టడంకాదు..
దారి చూపడమని పది నెలల్లో చూపాం
ఒక్క కుటుంబాన్నైనా నాడు బాగు చేశారా?
ఇంకా కుటుంబాలను నాశనం చేశారు
వైసీపీ నాయకులపై చంద్రబాబు ధ్వజం
పొన్నెకల్లులో 369 కుటుంబాల దత్తత
కొత్త పనిముట్లు.. గ్యారేజీ
తాడికొండ నియోజకవర్గం పొన్నెకల్లు పర్యటనలో ఓ బైక్ రిపేరు దుకాణానికి వెళ్లిన సీఎం చంద్రబాబు.. మెకానిక్ ప్రవీణ్ దీనస్థితిని గమనించి చలించిపోయారు. అతని వద్ద ఉన్న పనిముట్లను పరిశీలించి.. విరిగిపోయిన రెంచీలు, ఇతర పనిముట్లు చూసి విస్తుపోయారు. ప్రవీణ్‌కు నైపుణ్య శిక్షణ ఇప్పించి, అధునాతన పనిముట్లతో గ్యారేజీ ఏర్పాటు చేయించాలని కలెక్టర్‌ను అక్కడికక్కడే ఆదేశించారు.
గుంటూరు, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ జీవితంలో కనీసం ఒక్క కుటుంబాన్నైనా బాగుచేశారా? ఇంకా చెప్పాలంటే కుటుంబాలను నాశనం చేశారు. అలాంటి మీరా రాజకీయాల గురించి మాట్లాడేది?’’ అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రబోధించిన ‘పే బ్యాక్ టూ ద సొసైటీ’ స్ఫూర్తితోనే పీ4 కార్యక్రమం రాష్ట్రంలో ప్రారంభించామని తెలిపారు. ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదవాలన్న కలను మళ్లీ నిజం చేస్తామని, అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనను తిరిగి ప్రారంభిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.102 కోట్లు విలువచేసే అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన ప్రజావేదికలో ఆయన పాల్గొన్నారు. పీ4 కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన 369 బంగారు కుటుంబాలను (నిరుపేద కుటుంబాలను) ఆయన మార్గదర్శులుగా ముందుకు వచ్చిన ప్రముఖులకు దత్తత ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొలుత ఆయన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా పథకం ద్వారా విదేశాల్లో చదువుకుని ఉన్నత ఉద్యోగాలు పొందిన అనిల్, కొరివి రత్నలతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వీరిలో రత్నలత ఆస్ట్రేలియాలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా, అనిల్ కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు.
‘‘గతంలో జన్మభూమి కార్యక్రమానికి నేను పిలుపునిచ్చిన సమయంలో విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఎందరో రాష్ట్రంలో స్కూళ్లు కట్టించారు. ఆ విద్యావకాశాలను అందుకుని అనిల్, రత్నలత వంటి అనేక మంది జీవితాలు మార్చుకున్నారు. మనం ప్రభుత్వం తరుపున రూ.10 లక్షల చొప్పున వారి చదువులకు సహాయం చేశాం. వారు ఇప్పుడు ఏడాదికి రూ.60 లక్షలు చొప్పున సంపాదిస్తున్నారు. ఒకటి, రెండు కుటుంబాలను వారు కూడా దత్తత తీసుకోవడం బాగుంటుంది’’ అని చంద్రబాబు సూచించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
అర్థం చేసుకుంటే బంగారు భవిష్యత్తు
‘‘పేదరికం లేని సమాజానికి శ్రీకారం చుట్టా. ఆ సంకల్పాన్ని సాధించి తీరుతా. అర్థం చేసుకుంటే అందరికీ బంగారు భవిష్యత్తే.. 2004, 2019లాగా ఆలోచిస్తే..నాకు వైకుంఠపాళే. మళ్లీ మొదటికి వస్తుంది. తిరిగి పునర్నిర్మించుకోవాలి. 2019-24 మధ్య కాలాన్ని చూశారు. అంతటి అరాచకాన్ని ఎప్పుడూ చూసి ఉండరు. ఇప్పుడు తిరిగి రాజధానిని ప్రపంచం మొత్తం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, హక్కుల ప్రదాత అయిన అంబేడ్కర్ జయంతి రోజున పీ-4 కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. అణగారిన, పేద కుటుంబంలో పుట్టిన అంబేడ్కర్ చదువుకోవడానికి బరోడా మహారాజు సహాయం చేశారు. ఆ విధంగా సహాయం చేయబట్టే బరోడా మహారాజు చరిత్రలో నిలిచిపోయారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌ను బ్రాహ్మణ కుటుంబం ఆదుకోబట్టే ఆయన అంతటి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. పేదరికం లేని సమాజ సమాజ సాధన కోసం నేను సంకల్పం తీసుకున్నాను. అదే పీ-4 కార్యక్రమం.’’
