ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Naidu : 10 లక్షల కోట్ల పెట్టుబడులు

ABN, Publish Date - Jan 12 , 2025 | 03:14 AM

కనీవిని ఎరుగని రీతిలో హరిత ఇంధన రంగంలో రాష్ట్రానికి రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.

  • హరిత ఇంధన రంగంలోకి వస్తున్నాయి

  • 1. 85 లక్షల కోట్లతో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌

  • పూడిమడకలో ఏర్పాటుచేస్తున్న ఎన్టీపీసీ

  • రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ సౌర ఫలకాలు

  • 5 వేల విద్యుత్‌ చార్జింగ్‌ స్టేషన్లు,

  • బ్యాటరీ శ్వాపింగ్‌ సదుపాయాల ఏర్పాటు

  • త్వరలో ‘హ్యాపీ సండే’: చంద్రబాబు

‘‘పొరుగింటిలో ఎవరున్నారో కూడా తెలియనంతగా మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా హ్యాపీ సండేలను ఏర్పాటు చేయబోతున్నాం. వెల్తీ... హెల్తీ... హ్యాపీ ఏపీ అనేది ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రజల్లో ఆనందకరమైన భావాలు పెంపొందించి నలుగురు కలిసి పాల్గొనే కార్యక్రమాలను పెంచాలని భావిస్తున్నాం. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, పెద్ద గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. వాటిలో పాల్గొనడానికి... చూడటానికి వచ్చేవారిలో ఈ కార్యక్రమాలు ఆనందం నింపుతాయి’’

- సీఎం చంద్రబాబు

అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కనీవిని ఎరుగని రీతిలో హరిత ఇంధన రంగంలో రాష్ట్రానికి రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమ్మోనియా, కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌, సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ తదితర రంగాల్లో ఇంత భారీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. ఇందులో మొదటి భారీ పెట్టుబడిగా విశాఖపట్నం వద్ద పూడిమడకలో కేంద్ర ప్రభుత్వ సంస్ధ ఎన్టీపీసీ భాగస్వామ్యంతో రూ.లక్షా ఎనభై ఐదు వేల కోట్ల పెట్టుబడితో గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌ ఏర్పాటు కాబోతోందని, దీనికి ప్రధాని మోదీ ఇటీవల శంకుస్ధాపన చేశారని వివరించారు. శనివారం ఆయన ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పలు రంగాల్లో కొత్త ఆలోచనల దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్న అంశాలను వివరించారు. ఆయన చెప్పిన అంశాలు సంక్షిప్తంగా....


గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌

‘‘పూర్తిగా హరిత ఇంధనంతోనే ఇక్కడ హైడ్రోజన్‌ తయారవుతుంది. సముద్రపు నీటిని రసాయనిక ప్రక్రియ ద్వారా విడగొట్టి గ్రీన్‌ హైడ్రోజన్‌ ఉత్పత్తి చేస్తారు. ఈ హబ్‌లో రసాయనాలు, ఎరువులు వంటివి తయారుచేసి ఎగుమతి చేస్తారు. హరిత ఇంధనంతో తయారైన రసాయనాలు, ఎరువులకు విదేశాల్లో డిమాండ్‌ ఉంది. దీనికి పొరుగునే ఉన్న ఎన్టీపీసీ ఽథర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో బొగ్గు మండించడం వల్ల వెలువడే కార్బన్‌ డై ఆక్సైడ్‌నూ ఈ ప్లాంట్‌లో హైడ్రోజన్‌ తయారీకి వాడతారు. దీనివల్ల వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు తగ్గిపోతాయి. సంప్రదాయ విద్యుత్‌తో కాకుండా హైడ్రోజన్‌తో ఉక్కు, అల్యూమినియం తయారుచేయడం వల్ల ఆ సమయంలో వెలువడే వేడి కూడా తగ్గుతుంది. దీనివల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. పర్యావరణాన్ని కాపాడటంలో మన దేశ లక్ష్యాలను సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది. గ్రీన్‌ కో కంపెనీ కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్స్‌ కంపెనీని టేకోవర్‌ చేసి గ్రీన్‌ అమ్మోనియా తయారుచేసి ఎగుమతి చేయబోతోంది. సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజీ ద్వారా ఉత్పత్తి అయిన పునరుత్పాదక విద్యుత్‌ను కాకినాడ తీసుకువచ్చి దాని ద్వారా గ్రీన్‌ అమ్మోనియా తయారు చేస్తారు. ఈ ప్లాంట్‌పై ఈ కంపెనీ రూ.25వేల కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది’’