ఎస్సీల పిల్లలకు మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు
‘‘గత ప్రభుత్వంలో పాలకులు అమరావతిని చంపేశారు. కులం, మతం, ప్రాంతాల వారీగా వైషమ్యాలు రగిల్చిన వారికి ప్రజలు బుద్థి చెప్పారు. ప్రజల ఆశీస్సులతో అమరావతిని అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం. అమరావతికి దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థలు రాబోతున్నాయి. ఇప్పటికే ఎస్‌ఆర్‌ఎం, విట్ కొలువుదీరాయి. అన్ని కాలేజీలను తీసుకొచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం. భవిష్యత్‌లో ఎస్సీ పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు మరిన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం.’’
రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే కూటమి కట్టాం
‘‘రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ేస్వచ్ఛ లభించింది. గత ప్రభుత్వంలో ఐదేళ్లూ మాట్లాడాలంటేనే ప్రజలు భయపడ్డారు. నాలాంటి వారు కూడా బయటకురాలేని పరిస్థితి. ఇప్పుడు మన పాలనలో స్వర్ణయుగం రానుంది. ప్రజాస్వామ్యాన్ని పునరుద్థరించడమే కాకుండా నష్టపోయిన రాష్ర్టాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతోనే జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాం. సూపర్ సిక్స్ పథకాల ద్వారా పేదలకు అండగా నిలిచాం. ఆవిర్భావం నుంచీ కుల వివక్షపై టీడీపీ యుద్థం చేసింది. జీవో నం..694 ప్రకారం జిల్లా, డివిజన్, మండల స్థాయుల్లో ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశాం. కుల వివక్ష చూపే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టేందుకు ఆదేశాలు ఇచ్చాం. ఎస్సీ అట్రాసిటీ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులు పెట్టాం. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే అంబేడ్కర్‌కు భారతరత్న వచ్చింది. నేను యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా ఉన్నప్పుడే ఎస్సీ వర్గానికి చెందిన కే.ఎల్.నారాయణన్‌ను రాష్ట్రపతిని చేశాం.’’
ఆద్యంతం ఉత్సాహభరితం!
సీఎం సరదా ప్రసంగం
గుంటూరుజిల్లా పొన్నెకల్లులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. మూడున్నర గంటలపాటు సాగిన సభలో సభికులకు విసుగురాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉపన్యాసం సాగింది. సభికుల్లో ఉత్సాహాన్ని నింపుతూ మొదలైన ఉపన్యాసం ఎన్నోరకాల భావోద్వేగాలకు వేదికైంది. చంద్రబాబు యువతలో జోష్ నింపుతూనే, వారికి బాధ్యత గుర్తుచేశారు. తమ తప్పులను సైతం నవ్వుతూనే అంగీకరిస్తూ, వైసీపీ అబద్ధపు ప్రచారాలతో అందరం మోసపోయామని వ్యాఖ్యానించారు.
దేవుళ్లపై దాడులుచేసిన వారికి ఇంత భక్తి ఎక్కడిది?
‘‘దేవుళ్లపై దాడులు చేసిన వారికి వెంకటేశ్వరస్వామిపై ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది.? తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయని అబద్ధాలు చెబుతున్నారు. తిరుమలకు వెళ్లినప్పుడు సంప్రదాయాలు పాటించని వారు కూడా దేవుళ్ల గురించి మాట్లాడటమా? గతంలోనూ అంతే... అసలు పింక్ డైమండ్ లేకపోయినా మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. నేను రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తే అధికారంలోకి వచ్చాక అసలు పింక్ డైమండ్ లేదని కోర్టులో కేసు వెనక్కి తీసుకున్నారు. వివేకా హత్యలో సాక్ష్యాలు తారుమారు చేయడంతోపాటు సాక్షులను కూడా చంపేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు సాక్షులు చనిపోయారు. నేను కూడా గొడ్డలిపోటును గుండెపోటుగా నమ్మి ఒకసారి మోసపోయా. మాటలు చెప్పడం సులభం. మంచి పనులకు నలుగురిని ఒప్పించడం, పేదలకు దారి చూపడం సులువు కాదు’’ అని చంద్రబాబు అన్నారు.
మా ఉన్నతికి చంద్రబాబే కారణం
‘‘మాది గుంటూరు జిల్లా వేములూరుపాడు గ్రామం. దిగువ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నేను 2014లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు పెడితే నా విదేశీ చదువుల కోసం రూ.10 లక్షల ఆర్థిక సాయం అందింది. నాడు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం చేయబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నా’’నని ఆస్ట్రేలియాలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రత్నలత తెలిపారు. చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటానని రత్నలత తండ్రి చెప్పారు. కెనడాలో ఏడాదికి రూ. 60 లక్షలు సంపాదిస్తున్నానని అనిల్ తెలిపారు. ‘‘మాది గుంటూరు జిల్లా తెనాలి. మా అమ్మమ్మ రోడ్లు ఊడ్చి నన్ను చదివించింది. తెలుగుమీడియంలో చదివాను. అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా కెనడాలో మాస్టర్స్ చదివే అవకాశం నాటి సీఎం చంద్రబాబు కల్పించారు.’’ అని కెనడాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న అనిల్ తెలిపారు. వారితో చంద్రబాబు వర్చువల్‌గా మాట్లాడారు.
- రత్నలత, అనిల్
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..