రిలయన్స్‌ బయో గ్యాస్‌ కేంద్రాలు

‘‘రిలయన్స్‌ సంస్థ రాష్ట్రంలో 500 కంప్రెస్డ్‌ బయో గ్యాస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయబోతోంది. ఒక్కోటీ రూ.130 కోట్ల పెట్టుబడితో పెట్టనున్నారు. వృఽథా భూముల్లో గడ్డి పెంచి దానిద్వారా ఈ కేంద్రాల్లో బయోగ్యాస్‌ ఉత్పత్తి చేస్తారు. రైతుల నుంచి భూమిని కౌలుకు తీసుకుంటారు. ఎకరానికి ఏడాదికి రూ.30వేలు కౌలు ఇస్తారు. బయోగ్యాస్‌ తయారీలో ఉత్పత్తయ్యే వృఽథా పదార్థం ఎరువుగా వినియోగించి భూసారం పెంచడానికి వాడుకొనే వీలుంది. ఈ కేంద్రాల ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా వస్తాయి’’


కుప్పంలో బ్యాటరీ శ్వాపింగ్‌ చార్జింగ్‌ పథకం

‘‘కుప్పం నియోజకవర్గంలో ప్రతిఇంటి మీదా సౌర విద్యుత్‌ ఉత్పత్తి కోసం సౌర ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇళ్లలో విద్యుత్‌ వాహనాల బ్యాటరీలను చార్జింగ్‌ చేయించుకోవడానికి బెంగళూరుకు చెందిన సంస్థ ముందుకొచ్చింది. చార్జింగ్‌ అయిన బ్యాటరీలను విద్యుత్‌ వాహనాల్లో వినియోగించుకోవడానికి అద్దెకు ఇస్తుంది. విద్యుత్‌ వాహనాలను వాడేవారు తమ బ్యాటరీలో చార్జింగ్‌ అయిపోయిన వెంటనే ఈ సంస్థకు దానిని ఇస్తే, ఫుల్‌ చార్జింగ్‌ ఉన్న మరో బ్యాటరీ అద్దెకు ఇస్తారు. అలా అవసరం వచ్చినప్పుడల్లా బ్యాటరీలు మార్చుకోవచ్చు. దీనికి ఆ సంస్థ కొంత మొత్తం వసూలు చేస్తుంది. దీనికోసం తమ వద్ద వేల సంఖ్యలో ఉన్న బ్యాటరీలను కుప్పం నియోజకవర్గంలోని ఇళ్లలో చార్జింగ్‌ చేయించుకొని దానికి ఆ ఇంటివారికి ఆ సంస్థ కొంత మొత్తం చెల్లిస్తుంది. ఆ ఇంటి యజమానికి ఇది అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది. సౌర ఫలకాల వల్ల ఉచిత విద్యుత్‌ వస్తే దానిని చార్జింగ్‌కు వాడుకోవడం వల్ల అదనపు ఆదాయం వస్తుంది. కుప్పంలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసి బాగుంటే రాష్ట్రం అంతా విస్తరిస్తారు’’

ప్రతి ఇంటికీ సౌర ఫలకాలు

‘‘ప్రభుత్వ ఖర్చుతో ప్రతిఇంటికీ సౌర ఫలకాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. సూర్యఘర్‌ పఽథకం కింద ప్రస్తుతం ఈ ఫలకాల ఏర్పాటుకు కేంద్రం సబ్సిడీ ఇస్తోంది. ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వం మొత్తం ఖర్చు భరించి వారి ఇళ్లపై సౌర ఫలకాలు ఏర్పాటు చేయిస్తోంది. తాజాగా అన్ని వర్గాలవారి ఇళ్లపైనా వీటిని ఏర్పాటు చేయడంపై యోచిస్తున్నారు. ప్రభుత్వం తన ఖర్చుతో వీటిని ఏర్పాటు చేస్తుంది. వీటి ద్వారా తయారయ్యే విద్యుత్‌లో కొంత భాగం ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేవరకూ తీసుకొని, తర్వాత మొత్తం యూనిట్‌ను ఇంటి యజమానికి అప్పగించేస్తారు. అప్పటినుంచి మొత్తం విద్యుత్‌ యజమానికే చెందుతుంది. సుమారుగా ఐదేళ్లపాటు కొంత వాటా విద్యుత్‌ను ప్రభుత్వం తీసుకొనే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి తక్కువ ధరకు వచ్చే సౌర విద్యుత్‌ లభ్యత పెరుగుతుంది’’


బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లు

‘‘విద్యుత్‌ వాహనాలకు ఉపయోగపడేలా రాష్ట్రవ్యాప్తంగా 5వేల చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఫుల్‌చార్జింగ్‌ బ్యాటరీని అప్పటికప్పుడు మార్చుకొనే శ్వాపింగ్‌ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం’’

మరికొన్ని కొత్త ఆలోచనలు...

‘‘ప్రభుత్వపరంగా మరికొన్ని కొత్త ఆలోచనలు చేస్తు న్నాం. కుప్పం నియోజకవర్గంలో వినికిడి సమస్యలు, మానసిక ఎదుగుదల సమస్యలు, మాట్లాడటంలో సమస్యలు ఉన్న పిల్లలకు వివిధ అంశాలను యాప్‌ల సహాయంతో నేర్పే టెక్నాలజీని ఒక సంస్థ తెచ్చింది. దానిని కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో వాడి చూస్తున్నాం. ఇది బాగుందని, ఉపయోగకరంగా ఉందని అంగన్‌వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. ఫలితాలు బాగుంటే రాష్ట్రం అంతా అమలు చేస్తాం. ఆర్గానిక్‌ఉత్పత్తులు ఏ పొలంలో, ఏ ప్రాంతంలో పండాయో తెలిపే కొత్త టెక్నాలజీని ఒక సంస్థ తెచ్చింది. ప్యాకింగ్‌పై ఉన్నగుర్తులను ఫొటో తీస్తే అది ఏ ఊరి పొలంలో పండిందో ఆ టెక్నాలజీ చెబుతుంది. రాష్ట్రంలో సుమారుగా పదివేల ఎకరాల భూమికి ఆర్గానిక్‌ పంటలు పండించడానికి సర్టిఫికెట్‌ అనుమతి ఉంది. ఈ విస్తీర్ణం ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. సర్టిఫైడ్‌ పంటలను కొనుగోలు చేయడానికి చాలా సంస్థలు ముందుకొస్తున్నాయి. రాష్ట్రాన్ని మార్కెట్‌ చేయడానికే దావోస్‌ పర్యటనకు వెళుతున్నాను. ఇక్కడ ఉన్న అవకాశాలను అక్కడకు వచ్చినవారికి వివరిస్తాం. కంపెనీల యాజమాన్యాలతో నెట్‌వర్కింగ్‌ చేసుకొని రాష్ట్రానికి ఆహ్వానిస్తాం’’.


సచివాలయాల్లో సిబ్బంది క్రమబద్ధీకరణ

‘‘గ్రామ, వార్డు సచివాలయాలను 3విభాగాలుగా వర్గీకరిస్తున్నాం. 2,500 జనాభా ఉన్నవి ఒక విభాగం, 2,500- 5,000 జనాభా ఉన్న ప్రాంతాలు రెండో విభాగం, 5వేలు పైన జనాభా ఉన్న ప్రాంతాలు మూడో విభాగం చేశాం. జనాభాను బట్టి సచివాలయాల్లో సిబ్బంది సంఖ్య నిర్ణయం అవుతుంది. మిగులు సిబ్బందిని వారి విధులకు సంబంధించిన ప్రభుత్వ శాఖలకు అప్పగిస్తున్నాం. ఉదాహరణకు ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ను ఇంజనీరింగ్‌ శాఖలకు అప్పగిస్తాం. ప్రభుత్వ శాఖల్లో పనిభారం ఎలా ఉందో శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నాం. చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక అధ్యయనంలో ఆ జిల్లా జీఎ్‌సడీపీలో వ్యవసాయ రంగం వాటా కేవలం 2శాతం ఉంది. అదే ఉద్యానవన పంటల వాటా 18శాతం, పాడిపరిశ్రమ వాటా 18శాతం ఉంది. వ్యవసాయ శాఖలో సిబ్బంది మాత్రం పుష్కలంగా ఉన్నారు. దీనిని ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై ఆలోచన చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఇంటిని...అందులోని వ్యక్తులను నిర్దిష్టంగా గుర్తించే పనిని చేపట్టనున్నాం. ప్రతి వ్యక్తినీ ఆధార్‌తో అనుసంధానిస్తాం. ఆ వ్యక్తులు ఉన్న ఇళ్లను జియో ట్యాగింగ్‌ చేస్తాం. దీంతో ఏ ఇంటిలో ఎవరు ఉంటున్నారు... ఎందరు ఉంటున్నారన్నది పక్కాగా తెలుస్తుంది. ఇటీవల విజయవాడ వరదల్లో నష్టపోయినవారికి ఇచ్చిన పరిహారంలో 10శాతం వారి ఖాతాల్లో పడలేదు. వారి బ్యాంక్‌ ఖాతాలు ఆధార్‌తో అనుసంధానం కాలేదు. ఈ సమస్యను రాష్ట్రం అంతా సవరిస్తున్నాం. సిసి కెమేరాలు, ఐవోటీ పరికరాలు, డ్రోన్లు వంటివాటికి ఈ డేటాను అనుసంధానిస్తాం. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా వ్యక్తికి మందులు పంపాలంటే చిరునామా వెతుక్కోవాల్సిన పనిలేకుండా డ్రోన్‌ సరాసరి అతని ఇంటికి వెళ్లి అందజేసే సౌలభ్యం వస్తుంది. ప్రభుత్వ పఽథకాల అమల్లో చికాకులు కూడా తగ్గుతాయి’’.

Updated Date - Jan 12 , 2025 | 03:14 AM